కాంగ్రెస్ కు ఇక్కడే ఛాన్సుందా…??

సాధారణంగా సార్వత్రిక ఎన్నికల్లో కేరళకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కొబ్బరికాయ రూపంలో ఉండే ఈ రాష్ట్రం దక్షిణాదిన చివరి అంచున ఉంటుంది. 20 లోక్ సభ స్థానాలు [more]

Update: 2019-04-18 16:30 GMT

సాధారణంగా సార్వత్రిక ఎన్నికల్లో కేరళకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కొబ్బరికాయ రూపంలో ఉండే ఈ రాష్ట్రం దక్షిణాదిన చివరి అంచున ఉంటుంది. 20 లోక్ సభ స్థానాలు గల ఈ మళయాళ రాష్ట్రంలో చిన్నాచితకా పార్టీలు ఉన్నప్పటికీ వాటిల్లో కొన్ిన సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ డెమెక్రటిక్ ఫ్రంట్ (ఎల్.డి.ఎఫ్) కూటమిలో మరికొన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) లో ఉంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి. రెండు ప్రత్యేక కారణాల దృష్ట్యా ఈసారి కేరళ ఎన్నికలు జాతీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా వయనాడ్ లో పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఈ రాష్ట్రంపై కేంద్రీకృతమైంది. కాలం కలసి వచ్చి కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు వస్తే ప్రధానిగా దేశ పగ్గాలు చేపట్టేది ఆయనే. రెండోది రాజధాని నగరం తిరువనంతపురంలో దిగ్గజాల మధ్య పోరు నడుస్తోంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి శశిధరూర్ కాంగ్రెస్ తరుపున, బీజేపీ నుంచి మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ బరిలో ఉండటంతో ఇక్కడ ఆసక్తికరమైన పోరు జరుగుతుంది.

కొత్తేమీ కాకపోయినా….

దక్షిణాదిన కాంగ్రెస్ అధినేతలు పోటీ చేయడం కొత్తేమీ కాదు. ఉత్తరాదిన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దక్షిణాది ప్రాంతం హస్తం పార్టీని ఆదుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 1977లో యూపీ లోని రాయబరేలిలో ఓడిపోయిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత కర్ణాటకలోని చిక్ మగళూరు ఉప ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఏపీ, ప్రస్తుత తెలంగాణలోని మెదక్ నుంచి ఇందిరాగాంధీ గెలుపొందారు. 1998 లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటకలో పోటీ చేశారు. పార్టీకి కంచుకోట వంటి బళ్లారి నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఈ రకంగా దక్షిణాది ప్రాంతం హస్తం పార్టీ అధినేతలకు అండగా నిలుస్తోంది. ఇంతటి విస్తృత నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ ను ఎంచుకోవడంలో ఆశ్చర్యం కలిగించలేదు. అమేధీలో పరిస్థితులు ఎటుపోయి ఎటు వస్తాయోనన్న ముందు జాగ్రత్తగా ఆయన వయనాడ్ ను ఎంచుకున్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు.

సురక్షితం కాకపోయినా….

కేరళ రాష్ట్రంలోని 20 స్థానాల్లో గత ఎన్నికల్లో యూడీఎఫ్ 12, ఎల్ డిఎఫ్ 8 స్థానాలను సాధించాయి. రేపటి ఎన్నికల్లో యూడీఎఫ్ ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నెల 23న రాష్ట్రంలోని మొత్తం స్థానాలకు ఒకే దఫా ఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నందున దాని ప్రభావం ఇరుగుపొరుగు నియోజకవర్గాలైన మలబార్, పాలక్కడ్, కౌసర్ గౌడ్ లపై ఖచ్చితంగా ఉంటుంది. వయనాడ్ ను 2014లో యూడీఎఫ్ కూటమిలోని సీపీఐ గెలుచుకుంది. మెజారిటీ 30 వేల లోపే. ఈ లెక్కన చూస్తే ఈ నియోజకవర్గం రాహుల్ కు సురక్షితం కాదు. కనీ ఈ నియోజకవర్గంలో ముస్లింలు పెద్దసంఖ్యలో ఉన్నందున విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఇక మధ్య కేరళ ప్రాంతంలో యుడీఎఫ్ కు గట్టిపోటీ ఎదురవుతోంది. బాలాక్కడి, ఇుక్కి జిల్లాల్లో గత ఎన్నికల్లో ఎల్.డిఎఫ్ చేతిలో యూడీఎఫ్ ఓటమి పాలయింది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో శబరిమల అంశం ఎల్.డి.ఎఫ్ కు చిక్కులు కలిగిస్తోంది. శబరిమల అంశం, గత ఏడాది వరదలు, విపక్ష పార్టీల పై దాడులు ఈ దఫా ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా పనిచేస్తాయి.

శబరిమల అంశాన్ని….

శబరిమల అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో లబ్ది పొందేందుకు కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలకు ఈ అంశం కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. గత ఏడాది వచ్చిన వరదలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. ఎన్నికల ప్రచారంలో ఈవిషయం పూర్తిగా మరుగున పడింది. గత ఎన్నికల్లో తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిధరూర్ కు గట్టిపోటీ ఎదురైంది. నాటి బీజేపీ అభ్యర్థి ఓ. రాజగోపాల్ మంచి ఓట్లు తెచ్చుకున్నారు. ఈ దఫా బీజేపీ కుమ్మనం రాజశేఖర్ ను బరిలోకి దించింది. ఆయన రాష్ట్ర బీజేపీ నాయకుడు కూడా. చివరి క్షణాల్లో మిజోరాం గవర్నర్ పదవికి రాజీనామా చేసి వచ్చారు. వయనాడ్ కు వస్తే నియోజకవర్గం పునర్వవ్యస్థీనకరణ అనంతరం 2009లో ఏర్పడింది. గత ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించినప్పటికీ మెజారిటీ తక్కువే. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని ఎల్.డి.ఎఫ్ సీపీఐకి కేటాయించింది. ఆ పార్టీ అభ్యర్థిగా సునీల్ పోటీ చేస్తున్నారు. మూడు మతాలైన హిందీ, ముస్లింలు, క్రైస్తవులు రాష్ట్రంలో సమానంగా ఉన్నారు. ముస్లింలు, క్రైస్తవులు కాంగ్రెస్ పక్కన, హిందూ సమాజం ఎల్.డి.ఎఫ్ పక్కన ఉంది. హిందువులను రెచ్చగొట్టడానికి వారిలో చీలిక తెచ్చి లబ్ది పొందడానికి బీజేపీ వ్యూహరచన చేసింది. మొత్తం మీద కేరళలో రసవత్తర పోరు జరుగుతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News