కాంగ్రెస్ ఇప్పుడు వ్యూహం మార్చుకోవాల్సిందేనా?

షర్మిల కొత్త పార్టీతో కాంగ్రెస్ ఈక్వేషన్లు మార్చుకోవాల్సి వస్తుందా? షర్మిల కొత్త పార్టీ కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు. దీంతో [more]

Update: 2021-02-20 11:00 GMT

షర్మిల కొత్త పార్టీతో కాంగ్రెస్ ఈక్వేషన్లు మార్చుకోవాల్సి వస్తుందా? షర్మిల కొత్త పార్టీ కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు. దీంతో పీసీసీ చీఫ్ నియామకం విషయంలోనూ, కార్యవర్గం కూర్పులోనూ పాత నిర్ణయాలను మార్చుకోవల్సి ఉంటుందా? అన్న చర్చ కాంగ్రెస్ లో అంతర్గతంగా ప్రారంభమయింది. కాంగ్రెస్ ను ధీటుగా నడిపే నాయకత్వం కావాలన్న డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది.

జీవన్ రెడ్డిని ఖరారు చేసినా…..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకూ పీసీసీ చీఫ్ పదవి నియామకాన్ని పార్టీ హైకమాండ్ హోల్డ్ లో పెట్టింది. అయితే జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా అధిష్టానం ఖరారు చేసిందన్న వార్తలు వచ్చాయి. జానారెడ్డి విజ్ఞప్తితో ఎంపికను వాయిదా వేశారు. ఇప్పుడు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమయ్యారు. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణతో సంబంధం లేకపోయినా ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం కాంగ్రెస్ ను మరింత బలహీనపర్చడానికే.

కాంగ్రెస్ ను కనుమరుగు చేయడానికే….?

జగన్ కు కాంగ్రెస్ మీద ఎప్పటికీ ఆగ్రహం చల్లారదు. తనను నిర్లక్ష్యం చేయడమేకాకుండా, అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైలులో పెట్టారు. ఏపీలో జగన్ కాంగ్రెస్ ను తుడిచిపెట్టేశారు. ఇక తెలంగాణలో కొద్దో గొప్పో ఉన్న పార్టీని పూర్తిగా కనుమరుగు చేయాలన్న నిర్ణయంతో ఉన్నారు. అందుకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం అలర్ట్ అయ్యే అవకాశముంది.

మార్పు ఉంటుందా?

పీసీసీ అధ్యక్షుడిగా మార్పు ఉంటుందంటున్నారు. రెడ్డి సామాజికవర్గం నేతనే పీసీసీ చీఫ్ ను చేసే అవకాశమున్నప్పటికీ, జీవన్ రెడ్డి పేరును పక్కన పెడతారంటున్నారు. జీవన్ రెడ్డి సాఫ్ట్ నేచర్ ఉన్న నేత కావడంతో ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా ప్రయోజనం ఉండదంటున్నారు. రెడ్డి సామాజికవర్గం ఓట్లను ఆకట్టుకునే బలమైన నేత కావాలన్నది కొత్తగా ఆలోచన వచ్చిందంటున్నారు. మొత్తం మీద షర్మిల పార్టీ ఏర్పాటు ప్రకటనతో కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశముంది. అలాగే ముఖ్యమైన పదవులు బీసీ, ఎస్సీలకు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News