నిండా మునిగిపోకుండా...?

Update: 2018-10-16 16:30 GMT

చిన్నచేపలను మింగేస్తేనే పెద్ద చేప బతికి బట్టకడుతుంది. లేకపోతే చిన్నచేపలు పెద్దవాటికి చికాకుగా మారతాయి. పెద్ద చేపను అస్తమానూ గుచ్చి గుచ్చి వెళుతుంటాయి. రాజకీయాల్లో ఈ సూత్రం నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా కాంగ్రెసు పార్టీ చిన్నపార్టీలను నిర్వీర్యం చేసే ఎత్తుగడ వేస్తోంది. పాత పాఠాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్లాన్ తో ముందడుగు వేస్తోంది. కాంగ్రెసు పార్టీకి గతంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. మేలుకుని నిర్ణయాలు తీసుకున్నప్పుడు పార్టీ సక్సెస్ అయ్యింది. నిర్లక్ష్యం వహించినప్పుడు నిండా మునిగిపోయింది. 2019లో అటువంటి అనుభవాలు పునరావృతం కాకుండా తెలంగాణలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి గుణపాఠాలే ప్రమాణంగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది.

టీఆర్ఎస్ చెంపపెట్టు...

కాంగ్రెసును తీవ్రంగా దెబ్బతీసిన పార్టీగా టీఆర్ఎస్ ను చెప్పుకోవాలి. 2004లో కాంగ్రెసుతో చేయికలిపి రాజకీయంగా బలపడింది. తర్వాత రెండు మూడు సార్లు ఉపఎన్నికలను తెచ్చిపెట్టి ప్రజల్లో సెంటిమెంటును రెచ్చగొట్టింది. ఆ కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెసును ప్రజలకు దూరం చేయగలిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే కాంగ్రెసులో విలీనం చేసేస్తామని కేసీఆర్ అభయమిచ్చారు. కానీ హస్తం పార్టీ అధిష్ఠానం అలుసుగా తీసుకోవడంతో టీఆర్ఎస్ స్వతంత్రంగా ఎన్నికల్లో విజయం సాధించింది. పీసీసీ ఇన్ ఛార్జులుగా ఉన్నవారి వ్యవహారశైలి కారణంగానే కేసీఆర్ దూరం జరిగారన్నది జగమెరిగిన సత్యం. కాంగ్రెసును తెలంగాణలో బలంగా దెబ్బతీశారు. రాజకీయ వ్యూహం పన్నడంలో దెబ్బతిన్న కాంగ్రెసు కోలుకోవడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. తెలంగాణలో 21 శాతం ఓట్లతో ఇంకా కిందుమీదులవుతోంది. అధికార టీఆర్ఎస్ ఓటు బ్యాంకుతో పోలిస్తే దాదాపు సగానికి పరమితమైంది. అప్పట్లోనే కొంతమేరకు రాజీపడి కేసీఆర్ తో చెట్టాపట్టాలు వేసుకుని ఆయన పార్టీని కలిపేసుకుని ఉంటే ప్రస్తుతం ఈకష్టాలు ఉండేవి కావు. ప్రస్తుతం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరులో తయారైంది పార్టీ పరిస్థితి.

పాలు పోసిన పీఆర్పీ....

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసును కష్ట కాలంలో ఆదుకుంది. నిజానికి సామాజిక నేపథ్యంలో నిలదొక్కుకునే అవకాశం ఉన్నప్పటికీ పార్టీని మూసేసుకున్నారు చిరంజీవి. మూడు మంత్రిపదవుల ఆఫర్ తో పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేసుకుంది అధిష్ఠానం. చిరంజీవికి కేంద్ర సహాయమంత్రి పదవి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు రాష్ట్ర కేబినెట్ లో పదవులు ఇచ్చేశారు. ఇది కాంగ్రెసు పరంగా మంచి డీల్. వైఎస్ జగన్ మోహనరెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరవేసి తనవెంట కొందరు ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లిపోయినా సర్కారు కుప్పకూలిపోలేదు. దానికి ప్రధానకారణం పీఆర్పీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల బలమే. ఇప్పుడు తెలంగాణలో ఇదే ప్రయోగాన్ని మరోసారి చేయాలని చూస్తోంది కాంగ్రెసు. టీఆర్ఎస్ విషయంలో దెబ్బలు తిని ఉండటంతో చిన్నపార్టీగా ఉన్న టీజేఎస్ ను తనలో కలిపేసుకోవాలని చూస్తోంది. లేకపోతే ఆపార్టీకి విడిగా పది, పన్నెండు సీట్లు కేటాయిస్తే ఏకుమేకై కూర్చుంటుందనేది హస్తం నాయకుల భావన. ఒకవేళ టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఈ విధంగా ఎన్నికైన వారిలో మెజార్టీ సభ్యులు అటువైపు చేరిపోతారనే భయం నెలకొంది.

పెద్దన్నలు అంతే...

పెద్ద పార్టీలన్నీ ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. జనసేనను తమ పార్టీతో కలిపేయాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గతంలో రాయబారం నడిపారు. చిన్నపార్టీలు పెద్ద పార్టీలతో కలిసినప్పడు చాలా సందర్బాల్లో తమ సొంతబలాన్ని కోల్పోతున్నాయి. సీట్ల పరంగా ప్రయోజనం చేకూరినప్పటికీ దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న ఓటు బ్యాంకుకు గండిపడుతోంది. వామపక్షాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ రకమైన పొత్తులు, కూటముల కారణంగానే దెబ్బతిన్నాయి. బూర్జువా పార్టీలుగా తామే పిలిచే వారితో జట్టుకట్టి సైద్దాంతిక నిబద్ధతను కోల్పోయాయి. పర్యవసానంగా అన్ని పార్టీల మూసలోనే చేరిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్దపార్టీలుగా గతంలో చెలామణి అయిన కాంగ్రెసు, తెలుగుదేశం బాగా లాభపడ్డాయి. అధికారంలోకి రావడానికి అవసరమైన 3, 4 శాతం ఎడ్జ్ ను చిన్న పార్టీ ల కారణంగా సాధించగలిగాయి. సహాయపాత్ర పోషించిన పార్టీల బలం మాత్రం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. తాజాగా పెద్ద పార్టీల నాయకులు చిన్నపార్టీలను తమ కౌగిలిలోకి తీసుకుని ఐక్యం చేసుకోవడమెలా? అన్న ఎత్తుగడల్లో మునిగితేలుతున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News