గెలిచినా నిలబడతారా?

ఒకవేళ కర్ణాటక ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకుని తిరిగి సంకీర్ణ సర్కార్ ఏర్పాటయినప్పటికీ అది సుస్థిర పాలన అందించలేదన్నది ముందుగానే తేలిపోయింది. కర్ణాటకలో పదిహేను నియోజకవర్గాల్లో [more]

Update: 2019-12-05 17:30 GMT

ఒకవేళ కర్ణాటక ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకుని తిరిగి సంకీర్ణ సర్కార్ ఏర్పాటయినప్పటికీ అది సుస్థిర పాలన అందించలేదన్నది ముందుగానే తేలిపోయింది. కర్ణాటకలో పదిహేను నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. ఎనిమిది స్థానాలు దక్కకపోతే బీజేపీ ప్రభుత్వం దిగిపోవాల్సిందే. తిరిగి కాంగ్రెస్, జేడీఎస్ లు సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చాయి.

జేడీఎస్ ఓకే అనడంతో….

కాంగ్రెస్ తో చేతులు కలపడానికి జేడీఎస్ అధినేత దేవెగౌడ సయితం సరేననడంతో కాంగ్రెస్ నేతలు తిరిగి తాము అధికారంలోకి వచ్చినట్లేనని కలలు కంటున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తాను సంకీర్ణ సర్కార్ ఏర్పడినా ముఖ్యమంత్రి పదవి చేపట్టనని స్పష్టం చేయడంతో సీఎం పదవి ఈసారి కాంగ్రెస్ కు దక్కనుంది. ఉప ఎన్నికలు ఫలితాలు రాకమునుపే కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం వార్ మొదలయిందనే చెప్పాలి.

సిద్ధూ ఆశలు…

తిరిగి సంకీర్ణ సర్కార్ ఏర్పడితే అనుభవమున్న తనను కాక ఇంకెవరని చేస్తారని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగంగానే అంటున్నారు. అయితే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అంటే జేడీఎస్ ముందుకు వచ్చే అవకాశాలే లేవు. దీంతో సిద్ధరామయ్య వ్యతిరేకులు సీఎం పదవి కోసం అనేక పేర్లను తెరమీదకు తెస్తున్నారు. వీరిలో డీకే శివకుమార్ తోపాటు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పేరు కూడా బలంగా విన్పిస్తుంది.

తెరపైకి ఖర్గే పేరు…..

మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ పెద్దల నుంచి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే సీఎం పదవి పై మరోసారి పార్టీలో అంతర్యుద్ధం చెలరేగే అవకాశముందంటున్నారు. ఈ ప్రభావం సంకీర్ణ సర్కార్ పై పడనుందన్నది విశ్లేషకుల అంచనా. ఖర్గేకు సీఎం పదవి ఇచ్చేందుకు పార్టీలోని అనేక మంది శాసనసభ్యులు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. శాసనసభ్యుల్లో సిద్ధరామయ్య గ్రూపు ఇప్పటికీ బలంగా ఉండటంతో ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికి అంత ఈజీకాదు. మొత్తం మీద ఫలితాలు రాకముందే సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ లో కొట్లాటలు స్టార్టయ్యాయి.

Tags:    

Similar News