మహా‘బాట’లో ముళ్ల తోట..!

Update: 2018-06-29 15:30 GMT

ఆలోచన మంచిదే. ఆచరణ సాధ్యమయ్యే పనేనా? తెలంగాణలో అదికార సాధనలో భాగంగా మహాకూటమి కట్టాలనే కాంగ్రెసు యోచన వినడానికి చాలా బాగుంది. కానీ కార్యసాధనలో కష్టాలు తెలియనివి కావు. సకలపార్టీల సమ్మేళనంగా అలరారుతున్న తెలంగాణలో అందరూ సర్వశక్తిమంతులుగానే భావించుకుంటూ ఉంటారు. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రసమితికి తామే అసలైన ప్రత్యామ్నాయమని చెబుతుంటారు. క్షేత్రస్థాయిలో తమకున్న బలంతో సంబంధం లేకుండా నమ్మించాలని చూస్తూ ఉంటారు. . నిజానికి రాజకీయం గా సాహసం చేసి రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెసు పార్టీయే ప్రత్యామ్నాయం అనడంలో ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. కానీ ఆ దిశలో పార్టీని నడపడంలోనే వైఫల్యాలు వెన్నాడుతున్నాయి. నాయకత్వం వెలవెలబోతోంది. టీడీపీ సహా అందర్నీ కలుపుకుని మహాకూటమి కడతామంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన తాజా ప్రతిపాదన అందర్నీ ఆలోచింపచేస్తోంది. చర్చనీయమవుతోంది. అయితే సాధ్యాసాధ్యాలపై అనుమానాలు, సందేహాలు అనేకం వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో మహాకూటములు అన్నిసందర్బాల్లో ఎన్నికల విజయాలను అందిస్తాయని చెప్పలేం. 2009లో టీడీపీ నేతృత్వంలో కాంగ్రెసు కు వ్యతిరేకంగా కూటమి కట్టినా వై.ఎస్. సారథ్యంలోని కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది.

హస్తంలో కూటమి ఉందా?...

కాంగ్రెసు పార్టీ ప్రతిపాదన మిగిలిన పార్టీలకు సానుకూల సంకేతాలు పంపడానికి ఉద్దేశించింది. దీనికి ఇంకా అధిష్ఠానం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. సమీకరణలు కలిసి రావాలి. దానికంటే ముందు విశ్లేషకులే పార్టీ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల సంగతి తర్వాత చూడవచ్చు. ఎవరి అనుమతి అవసరం లేదు. అసలు పార్టీలోని నాయకులు వర్గాలు వదిలేసి పార్టీనే ఒక కూటమిగా ఐక్యంగా చూపించమనండి చూద్దాం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీలో నాలుగైదు గ్రూపులు చురుకుగా పనిచేస్తున్నాయి. అధిష్ఠానం నియమించిన నాయకత్వాన్ని సైతం గుర్తించ నిరాకరించి తమ ప్రాంతాల్లో తామే అధినాయకులమన్న ధోరణితో ఉన్నారు కొందరు నాయకులు. నిరంతరం ఫిర్యాదులతో స్థానిక నాయకత్వానికి చికాకులు, అధిష్ఠానానికి తలపోటు కలిగిస్తున్నారు. సొంత కుంపటినే సరిదిద్దుకోలేని వారు ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లడం సాధ్యమా? తమలో అభిప్రాయభేదాలనే పరిష్కరించుకోలేని వారు ఇతర నాయకులకు సీట్లు ఇస్తే కలిసి పనిచేస్తారా? ఇవన్నీ తెలంగాణ కాంగ్రెసుపై నెలకొని ఉన్న అనుమాన మేఘాలు.

వామపక్షాల విఘాతం...

మహా కూటమి ప్రతిపాదనకు తొలి విఘాతం వామపక్షాలు. కమిటెడ్ కార్యకర్తలతో కూడిన సీపీఐ,సీపీఎంలు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో ఖమ్మం,నల్గొండ, వరంగల్లు వంటి చోట్ల ప్రభావవంతంగా పనిచేయగలస్థాయిలో ఉన్నాయి. తాము సొంతంగా గెలవకపోయినా ఏడెనిమిది నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్దేశించగల పాత్రను పోషించగలవు. కానీ వాటిమధ్యనే విభేదాలున్నాయి. రాజకీయంగా భిన్న ధృవాలుగా ప్రవర్తిస్తున్నాయి. సీపీఐ కాంగ్రెసుతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.సీపీఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట సొంత కూటమి పెట్టేసుకుంది. ఈ ఫ్రంట్ పేరుతోనే ఎన్నికల్లో తలపడాలని చూస్తోంది. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. దీనిని నివారించడమెలా? అన్న విషయమే పెద్ద తలపోటుగా మారింది. మరోవైపు తెలంగాణ జనసమితి ఇతర చిన్నాచితక పార్టీలు తమ పరిధి, స్థాయిని మించి సీట్లు కోరే సూచనలున్నాయి. వీరందర్నీ సంతృప్తి పరిచి ఏకతాటిపైకి తేవడం కత్తిమీద సవాలే.

టీడీపీకి విభజన జ్వరం..

కాంగ్రెసు తర్వాత మిగిలిన పార్టీల్లో అంతో ఇంతో బలమున్నది టీడీపీకే. కాంగ్రెసుతో కలిసి నడవడం సెంటిమెంటు పరంగా కష్టం. రాష్ట్ర విభజనకు మూలసూత్రధారి హస్తం పార్టీ .దానిపై ఏపీ ప్రజల్లో ఇంకా నిరసన భావం నెలకొని ఉంది. తాజాగా ప్రత్యేకహోదా తామిస్తామంటూ రాహుల్ చేసిన ప్రకటన ప్రజలను శాంతపరిచేందుకు ఉద్దేశించిందే. అది ఎంతవరకూ ఫలితమిస్తుందో తెలియదు. అయితే తెలంగాణ కాంగ్రెసు నాయకులు మాత్రం ఈస్టేట్ మెంట్ ఆధారంగా తెలంగాణలో టీడీపీని చేరువ చేసుకోవచ్చనుకుంటున్నారు. టీడీపీ లెక్కలు వేరే విధంగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెసుతో కలిస్తే ఏపీలో వైసీపీ తమను బద్నాం చేస్తుందనే భయం వెన్నాడుతోంది. ఒంటరిగా వెళ్లేంత శక్తి సామర్థ్యాలు టీడీపీకి లేవు. అలాగని ఒక్కసారిగా అంటకాగలేదు. రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెసుతో కలిసి వెళ్లాలని ప్రతిపాదిస్తే కుదరదని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పేశారు. దాంతో రేవంత్ పార్టీని విడిచిపెట్టారు. అధికారికంగా టీడీపీ నిర్ణయంలో ఇప్పటికీ మార్పు లేదు. అయితే టీటీడీపీ సొంతంగా స్థానిక సర్దుబాటు పేరిట కాంగ్రెసుతో దోస్తానా చేస్తే అధినాయకత్వం చూసీచూడనట్లు మౌనం వహించే అవకాశాలున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News