తగ్గి...నెగ్గడమే...తెలివైన....?

Update: 2018-10-15 15:30 GMT

కోపతాపాలు, గ్రూపు రోగాలతో నిట్టనిలువున చీలి కనిపించే కాంగ్రెసులో కొత్త ధోరణి కనిపిస్తోంది. తగ్గితే తప్ప నెగ్గలేమన్న వాస్తవం కళ్లకు కడుతోంది. బడా నాయకులున్న నియోజకవర్గాల్లో సైతం పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవన్న విషయం తాజా సర్వేల్లో తేటతెల్లమైంది. అదే సమయంలో టీఆర్ఎస్ కు సైతం పూర్తిగా పరిస్థితులు సానుకూలంగా లేవన్న విషయాన్ని కాంగ్రెసు సర్వేలు పసిగట్టాయి. అధికార పార్టీని నిలువరించాలంటే అందరూ కలవాల్సిందేనన్న కఠోర వాస్తవం నాయకుల కళ్లు తెరిపిస్తోంది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లుభట్టి విక్రమార్క,రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి సోదరులు, డి.శ్రీధర్ బాబు వంటి నాయకులను కాంగ్రెసు పార్టీ ప్రముఖులుగా భావిస్తోంది. దాదాపు వీరంతా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఈ నేతలు పోటీ చేయనున్న నియోజకవర్గాలపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. ఓడించడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహరచన చేస్తోంది. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వీరిని స్థానికంగా పరిమితం చేయగలిగితే రాష్ట్రస్థాయి ఫలితాలను సైతం ప్రభావితం చేయవచ్చని అంచనా వేస్తోంది.

రాజీ పడాలి...

ముఖ్యమంత్రి స్థానం సంగతి దేవుడెరుగు. ఇదే అలసత్వాన్ని, వర్గ విభేదాలను కొనసాగిస్తే తమ సీట్లు గల్లంతు కావడం ఖాయమని నాయకులు ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు. డబ్బు కుమ్మరించేందుకు , నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులను ఆకర్షించి తిరుగుబాటు లేవనెత్తించేందుకు టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. కాంగ్రెసు పెద్ద నాయకులకు ఇది చాలా తీవ్రమైన పరిస్థితే. ఈ విడత తాము ఓడిపోయినా, కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాకపోయినా రాజకీయంగా పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల ముందుగా కోలుకోకపోతే రాజకీయ జీవితానికే చాప చుట్టేయాల్సి వస్తుందని ప్రముఖనాయకులకు అధిష్టానం క్లాసు పీకినట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాలను సైతం ప్రముఖ నాయకులకు వివరించారు. తమకు తిరుగులేదని భావిస్తున్న నాయకులు గెలుపోటముల సరిహద్దు రేఖ వద్ద ఉన్నట్లుగా తేలింది. అధికార టీఆర్ఎస్ కొద్దిగా దృష్టి పెడితే కాంగ్రెసు నాయకుల అదృష్టం తారుమారవుతుంది. జాతకాలు తిరగబడతాయి. ఈ విషయాన్ని తలకెక్కేలా అధిష్ఠానం వివరించగలిగింది. అందుకే వర్గవిభేదాలను విడిచిపెట్టి, ఇతర పార్టీల సంగతిని పక్కనపెట్టి పూర్తిస్థాయిలో గెలుపు కోసం పనిచేయాల్సిందేనన్నఅవగాహనకు వచ్చారనేది కాంగ్రెసు వర్గాల సమాచారం.

కాంగ్రెసు కోదండం...

తెలంగాణ జనసమితిని ఏం చేయాలనేది కాంగ్రెసులో ప్రధాన ప్రశ్నగా మారింది. జనసమితి పేరిట పోటీ చేస్తే ఎవరూ ఓట్లు వేయరు. ఆ పార్టీకి కేటాయించిన సీట్లు అప్పనంగా అధికారపార్టీకి అప్పగించినట్లవుతుంది. అలాగని తమకు టిక్కెట్లు ఇవ్వకపోతే సహించే పరిస్థితి లేదంటూ టీజేఎస్ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు. ఎంతోకొంతమేరకు రాజీపడదామనుకుంటున్న కోదండరామ్ మాటను సైతం టీజేఎస్ ద్వితీయశ్రేణి నాయకులు లెక్క చేయడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ 20 టిక్కెట్లు రాబట్టాలని మంకుపట్టు పడుతున్నారు. టీజేఎస్ కు ఉన్న వాస్తవిక బలానికి, వారి డిమాండుకు మధ్య చాలా తేడా ఉంది. అయిదు సీట్ల లోపునకు టీజేఎస్ ను పరిమితం చేస్తే మాత్రమే మహాకూటమికి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే టీఆర్ఎస్ తిరిగి అధికారపగ్గాలు చేపట్టడానికి తామే సహకరించినట్లవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని కాంగ్రెసు అన్వేషిస్తోంది. టీజేఎస్ లో 12 మంది వరకూ పెద్ద నాయకులు ఉన్నారు. వీరికి కాంగ్రెసు పార్టీ తరఫున టిక్కెట్లు ఇస్తామంటూ ప్రతిపాదిస్తోంది. దీనివల్ల ఓట్లు చీలిపోకుండా నెగ్గడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తోంది. అంటే దాదాపు టీజేఎస్ దుకాణం మూతపడిపోతుంది. కోదండరామ్ కారణంగా కాంగ్రెసుకు నైతిక స్థైర్యం చేకూరుతుంది. ఈ ప్రతిపాదనపై టీజేఎస్ లో మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఇది ఉభయతారకంగా లాభదాయకమైన ప్రతిపాదన అని నాయకులు అంగీకరిస్తున్నారు. కానీ విమర్శలు ఎదురవుతాయేమోనని జంకుతున్నారు.

టీడీపీ బలమెంత?...

మహాకూటమిలో మరో ప్రధాన పార్టీగా నిలవనున్న తెలుగుదేశం బలమెంత? అన్న విషయాన్ని తేల్చుకునే పనిలో పడింది కాంగ్రెసు. తెలుగుదేశంపార్టీ తనబలాన్ని పెంచి చూపుతోంది. కాంగ్రెసు వర్గాలు దానిని మరింత కుదించి చూపుతున్నాయి. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతమున్నపరిస్థితుల్లో టీడీపికి ఎన్నిసీట్లు ఇస్తే కూటమికి లాభం చేకూరుతుందన్న అంశాన్ని తేల్చాల్సి ఉంది. ఏయే స్థానాలైతే ప్రయోజనదాయకంగా ఉంటుందనే అంశమూ ముఖ్యమే. ఈ రెంటి విషయంలో అవగాహనకు వచ్చే ముందు రాష్ట్రస్థాయిలో ఫ్లాష్ సర్వేకు కాంగ్రెసు నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీతో చర్చించిన తర్వాత ఇరుపక్షాల మైత్రీ పూర్వక అవగాహన మేరకు ఒక జాతీయ సంస్థతో ఈ సర్వేను నిర్వహిస్తారు. ఆ తర్వాతనే టిక్కెట్లపై నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల వివాదాలను సాధ్యమైనంతవరకూ దూరంగా ఉంచవచ్చని భావిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News