ఇల్లు చక్కదిద్దుకునే పనిలో…?

గడచిన రెండు సంవత్సరాలుగా దాదాపు అనాథగా వదిలేసిన కాంగ్రెసును చక్కదిద్దే పనిని అగ్రనాయకత్వం చేపట్టింది. సోనియా అనారోగ్యం, రాహుల్ విముఖత, ప్రియాంక నిరాసక్తత ఇప్పటి వరకూ పార్టీని [more]

Update: 2021-07-26 15:30 GMT

గడచిన రెండు సంవత్సరాలుగా దాదాపు అనాథగా వదిలేసిన కాంగ్రెసును చక్కదిద్దే పనిని అగ్రనాయకత్వం చేపట్టింది. సోనియా అనారోగ్యం, రాహుల్ విముఖత, ప్రియాంక నిరాసక్తత ఇప్పటి వరకూ పార్టీని వేధించాయి. కాంగ్రెసు పార్టీని కొంతకాలంగా పట్టించుకునేవారు కరవు అయ్యారు. చాలావరకూ వ్యవహారాలు రాష్ట్ర నాయకత్వాల ఇష్టారాజ్యంగా కొనసాగాయి. ఢిల్లీలో పార్టీని పట్టుకుని వేలాడుతున్న వృద్ధ నాయకులు శాసిస్తూ వచ్చారు. అయితే తాజా పరిణామాలను బేరీజు వేస్తే రాహుల్, ప్రియాంకలు టీమ్ అప్ అయ్యారు. స్పీడు పెంచారు. పార్టీని క్లీన్ అప్ చేసి, ధిక్కరించే వారిపై వేటు వేసేందుకు సిద్దమయ్యారు. దాంతో ఒక్కొక్కరుగా పెద్ద నాయకులు దారికి వస్తున్నారు. ఇంతవరకూ సోనియా గాంధీ తమకు అండగా నిలుస్తుందనుకుంటున్న నాయకులు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. రాహుల్ , ప్రియాంకల నిర్ణయాలను గౌరవిస్తూ తమ అసమ్మతిని మనసులో దాచుకుంటున్నారు. పార్టీకి ఇదొక మంచి పరిణామంగానే కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

రాహుల్ స్పీడ్…

పార్టీ వారసుడు, భవిష్యత్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో మళ్లీ స్పీడ్ పెంచారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2019 ఓటమి తర్వాత తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయి, తనంత తానుగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పట్నుంచి అడపాదడపా ట్విట్టర్ వేదికగా, లేదంటే ఆన్ లైన్ లో విమర్శలు కురిపిస్తున్నారు. ప్రతిపక్షనేత స్థాయిలో ఫోర్స్ కనిపించడం లేదు. ఆయా విమర్శలు, ఆరోపణలను బీజేపీ చాలా తేలికగా తీసుకుంటోంది. గతంలో రాహుల్ విమర్శలకు ప్రధాని, అమిత్ షా స్థాయిలో ప్రతిస్పందన కనిపించేది. కానీ గడచిన ఏడాది కాలంగా వారు పట్టించుకోవడం మానేశారు. పార్టీలోనూ ఆయనపట్ల నిరాసక్తత మొదలైంది. ప్రియాంక రావాలని చాలామంది రాష్ట్రస్థాయి నాయకులు ఆశించారు. అధ్యక్ష స్థానంలో బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె సిద్దం కాలేదు. సోనియా సైతం రాహుల్ కే పగ్గాలు ఇవ్వాలని భావించడం వల్ల కాంగ్రెసు నాయకుల డిమాండ్ ఫలించలేదు. మొత్తమ్మీద సోనియా, ప్రియాంక కలిసి రాహుల్ ను కన్విన్స్ చేసినట్లుగానే కనిపిస్తోంది. పార్టీ అంతర్గత విషయాలు, రాష్ట్రాల నాయకత్వంపై తాజాగా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి.

పెద్దలకో నమస్కారం…

కాంగ్రెసు పార్టీకి వదిలించుకోలేని బ్యాగేజీ వృద్ద నాయకులు. వారికున్న అనుభవంతో సలహాలు, సూచనలకు పరిమితమైతే ఫర్వాలేదు. కానీ పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. ఉన్న అరకొర పదవులూ తమకే కావాలంటున్నారు. అధికారంలో ఉన్న చోట్ల యువ నాయకులను ఎదగకుండా చేస్తున్నారు. లేని రాష్ట్రాల్లోనూ పార్టీ పదవులు వీడటం లేదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని సోనియా, రాహుల్ , ప్రియాంకలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ విషయంలో తీసుకున్న డేరింగ్ స్టెప్ అందుకొక ఉదాహరణ. విభజన తర్వాత అధికారాన్ని పువ్వుల్లో పెట్టి తెచ్చి ఇస్తామని గప్పాలు కొట్టిన నాయకులు కనీసం సొంత నియోజకవర్గాల్లో నెగ్గలేకపోతున్నారు. పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి కొత్తవాడైనప్పటికీ రేవంత్ కు అధ్యక్ష స్థానం అప్పగించేశారు. తిరుగుబాటు చేస్తామంటూ పెద్ద నాయకులు హెచ్చరించినా ఖాతరు చేయలేదు. అసమ్మతి , ఆందోళన చేస్తే వేటు వేస్తామంటూ హెచ్చరించారు. పరిస్థితులు వాటంతటవే సద్దుమణిగిపోయాయి. అలాగే పంజాబ్ లో ముఖ్యమంత్రి అమరీందర్ బలమైన నాయకుడు. నవజోత్ సింగ్ సిద్దూ యువతలో ఆదరణ ఉన్న నేత. 80 వ పడిలో ఉన్న అమరీందర్ కు సిద్దూ అంటే పడదు. దాంతో ఆయనను పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్తితులు కల్పించారు. రాహుల్, ప్రియాంకలు జోక్యం చేసుకుని పీసీసీ పీఠం పై సిద్దూని కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి దిగిరాకతప్పలేదు. రాజస్థాన్ , కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనూ నెలకొని ఉన్న సమస్యలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

పార్టీ తర్వాతే …ఫ్రంట్…

కాంగ్రెసుకు ఒక బలహీనత వెంటాడుతోంది. సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యం. ప్రాంతీయపార్టీలపై ఆధారపడాల్సిందే. అదే విధంగా ప్రాంతీయ పార్టీలకూ, వామపక్షాలకు కూడా బలహీనత ఉంది. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే తమ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కష్టాలు తప్పవు. వాటిని రాజకీయంగా ఆక్రమించేందుకు మోడీ, షాల ద్వయం చేయాల్సినదంతా చేస్తారు. ప్రాంతీయ నాయకులు అవినీతి, బంధుప్రీతి కారణంగా అనేక రకాల కేసులు ఎదుర్కొంటున్నారు. తాము సురక్షితంగా బయటపడాలంటే కాంగ్రెసు వంటి మధ్యేవాద పార్టీ ఉండాలని వారు బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెసు లేకుండా సొంతంగా ప్రాంతీయ పార్టీలు కూటమి కట్టే అవకాశం, అధికారం లోకి వచ్చే చాన్సులు లేవు. అందువల్లనే హస్తం పార్టీతో వారందరికీ అవసరం ఏర్పడింది. దాంతో కాంగ్రెసు నాయకత్వానిదే పైచేయిగా మారింది. ముందుగా ఫ్రంట్ ల తంటాలను పక్కనపెట్టి ఇంటిని చక్కదిద్దుకొంటోంది. అవసరం ప్రాంతీయ నేతలకు ఎక్కువ ఉంది . వారే వచ్చి తమతో చేయి కలుపుతారనే దీమా కాంగ్రెసులో వ్యక్తమవుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News