ఉండేదెవరు? ఊడేదెవరు?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజులు గడ్డుకాలమే. ఇక పార్టీకి ఎటు చూసినా విజయావకాశాలు కన్పించడం లేదు. ఉన్న నేతలు సయితం తమ దారి తాము చూసుకుంటున్నారు. [more]

Update: 2021-06-14 09:30 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజులు గడ్డుకాలమే. ఇక పార్టీకి ఎటు చూసినా విజయావకాశాలు కన్పించడం లేదు. ఉన్న నేతలు సయితం తమ దారి తాము చూసుకుంటున్నారు. కొత్తగా కాంగ్రెస్ వైపు చూసే వారు లేరు. తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నది బలంగా ఉంది. అందుకే నేతలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు కాని కాంగ్రెస్ వైపు దేకడం లేదు. దీంతో పార్టీ నుంచి రానున్న కాలంలో ఎవరు ఉంటారు? ఎవరు వెళతారు? అన్న చర్చ జరుగుతోంది.

సీనియర్ నేతలున్నా….?

కాంగ్రెస్ లో ఇప్పటికీ అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు. అయితే వారికి ప్రజలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో ఉండేది. సాగర్ లో ఓటమి తర్వాత భవిష్యత్ పై నేతలకు ఆశలు అడుగంటాయి. ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేతలు పార్టీని వీడుతుండటం కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది.

ఈటల కోసం…?

ఇటీవల ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని భావించారు. ఆయనతో మంతనాలు కూడా జరిపారు. కాంగ్రెస్ లోకి వస్తే భవిష్యత్ ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి నేతలు ఈటల రాజేందర్ కు చెప్పి చూశారు. కానీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ వైపు వచ్చేందుకు ఇష్టపడలేదు. ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపారు. దీంతో కాంగ్రెస్ నేతలు మరింత డీలా పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కు ఈ దుర్గతి పట్టడానికి నాయకత్వ లోపం, నేతల మధ్య విభేదాలే కారణమంటున్నారు.

ఇన్ చార్జులు ఏరీ?

ఇప్పటికీ 119 నియోజకవర్గాల్లో సగం నియోజకవర్గాలకు పార్టీ ఇన్ ఛార్జులు లేరు. ఒకప్పుడు కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ ఛార్జి అంటే ఎగిరిగంతేసేవారు. కానీ ఇప్పుడు ఇన్ ఛార్జి పదవి ఇస్తామన్నా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దాదాపు 44 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించలేకపోవడం కాంగ్రెస్ పార్టీ దుస్థితికి అద్దం పడుతుంది. రానున్న కాలంలో మరికొంత మంది నేతలు కాంగ్రెస్ ను వీడే అవకాశముందటున్నారు.

Tags:    

Similar News