కలహాలే కాంగ్రెస్ కొంపముంచాయా?

అయిదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేరళపైనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో [more]

Update: 2021-05-20 16:30 GMT

అయిదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేరళపైనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పార్టీకి ఎటూ ఆశలు లేవు. అసోంలో అధికారాన్ని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. పుదుచ్చేరిలో చేతులారా పోగొట్టుకున్న అధికారాన్ని పొందడం అసాధ్యమన్న సంగతి ముందే అర్థమైంది. ఈ నేపథ్యంలో కేరళపైనే హస్తం పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ గెలుపు కోసం తన సర్వశక్తులునూ ఒడ్డింది. పకడ్బందీ వ్యూహరచన చేసింది. పార్టీ అగ్రనేత, రాష్ర్టంలోని వయనాడ్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ సైతం ఈ దక్షిణాది రాష్ర్టం తమ పరువు కాపాడుతుందని ఆశించారు. కానీ నేతల అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో ఎక్కడ పొరపాటు జరిగిందన్న విషయమై అంతర్గత విశ్లేషణలు జరుగుతున్నాయి.

అతి ధీమాతో…?

అంతర్గత కలహాలు, ముఠా కుమ్ములాటలు, అతి ధీమా కాంగ్రెస్ అవకాశాలను దారుణంగా దెబ్బతీశాయి. అధికార పార్టీని ఓడించి, విపక్షాన్ని అందలం ఎక్కించే సంప్రదాయం గత నాలుగు దశాబ్దాలుగా రాష్ర్టంలో కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వామపక్ష కూటమి అధినేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను తక్కువగా అంచనా వేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు ప్రజలు నమ్మారని భావించింది. ఈ అంశాలే తమను అధికార పీఠానికి చేరువ చేస్తాయని అంచనా వేసింది. దీంతో ప్రచారం, శ్రేణుల మధ్య సమన్వయం తదితర విషయాలను కాంగ్రెస్ పక్కనపెట్టింది. పార్టీ ఓటమికి గల ప్రధాన కారణాల్లో ఇది ఒకటి.

ముఖ్యమంత్రి పదవి కోసం….

ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అధికారం అందుకోవడం తథ్యమన్న అంచనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకుల మధ్య పోటీ పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, సీఎల్పీ నాయకుడు రమేష్ చెన్నితాలా, పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ ఈ పదవి కోసం గట్టిగా పోటీ పడ్డారు. రెండుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం, సీనియర్ నేతగా తనకు పదవి దక్కాలని చాందీ ఆశించారు. పార్టీ మారకుండా, నియోజకవర్గం మారకుండా వరసగా 12సార్లు గెలిచిన తనను అధిష్టానం కాదనదన్న ధీమా ఆయనలో పెరిగింది. సీఎల్పీ నేతగా గత అయిదేళ్లుగా అసెంబ్లీలో తాను చేసిన పోరాటం కారణంగా ముఖ్యమంత్రి పదవికి తానూ హక్కుదారుడినన్నది రమేష్ చెన్నితాలా వాదన. హరిపాడ్ నియోజకవర్గం నుంచి చెన్నితాలా 13వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

అంతర్గత కుమ్ములాటలు….

పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ కూడా గట్టి పోటీదారే. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించిన నాయకుడే సహజంగా సీఎం రేసులో ముందుంటారు. గతంలో కన్నూర్ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన రామచంద్రన్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ర్ట వ్యాప్తంగా పార్టీని సమన్వయం చేయాల్సిన, ప్రచారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అందువల్లే ఎన్నికలకు తాను దూరంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే పీసీసీ చీఫ్ గా తానే సీఎం పదవికి మొదటి హక్కుదారుని అవుతానని, తనను కాదనే అవకాశం ఎవరికీ ఉండదన్న ఉద్దేశంతోనే ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. మాజీ మఖ్యమంత్రి కరుణాకరన్ కుమారుడైన మురళీధరన్ కూడా పదవిని ఆశించారు. ఆయన గతంలో పీసీసీ చీఫ్ గా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతల అంతర్గత కలహాలు, సీఎం పదవి కోసం పోటీ అంతిమంగా ఎన్నికలపై ప్రభావం చూపాయి. పార్టీ సీనియర్ నాయకుడు పి.సి.చాకో రాజీనామా వంటి అంశాలు కూడా దెబ్బతీశాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిజాయతీ, చిత్తశుద్ధిని ప్రజలు విశ్వసించారు. అంతిమంగా ఇవన్నీ హస్తం పార్టీని మరో అయిదేళ్లు అధికారానికి దూరం చేశాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News