హ్హ...హ్హ...హ్హ....ఇంపాజిబుల్...!

Update: 2018-08-19 16:30 GMT

కాంగ్రెసులో కష్టమే. కానీ ఇదొక ప్రయత్నం. సెప్టెంబరులో అభ్యర్థులను ప్రకటిస్తామంటూ టీపీసీసీ చేసిన ప్రకటన పెద్ద సాహసం. సాధ్యమవుతుందా? అంటే పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. అయ్యే పనికాదులే హస్తం పార్టీలో అంటున్నారు. గతచరిత్ర కంకాళాలు కాంగ్రెసును ఇంకా వెన్నాడుతూ ఉండటమే ఇందుకు కారణం. చివరి క్షణాల్లో బి ఫారములు మారిపోవడము, ఇద్దరేసి అభ్యర్థులకు ఫారాలు అందచేసి గందరగోళపరచడం వంటి విషయాలలో కాంగ్రెసు దే రికార్డు. అటువంటి కాంగ్రెసులో పక్కాప్లాన్ తో ముందస్తుగా అభ్యర్థులను ఖరారు చేయడం అంటే మాటలు కాదు. కానీ ఉత్తమ్ కుమార్ ప్రకటించారు. అది నిజమా? కాదా? ఢిల్లీ వర్గాలు ఏమంటున్నాయి? అనే విషయంపై లోతుగా సమాచారం సేకరించాల్సిందే. రాహుల్ గాంధీ అనుమతితోనే ఈ నిర్ణయం ప్రకటించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గొంతు నులిమేస్తే...

నిజానికి కాంగ్రెసు పార్టీకి పెద్దదిక్కులు చాలామంది ఉన్నారు. కానీ పార్టీని బతికిస్తున్నది మాత్రం వర్గాలే. పోటాపోటీ గా ఉద్యమాలు, ఆందోళనలు చేస్తుంటారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చేందుకు పోటీలు పడుతుంటారు. పెద్దనాయకులను చాలావరకూ అధికారపార్టీ చాలా చోట్ల తనలో కలిపేసుకుంది. పదిమందివరకూ ఎమ్మెల్యేలూ కారెక్కేశారు. ఇక భవిష్యత్తులో కాంగ్రెసు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రులమో, మంత్రులమో కాక తప్పదని కచ్చితంగా భావించే వారు మాత్రమే పార్టీలో మిగిలారు. అయినా పార్టీ ఉత్సాహంగా ఉందంటే కారణం వర్గాలు పోస్తున్న ఊపిరి. ద్వితీయశ్రేణి నాయకులు చిన్న వర్గాలను నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారిలో చాలామందికి ఎమ్మెల్యే టిక్కెట్లు తమ పరమవుతాయనే ఆశ. ఒకసారి టిక్కట్ల పంపిణీ కసరత్తు పూర్తి చేస్తే ఇక ఆశలు అణగారిపోతాయి. పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలనుకున్నవారు మాత్రమే మిగులుతారు. పదవులు , టిక్కెట్లను ఆశించి పనిచేసేవారు పార్టీకి దూరమైపోతారు. ఇంతకాలం ఖర్చు పెట్టినవారూ ఇక పైసా విదల్చరు. దీనిని తట్టుకునే స్థాయిలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది .మొత్తం నియోజకవర్గ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది.

నిధుల సమీకరణ కసరత్తు..

కాంగ్రెసు నిధుల లేమితో అల్లాడుతోంది. పార్టీని నడపటం చాలా కష్టమని పెద్ద నేతలు చేతులెత్తేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరుల వంటివారు మొత్తం పార్టీ ఖర్చు తాము భరిస్తామంటూ ముందుకువచ్చినా పార్టీలోనూ, ప్రజల్లోనూ వారి పట్ల సానుకూల సదభిప్రాయం వెల్లడి కావడం లేదు. దాంతో పార్టీ పూర్తిగా నియోజకవర్గాల్లోని ఓ మోస్తరు నాయకులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పెద్ద బహిరంగసభలు, ఆందోళనలు జరపాలంటే నిధుల సమీకరణ కష్టసాధ్యమవుతోంది. ఇక భవిష్యత్తులో ఎన్నికలకూ నిధులు భారీగానే అవసరం. ఒకవైపు అధికారపార్టీ కోట్ల రూపాయలను కుమ్మరించేందుకు సిద్దమవుతోంది. ప్రజలకు వివిధ పథకాల ద్వారా పంపిణీ చేస్తున్న నిధులను సైతం తామే సొంతంగా ఇస్తున్న స్థాయి ప్రచారం చేసుకుంటోంది. ఇదంతా కాంగ్రెసుకు కష్టకాలాన్ని తలపింపచేస్తోంది. వాగ్దానాలే తప్ప ప్రజలను ఆకర్షించేందుకు వారికి నమ్మకం కలిగించేందుకు అవసరమైన కసరత్తు సాగడం లేదు. మరోవైపు ఎన్నికల వరకూ పార్టీలో ఊపు కొనసాగించేందుకు ఉన్న ఏకైక ఆశనూ చిదిమేసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. వర్గాలు లేకపోతే బలం నిర్వీర్యమైపోతుంది. నిధుల వ్యయం పూర్తిగా తగ్గిపోతుందంటున్నారు. అయితే అధిష్టానం యోచన మరోలా ఉంది. టిక్కెట్లు కేటాయించిన వారి వద్ద నుంచి పార్టీ ఫండ్ ను వసూలు చేసి బలహీనమైన నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టాలనుకుంటున్నారు.

‘ఉత్త’ మాటలేనా...

టీపీసీసీ పగ్గాలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినప్పుడు పార్టీ ప్రత్యేక బాధ్యతలను నిర్దేశించింది. పార్టీ నిర్వహణ, పార్టీ ప్రచారం, టీఆర్ఎస్ కు దీటుగా పార్టీని తీర్చిదిద్దాల్సిన కర్తవ్యం ఆయనదే. అందుకు అవసరమైన స్వేచ్ఛను ఇచ్చేందుకు అధిష్టానం అంగీకరించింది. అందుకే అసమ్మతి స్వరాలు హస్తినకు చాలా సార్లు పర్యటనలు చేసినా అధిష్ఠానం చలించలేదు. ఆయనకే అండగా నిలిచింది. గ్రూపులు కట్టి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. భారీగానే ఆయన పార్టీ కోసం సొంత నిధులను వెచ్చించారు. కానీ ఆరునెలల్లో హుషారు తగ్గిపోయింది. ఆచితూచి నిధులు ఖర్చుపెట్టసాగారు. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే కృషిలో విఫలమవుతున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి. ప్రధానంగా నిధుల వ్యయంలో జాగ్రత్త పడటమే ఇందుకు కారణం. ఏదేమైనప్పటికీ ఎన్నికల వరకూ పార్టీని ముందుకు నడపాల్సిన బాధ్యత ఉత్తమ్ దే. ఖర్చూ ఆయనదే. నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని పరుగులు పెట్టించాలి. అదే సమయంలో రిజర్వుడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల అవసరాలు చూడాల్సి ఉంటుంది. దానిపై ఇంతవరకూ పార్టీలో స్పష్టత లోపించింది. ఉత్తమ్ ఆ వ్యయాన్ని భరిస్తారా? లేదా? పార్టీ అధిష్టానంపైనే అభ్యర్థులు ఆధారపడాలా? అన్న విషయంలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. టిక్కెట్ల కేటాయింపుతో ఇన్ని సంక్లిష్టతలు ముడిపడి ఉండటంతో అయ్యేపనికాదులే అంటున్నవారు పెరుగుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News