హైకమాండ్ ఎత్తుగడ ఫలించినట్లే కన్పిస్తుందే?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఒక జానారెడ్డికి కాంగ్రెస్ పార్టీకే కాదు కాంగ్రెస్ నేతలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. జానారెడ్డి ఎటూ తన గెలుపుకోసం ప్రయత్నిస్తారు. కానీ [more]

Update: 2021-01-28 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఒక జానారెడ్డికి కాంగ్రెస్ పార్టీకే కాదు కాంగ్రెస్ నేతలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. జానారెడ్డి ఎటూ తన గెలుపుకోసం ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అనివార్యంగా ఆయన గెలుపును కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నాగార్జున సాగర్ లో గెలిస్తేనే తమకు భవిష్యత్ ఉంటుందన్నది వారికి తెలియంది కాదు. కాంగ్రెస్ హైకమాండ్ ఎత్తుగడ ఫలించినట్లే కన్పిస్తుంది.

వాయిదా వేసినందుకు…?

వాస్తవానికి పీసీసీ చీఫ్ ఎంపికను ఎప్పుడో చేయాల్సింది. ఎంపిక కూడా పూర్తయింది. సోనియాగాంధీ కూడా టిక్ పెట్టారంటున్నారు. జీవన్ రెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని, రేవంత్ రెడ్డికి పార్టీ ప్రచార ప్రధాన కార్యదర్శిగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీడబ్ల్యూసీ మెంబర్ గా చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. కానీ జానారెడ్డి రిక్వెస్ట్ తో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకూ పీసీసీ చీఫ్ పదవిని వాయిదా వేసింది.

నేతలకే సవాల్….

అనుకున్నట్లుగానే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ నేతలకు సవాల్ గా మారింది. ఇక్కడ ఓడిపోతే జానారెడ్డికి ఏం కాదు. ఆయన ఒకసారి ఇప్పటికే ఓటమి పాలయి ఉన్నారు. అంతేకాకుండా వయసురీత్యా కూడా ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవాలని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష‌్యత్ ను ఊహించుకుంటున్న నేతలకు మాత్రం ఈ ఉప ఎన్నికలో గెలవడం అనివార్యమనే చెప్పాలి.

క్యాడర్ లో జోష్ నింపేందుకు….

వరసగా ఉప ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా క్యాడర్ పాల్గొనలేని పరిస్థితి. క్యాడర్ లో ఉత్సాహంతో పాటు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి చరిష్మా చెరగలేదని చెప్పుకోవడానికి ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ నేతలకు ఎక్కవ అవసరంగా కన్పిస్తుంది. అందుకే మునుపెన్నడూ లేని ఐక్యత ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో కన్పిస్తుంది. జానారెడ్డి గెలుపు కోసం పనిచేస్తామని, ఖచ్చితంగా గెలుపు తమేనన్న ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ నేతల్లో ఐక్యత కన్పిస్తుండటం ఉప ఎన్నికల్లో గెలుపు కంటే ఆనందం కన్పిస్తుంది.

Tags:    

Similar News