గెలిచే దెవరు?

Update: 2018-10-27 15:30 GMT

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు. కాంగ్రెసులో కొత్త నినాదం. తెలుగుదేశం పార్టీ అధినేత ఖాయం చేసిన మధ్యేమార్గం. ఇంతవరకూ పార్టీకి పనిచేసిన వాళ్లను పక్కనపెట్టేందుకు బ్రహ్మసూత్రం. వచ్చేనెల ఒకటోతేదీన కాంగ్రెసు పార్టీ తొలిజాబితాను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. కచ్చితంగా అసమ్మతి వాదులు కక్ష కట్టే అవకాశం ఉంది. టిక్కెట్లు రాని వాళ్లు రోడ్డెక్కి రచ్చ చేసే ప్రమాదమూ పొంచి ఉంది. తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్టుపార్టీలకు 30 సీట్లవరకూ ఇచ్చేందుకు కాంగ్రెసు తయారవుతోంది. దీని ప్రభావం పార్టీపై గట్టిగానే పడుతుంది. ఇప్పటికే అయిదేళ్లుగా అధికారంలో లేని పార్టీ టిక్కెట్ల కోసం ఆవురావురుమంటూ వందల సంఖ్యలో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. వీరందరినీ సంతృప్తిపరచడం ఎలాగూ సాధ్యం కాదు. అందులోనూ ఇతర పార్టీలకు టిక్కెట్లు కేటాయించిన చోట్ల పెద్ద ఎత్తున తిరుగుబాట్లు తలెత్తవచ్చు. వీటన్నిటికీ పరిష్కారంగా ముందుగానే కాంగ్రెసు పార్టీ గెలుపు నినాదాన్ని తలకెత్తుకొంటోంది. ఈ స్లోగన్ తో అసమ్మతి గొంతు నొక్కేయాలనేది ఎత్తుగడ.

బ్రహ్మరహస్యం...

ఏ స్థానంలో ఎవరు గెలుస్తారనేది ఒక బ్రహ్మపదార్థం. అంత సులభంగా విజేతలను పట్టుకోగలిగితే అసలు సమస్యే ఉండదు. అధికార పార్టీ ముందుగానే వారిని పట్టుకుని తమ పార్టీ టిక్కెట్లు ఇచ్చేస్తుంది. అందుకే ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ ప్రయోగించాలనుకుంటున్న గెలుపు గుర్రాల నినాదం కేవలం సాకు మాత్రమే. దీనితో అందరికీ సర్ది చెప్పగలమన్నది భ్రమ. అసలే ప్రజాస్వామ్యం విచ్చలవిడిగా కనిపించే కాంగ్రెసు పార్టీలో ఇటువంటి అస్త్రాలు పనిచేయడం కష్టమే. తమ పార్టీలో ప్రత్యర్థికి టిక్కెట్టు కేటాయిస్తేనే సహించని కాంగ్రెసు వాదులు వేరే పార్టీ అభ్యర్థికి సీటు ఇచ్చేస్తే సహిస్తారనుకోలేం. మహాకూటమి లేదా ప్రజాకూటమికి ఈ సమస్య తప్పదు. దానిని ఏవిధంగా ఎదుర్కొంటారన్న దానిపై ఆధారపడే కాంగ్రెసు, కూటమి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి నియోజకవర్గంలో నలుగురైదుగురు కాంగ్రెసు పార్టీ టిక్కెట్లను ఆశిస్తున్నవారు ఉన్నారు. గట్టి పట్టుదలతో ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయాల్సిందేనని భీష్మించుకున్నవారు ఇద్దరికంటే తక్కువ లేరు. 45 నియోజకవర్గాల్లో కనీసం ముగ్గురు గట్టి అభ్యర్థులు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీ చెబుతోంది. వీరిలో ఎవరిని పక్కనపెట్టినా పార్టీకి కొంతమేరకు నష్టం తప్పదంటున్నారు.

గోల మొదలైంది...

మహా కూటమి లో వివిధ పార్టీలకు టిక్కెట్ల పంపిణీ పూర్తికాకముందే గందరగోళం మొదలైపోయింది. మిత్రులకు తమ నియోజకవర్గాలు కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమంటూ హెచ్చరికలు మొదలుపెట్టారు కాంగ్రెసు నాయకులు. గడచిన నెలరోజులుగా కాంగ్రెసు పార్టీలో హడావిడి మొదలైంది. కూటమి చర్చలు, సర్వేలు, సభలతో పార్టీకి కొంత ఉత్సాహం వచ్చింది. ఇది గెలుపునకు సూచిక అంటూ కాంగ్రెసు పెద్దనేతలు ప్రచారం మొదలుపెట్టారు. దీంతో పార్టీలో టిక్కెట్ల పోటీ ఎక్కువైపోయింది. తెలంగాణ జనసమితి, తెలుగుదేశం, కాంగ్రెసు, సీపీఐ పార్టీలు మొత్తమ్మీద అన్ని సర్దుబాట్ల తర్వాత 18 స్థానాల్లో కఠినపరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్గతంగా అంచనాకు వచ్చారు. ఆయాస్థానాల్లో మిత్రుల మధ్య టిక్కెట్ల కేటాయింపు విషమంగా మారుతుందని కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ డిమాండు చేస్తున్న 8 స్థానాల్లోకాంగ్రెసు పార్టీకి సైతం బలమైన అభ్యర్థులున్నారు. సీపీఐ డిమాండు చేస్తున్న సీట్లలో మూడింట్లో కాంగ్రెసు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. తెలంగాణ జనసమితి ఆశలు పెట్టుకున్న మరో 7 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెసు స్థానిక నేతలు తాము బరిలో ఉంటామని చెప్పేస్తున్నారు. టీజేఎస్, సీపీఐ వంటి పార్టీలను పక్కనపెట్టినా టీడీపీ కోరుతున్న స్థానాలు ఆపార్టీకి ఆయువుపట్టువంటివని నాయకత్వం చెబుతోంది. వాటిని కేటాయించకపోతే కూటమి నుంచి టీడీపీ తప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

డబ్బెక్కడ...?

డబ్బుల పంపిణీపైనా రచ్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అయిదువందల కోట్ల రూపాయలను సమీకరించి హైదరాబాదులో భద్రంగా ఉంచిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెసు పార్టీతో సంబంధం లేకుండా వీటిని ఎన్నికల్లో వెచ్చించేందుకు సిద్ధమవుతోందని విమర్శిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాలకు తొలివిడత నిధులను టీఆర్ఎస్ పంపించి వేసిందని కాంగ్రెసు ఆరోపిస్తోంది. తెలంగాణలో ఈ ఎన్నికలు ఖరీదైనవిగా మారబోతున్నాయి. ఎదుటి పక్షం వైపు వేలెత్తి చూపుతూ తమ ఏర్పాట్లను ఆయా పార్టీలు సొంతంగా చేసుకుంటున్నాయి. మరోవైపు ఓట్ల కొనుగోళ్లకు ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చవుతుందో తెలియక పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ లో వలసపోయిన ఓటర్లను రప్పించి ఓట్లు వేయించేందుకు ఎన్నికల కమిషన్ కొంతమేరకు వారికి డబ్బులు ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. అదే తరహాలో ఇక్కడ కూడా కమిషన్ డబ్బులు పంపిణీ చేసే ఏర్పాట్లు ఉంటే బాగుండును కదా? అని కొన్నిపార్టీలు రాగాలు తీస్తున్నాయి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News