చేవలేదు…దిక్కులేదు

దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దైన్య స్థితిలో ఉంది. దశ, దిశా నిర్దేశం చేసే బలమైన నాయకుడు లేక బలహీనంగా ఉంది. ప్రత్యర్థుల [more]

Update: 2019-12-07 16:30 GMT

దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దైన్య స్థితిలో ఉంది. దశ, దిశా నిర్దేశం చేసే బలమైన నాయకుడు లేక బలహీనంగా ఉంది. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేసే నాయకులు లేక, వ్యూహరచన చేసే దిగ్గజ నాయకులు లేక నిర్వీర్యమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చేయాలో తెలియని పాలుపోని స్థితిలో ఉంది కాంగ్రెస్. నడిపించే నాయకుడు లేక ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు. సంక్షోభాలను ఎదుర్కునే చేవలేక చతికలపడుతోంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వృద్ధాప్యం కారణంగా వెనకటి మాదిరిగా ఉత్సాహంగా పనిచేయలేకపోతున్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వైఫల్యంతో అధ్యక్ష్య బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ వైదొలిగారు. దీంతో పార్టీ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. జరుగుతున్న పరిణామాలను చూస్తూ ప్రేక్షకపాత్ర పోషించడం తప్ప అడుగు కదపలేకపోతోంది. గత ఏడాది కర్ణాటక, తాజాగా హర్యానాల్లో ఎదురైన రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో పూర్తిగా విఫలమయిందని చెప్పకతప్పదు.

తోక పార్టీగా మారి…

మహారాష్ట్ర సంక్షోభ సమయంలో వేగంగా స్పందించలేకపోయింది. ఒకప్పుడు ఈ పశ్చిమ రాష్ట్రం పార్టీకి పెట్టనికోట వంటిది. వసంత్ దాదాపాటిల్, అంతూలే, వైబీ చవాన్, ఎస్.బి.చవాన్ వంటి దిగ్గజ నాయకులు చక్రం తిప్పిన రాష్ట్రం మహారాష్ట్ర. 1999 నుంచి వరసగా మూడు సార్లు గెలిచి పదిహేనేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతుంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 44 స్థానాలతో నాలుగో స్థానానికే కాంగ్రెస్ పరిమితమయినప్పటికీ తాజా రాజకీయ సంక్షోభంలో పవార్ వెంట నడవటం తప్ప తాను ముందుండి కధ నడిపించలేకపోయింది. చివరకు శివసేన లాంటి కరడుగట్టిన మతతత్వ హిందుత్వ పార్టీతో పొత్తుకు సిద్ధపడి తన లౌకిక వాద సిద్ధాంతానికి నీళ్లు వదిలింది. అలా అని శివసేన-ఎన్సీపీలతో కలసి కూటమిని నడిపించే పరిస్థితి కూడా పార్టీకి లేకపోయింది. పీసీపీ చీఫ్ బాలా సాహెబ్ థోరట్ కు పవార్, ఉద్ధవ్ థాక్రే వెంట తిరగడం తప్ప మరో పనిలేకపోయింది. చాలా రోజుల వరకూ సీఎల్పీ నాయకుడిని కూడా ఎంపిక చేయలేని పరిస్థితి. మల్లికార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్వ వంటి నాయకులు ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. 56 సీట్ల గల శివసేన సీఎం పదవికి పట్టుబట్టగా 44 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ కనీసం డిప్యూటీ సీఎం పదవిని కూడా డిమాండ్ చేయలేక పోయింది. పాతతరం కాంగ్రెస్ నాయకులు అయితే ఏకంగా సీఎం పదవినే డిమాండ్ చేసి అధికారం సాధించేవారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.

హర్యానాలో అంతే….

హర్యనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ మేలుకున్నట్లయితే అధికారం హస్తగతమయ్యేదన్న అభప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. 90 స్థానాలకు గాను 31 గెలుచుకున్న పార్టీ గుట్టుగా ప్రయత్నించి నట్లయితే అధికారాన్ని అందుకునేది. 10 స్థానాలుగల జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా, స్వతంత్రుల మద్దతుతో హర్యానా పీఠాన్ని దక్కించుకుని ఉండేది. కానీ అంతటి చొరవ చూపే నాయకుడు కరవయ్యారు. కనీసం ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాకు పీసీసీ పగ్గాలు అప్పగించి ఉంటే ఎన్నికల ఫలితాలు కూడా మరోరకంగా ఉండేవి. జాట్ నాయకుడైన హుడా మరికొన్ని సీట్లు సాధించేవారు. రాష్ట్రంలో జాట్ ఓట్లు కాంగ్రెస్, జేజేపీల మధ్య చీలాయి. అంతకు ముందు హుడా వ్యతిరేకి అశోక్ తన్వర్ పీసీీసీ చీఫ్ గా ఉండేవారు. కానీ హుడా పట్టుబట్టడంతో ఆయన వర్గానికి చెందిన కుమారి సెల్జాకు పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆమె బీసీ నాయకురాలు. ఎన్నికలకు ముందు, తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలం కావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమయింది. మంచి అవకాశాన్ని చేజేతులా వదులుకుంది.

కర్ణాటకలో చేజేతులా…..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి జేడీఎస్ మద్దతుతో అధికారాన్ని సాధించవచ్చు. కానీ వెనువెంటనే పావులు కదపలేకపోయింది. ఫలితంగా బీజేపీని దూరంగా ఉంచేందుకు జేడీఎస్ నాయకుడు కుమారస్వామిని నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చింది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ 78 స్థానాలు సాధించగా, కుమారస్వామి పార్టీకి వచ్చిన సీట్లు 37 మాత్రమే కావడం గమనార్హం. చివరకు సంకీర్ణ సర్కార్ నడపలేక విఫలమయింది. ఏడాది పాటు కుమారస్వామి దినదినగండంగా సర్కారును నడిపారు. సంకీర్ణంలోని కాంగ్రెస్ నాయకులు ఆయనను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చివరకు బీజేపీ నాయకత్వం ధాటికి తాళలేక కుమారస్వామి అధికారం నుంచి వైదొలగాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధమే ఇందుకు కారణమన్న అభిప్రాయం నిజమేనని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ఏ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించినా సంకీర్ణ సర్కార్ కొనసాగి ఉండేది. పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, జీకే మూపనార్, కరుణాకరన్, ఎన్డీ తివారీ, అర్జున్ సింగ్ వంటి వ్యూహకర్తలు, సంక్షోభ పరిష‌్కర్తలు ఇప్పుడు పార్టీలో లేరు. పైన పేర్కొన్న నాయకులు ఎలాంటి సంక్షోభాన్ని అయినా చక్కదిద్దే వారు. అలాంటి వారు లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఉంటే మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకల్లో కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును తానే ఏర్పాటు చేసి ఉండేదనడంలో అతిశయోక్తి లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News