నేత మారినా రాత మారలేదు.. ఊపు పెరగలేదు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏంటి ? కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ద‌ళిత నేత‌, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, శింగ‌న‌మ‌ల మాజీ ఎమ్మెల్యే సాకే శైల‌జానాథ్ [more]

Update: 2020-04-18 09:30 GMT

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏంటి ? కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ద‌ళిత నేత‌, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, శింగ‌న‌మ‌ల మాజీ ఎమ్మెల్యే సాకే శైల‌జానాథ్ బాధ్యత‌లు చేప‌ట్టాక ఏమైనా మార్పులు వ‌చ్చాయా ? ఇప్పుడు ఇదే అంశం చ‌ర్చకు వ‌చ్చింది. కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యత‌లు చేప‌ట్టి రెండు మాసాలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఎంతో మంది నాయ‌కులు ఈ ప‌ద‌వి కోసం ప్రయత్నించినా.. చివ‌రికి ద‌ళిత నాయ‌కుడు సాకే శైలజానాధ్ ను కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీలో పార్టీకి అధ్యక్షుడిగా అవ‌కాశం ఇచ్చింది. దీంతో రాష్ట్రం లో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పార్టీని సాకే శైలజానాధ్ న‌డిపిస్తార‌ని పార్టీ అధిష్టానం స‌హా అంద‌రూ అనుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌లో రెడ్డి వ‌ర్గం హ‌వా ఎక్కువ‌. మ‌న‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది రెడ్డి నాయ‌కులు కాంగ్రెస్‌ను వాడుకుని పీల్చి పిప్పి చేసేశారు.

రఘువీరారెడ్డి ఎంత ప్రయత్నించినా….

అయితే ఇప్పుడు వారంతా వైసీపీ వైపే ఉన్నారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు కాంగ్రెస్‌ అనుస‌రించిన విధానాన్ని ఏపీ ప్రజ‌లు వ్యతిరేకించారు. ఫ‌లితంగా 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరారెడ్డి.. పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్రయ‌త్నించినా.. కొన్ని వ‌ర్గాలు ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌లేదు. ముఖ్యంగా రెడ్డి వ‌ర్గం ఆయ‌న‌కు స‌హక‌రించ‌లేద‌నేది నిర్వివాదాంశం. చాలా ఏళ్లపాటు పార్టీని న‌డిపించింది రెడ్డి వ‌ర్గం కావ‌డం, రెడ్లే పార్టీని బ‌లోపేతం చేసిన స‌మయం లో రాష్ట్ర విభ‌జ‌న‌కు వారు వ్యతిరేకం కావ‌డంతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక‌, ఇటీవ‌ల సాకే శైలజానాధ్ ఎంపిక విషయంలోనూ కొంద‌రు నాయ‌కులు ఈ ప‌ద‌వి ఉన్నత సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారికే ఇవ్వాల‌ని… ఆ వ‌ర్గాల్లో ఎవ‌రికి అవ‌కాశం ఇచ్చినా.. పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని వారు చెప్పిన‌ట్టు అప్పట్లోనే వార్తలువ‌చ్చాయి.

రెండు నెలలయినా….

అయితే ఏపీలో ఉన్న కుల రాజ‌కీయాల నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎవ‌రి మాటా విన‌కుండానే సాకే శైలజానాధ్ ను ఎంపిక చేసింది. సాకే ఎంపికై.. రెండు నెల‌లు పూర్తయినా.. పార్టీలోకొత్తగా వ‌చ్చిన మార్పు ఏమీ లేదంటున్నారు ప‌రిశీల‌కులు. పాత మిత్రుల‌ను క‌లుపుకొని పోవ‌డం లేదా.. పార్టీకి బ‌ల‌మైన వ‌ర్గంగా ఉన్న వ‌ర్గాల‌ను తిరిగి పార్టీ వైపు తిప్పుకొనేలా వ్యవ‌హ‌రించడం అనేది ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు దృష్టి పెట్టక‌పోవ‌డం చ‌ర్చనీయాంశాలుగా మారాయి. అదే స‌మ‌యంలో తాను ద‌ళిత నేత అయి ఉండి కూడా ఇప్పటి వ‌ర‌కు ఈ వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌ను కూడా ఆక‌ర్షించే ప‌ని ప్రారంభించ‌క‌పోవ‌డంపైనా చ‌ర్చ న‌డుస్తోంది.

కలుపుకుని పోకుండా….?

పార్టీలో సీనియ‌ర్ అయిన‌ప్పటికీ.. చాలా మంది నాయ‌కుల‌తో ఆయ‌నకు చొర‌వ లేకపోవ‌డం, ముఖ్యంగా గ‌తంలో కేంద్రంలో మంత్రులుగా వ్యవ‌హ‌రించిన వారితోనూ ఆయ‌న‌కు ట‌చ్ లేక పోవ‌డం వారిని లౌక్యంగా పార్టీవైపు తిప్పే ప్రయ‌త్నం చేయ‌డంలోను సాకే శైలజానాధ్ విఫ‌ల‌మ‌వుతున్నార‌ని అంటున్నారు. ఇలానే ఉంటే.. పార్టీ ప‌రిస్థితి ఎప్పటికీ ఇంతేన‌నేది ప‌రిశీల‌కుల మాట. అటు దేశంలోనే కాంగ్రెస్‌కు స‌రైన నాయ‌క‌త్వం లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఏపీలోనూ అందుకు భిన్నంగా ఏమీ లేద‌నే చెప్పాలి.

Tags:    

Similar News