దినదిన గండమే.. అప్పటి వరకూ టెన్షనే

మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వానికి ఎప్పుడు మూడుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ ప్రయోగించడంతో ఆ పార్టీ [more]

Update: 2020-03-08 17:30 GMT

మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వానికి ఎప్పుడు మూడుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ ప్రయోగించడంతో ఆ పార్టీ నేతలు ప్రస్తుతానికి అప్రమత్తమయినా ఏ రోజు ఏదైనా జరగొచ్చంటున్నారు. ప్రధానంగా మార్చి 26వ తేదీ వరకూ కమల్ నాధ్ కు ఈ టెన్షన్ తప్పకపోవచ్చు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందంటున్నారు.

బలం పెంచుకోవడానికే….?

బీజేపీకి రాజ్యసభలో బలం పెంచుకోవడం భవిష్యత్ అవసరం. బిల్లులు సులువుగా ఆమోదం పొందాలంటే రాజ్యసభ లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలి. అయితే మెజారిటీ రావాలంటే కొన్నేళ్ల పాటు ఆగక తప్పదు. అయితే అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోంది బీజేపీ, రాజ్యసభలో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. అందులో భాగంగానే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల వేసినట్లు కనపడుతోంది.

తిరిగి రప్పించుకున్నా…..

మధ్యప్రదేశ్ లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరిగి తన గూటికి రప్పించుకోగలిగినా అది తాత్కాలికమేనంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడంతో పాటు రాజ్యసభ స్థానాలను దక్కించుకోవాలన్న వ్యూహంతో నిరంతరం బీజేపీ ఉంటుందన్నది కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు వంద కోట్లకు పైగా నిధులు ఇస్తున్నారని మైండ్ గేమ్ మొదలు పెట్టింది కాంగ్రెస్. అలాగైనా బీజేపీ దూకుడు కొంత తగ్గుతుందన్నది కాంగ్రెస్ భావన.

దెబ్బ కొట్టాలని…..

ఇప్పటికే కాంగ్రెస్ లో రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింథియాల నాయకత్వంలో ఎమ్మెల్యేలు కూడా విడిపోయారు. రాజ్యసభ ఎన్నికల్లో కమల్ నాధ్ ను దెబ్బతీసేందుకు సింధియా వర్గం ప్రయత్నిస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే విప్ జారీ చేయాలని నిర్ణయించారు. విప్ జారీ చేసినా కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకించడానికే సిద్ధమయ్యారన్న వార్తలు రావడంతో కాంగ్రెస్ లో ఆందోళన నెలకొంది. అందుకే రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ కమల్ నాధ్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. బీజేపీ కూడా ప్రయత్నాన్ని ఆపక పోవచ్చు.

Tags:    

Similar News