అవసరమా.... అధ్యక్ష్యా..?

Update: 2018-08-31 15:30 GMT

కాంగ్రెసు తేనెతుట్టను కదిలిస్తుందేమోనన్న అనుమానాలు రాజకీయవర్గాలను కమ్ముకుంటున్నాయి. ముందస్తుగా అసెంబ్లీకి తలపడే క్యాండిడేట్లను ఖరారు చేయడమనే ప్రక్రియను చేపట్టబోతున్నారు. కేసీఆర్ చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా మేము సైతం అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ భారీ ప్రకటన వెలువరించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రెడీ అన్నారు. కేవలం ప్రకటనకే పరిమితమైతే బాగానే ఉండును. సీరియస్ గా సీన్ లోకి దిగిపోవాలని ప్రయత్నించడంతో గందరగోళం మొదలైంది. దాదాపు అరవై సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారీ కసరత్తు మొదలుపెట్టారు. ప్రాథమిక జాబితాను తయారు చేసి అధిష్టానం ముందు ఉంచినట్లుగా సమాచారం. దీంతో అసమ్మతి వర్గాలు ఒక్కసారిగా రోడ్డెక్కి పార్టీని ఆగమాగం చేస్తాయేమోననే ఆందోళన సీనియర్ నేతలను వేధిస్తోంది.

సీట్ల పంచాయతీ...

కొన్ని పార్టీలతో కలిపి సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసి 119 సీట్లకు పోటీ పడాలని కాంగ్రెసు భావిస్తోంది. ఇందులో తాను ఎన్నిసీట్లకు తలపడాలి. మిత్రులకు ఎన్నిసీట్లు కేటాయించాలనే విషయంలో స్పష్టత లేదు. కోదండ రామ్ పార్టీ తెలంగాణ జనసమితి, సీపీఐ, ఇంకా చిన్నాచితక పార్టీలు ఇప్పటికే కాంగ్రెసుతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని సైతం కూటమిలోకి తేవాలనే యత్నంలో ఉన్నారు. ఒకవేళ టీడీపీ అంగీకరిస్తే భారీగానే సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం 20 సీట్లు డిమాండు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కనీసం 15 సీట్లకు పట్టుబట్టవచ్చంటున్నారు. తక్కువలో తక్కువ 12 సీట్లు అయినా ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ జనసమితి సైతం అదే సంఖ్యలో సీట్లు కోరవచ్చు.ఈ రెంటి కోటా 24 పోతే మిగిలిన స్థానాల్లోనే సీపీఐ, కాంగ్రెసు అభ్యర్థులను నిలపాల్సి ఉంటుంది. సీపీఐ కు నాలుగు స్థానాలు ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు. మొత్తమ్మీద ఈ లెక్కలన్నిటినీ సరిచూసుకున్న తర్వాతనే ముందుగా 60 సీట్లకు తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించాలనే యోచన చేస్తున్నారు.

పదవుల పైరవీ...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దం చేసే క్రమంలో భాగంగా భారీగా పార్టీ పదవులు ప్రకటించబోతున్నారు. రాష్ట్ర నేతలకు జాతీయస్థాయి పదవులు పెద్దగా లభించలేదు. కోర్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మేనిఫెస్టో కమిటీ వంటిచోట్ల మొండిచెయ్యి చూపించారు. కాంగ్రెసు వర్కింగు కమిటీలోనూ వర్కవుట్ కాలేదు . ఇక మిగిలినవి రాష్ట్రపదవులే. ఇక్కడ కూడా తమకు అన్యాయం జరుగుతుందేమోననే ఆందోళనలో చాలామంది సీనియర్ నేతలు ఢిల్లీకి పరుగులు తీస్తున్నారు. టిక్కెట్టు వచ్చినా, రాకపోయినా ఈలోపు తమ ప్రాంతాల్లో చెప్పుకునేందుకు , ప్రచారం చేసుకునేందుకు ఏదో ఒక రాష్ట్రస్థాయి పదవి కావాలని బలంగా ఆశిస్తున్నారు. కొత్తగా నియమించిన కీలక కమిటీల్లో తమకు తెలిసిన వ్యక్తులను సంప్రతించి పీసీసీకి రికమండేషన్లు చేయించుకునే పనిలో పడ్డారు. వర్కింగు ప్రెసిడెంటు నుంచి ప్రచార కార్యదర్శి వరకూ వివిధ పదవులకూ తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు రాష్ట్రపదవులపై పట్టుపడుతున్నారు. మొక్కుబడిగా అందరికీ పదవులు పంపిణీ చేసేస్తే ఎవరికీ ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోతుంది. వీరికి ఏరకమైన బాధ్యతలు అప్పగించాలనే విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి.

అలకలు..లుకలుకలు...

ఆలూ లేదు. చూలూ లేదు. అయినా పేరు పెట్టాల్సిందే అన్నట్లుగా అప్పుడే అసంతృప్తి గళాలు వినిపించడం మొదలైంది. సీనియర్ నేత వి. హనుమంతరావు ముందుగా గానాలాపన ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెసు ప్రచార కమిటీ అధ్యక్ష బాద్యతలు తనకు అప్పగించాలని ఆయన డిమాండు చేశారు. లేకపోతే ఊరుకునేది లేదని, పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఏకంగా అధిష్టానాన్నే హెచ్చరించారు. ఈ పదవికి రేవంత్ రెడ్డిని నియమిస్తారని పార్టీలో సీనియర్ నేతలు భావిస్తున్నారు. పార్టీలో చేరే సందర్బంగానే ఈ మేరకు రాహుల్ గాంధీ నుంచి హామీ లభించింది. తర్వాత కొందరు సీనియర్ల అభ్యంతరంతో పెండింగులో పెట్టేశారు. టీపీసీసీ వర్కింగు ప్రెసిడెంట్లలో ఒకరిగా నియమించాలని కొందరు సూచించారు. ఆ పదవితో అయినా సర్దుకుపోదామనుకున్నారు రేవంత్. నెలలు గడిచినా అది కూడా నెరవేరలేదు. దీంతో ఆయన కూడా అసంతృప్తిలోనే ఉన్నారనేది సమాచారం. అలాగే పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్న మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి సోదరుల వంటి వారంతా అలకబూనే ఉన్నారు. ఇప్పటికిప్పుడు అభ్యర్థుల పేర్ల ఖరారు, పార్టీ పదవుల పంపిణీ సాగిపోతే రాని వారి సంఖ్యేఎక్కువగా ఉంటుంది. వారంతా రోడ్డెక్కే ప్రమాదం ఉంది. ఈ తేనెతుట్టను ముందుగానే కదపడం కాంగ్రెసుకు అవసరమా? అనే చర్చ మొదలైంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News