మ‌ళ్లీ కాంగ్రెస్ వైపే సీనియ‌ర్లు.. కొత్త రాజ‌కీయం ?

ఒక‌ప్పటి కాంగ్రెస్ నేత‌లు.. ఒక‌రకంగా చెప్పాలంటే.. వారంతా కురువృద్ధులు. అయితే.. ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ కుదేలైన నేప‌థ్యంలో కొంద‌రు…. త‌మ త‌మ [more]

Update: 2021-05-18 11:00 GMT

ఒక‌ప్పటి కాంగ్రెస్ నేత‌లు.. ఒక‌రకంగా చెప్పాలంటే.. వారంతా కురువృద్ధులు. అయితే.. ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ కుదేలైన నేప‌థ్యంలో కొంద‌రు…. త‌మ త‌మ వ్యాపార అవ‌స‌రాల కోసం మ‌రికొంద‌రు..ఇలా ఎవ‌రికి న‌చ్చిన మార్గంలో వారు ఇత‌ర పార్టీల‌ను ఆశ్రయించారు. కొంద‌రు జాతీయ పార్టీలో ఉంటే.. మ‌రికొంద‌రు.. ప్రాంతీయ పార్టీల‌ను సైతం ఆశ్రయించారు. ఇలాంటివారిలో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, కావూరి సాంబ‌శివ‌రావు, కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, జేసీ దివాక‌ర్‌రెడ్డి ఇలా అనేక మంది ఇత‌ర పార్టీల్లో ఉన్నారు. ఆయా పార్టీల్లో అయినా.. వీరికి ఆశించిన మేర‌కు న్యాయం జ‌రిగిందా ? అంటే.. లేదు.

మోదీ పై వ్యతిరేకత….

కేవ‌లం ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలో ఉన్న వారిలో కొంద‌రికి మాత్రమే న్యాయం జ‌రిగింది. వీరిలో సీ రామ‌చంద్రయ్య వంటివారు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా ఎలాంటి గుర్తింపు లేకుండా మౌనంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. రాష్ట్రంలోనూ.. దేశంలోనూ ప్రత్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తుల‌ను ఆహ్వానించేందుకు ప్రజ‌లు రెడీ అవుతున్నారు. ప్రధానంగా మోడీపై తీవ్ర వ్యతిరేక‌త క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఏపీ విష‌యాన్ని తీసుకున్నా.. ఇక్కడ రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలూ.. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు, హ‌క్కుల విష‌యంలో విఫ‌ల‌మ‌య్యాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత….

ఈ క్రమంలో ఇప్పుడు ప్రజ‌ల్లో మ‌ళ్లీ కాంగ్రెస్ పేరు వినిపిస్తోంద‌ని కాంగ్రెస్ పాత కాపులు అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహంతో ఉంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పార్టీ.. పాత కాపుల‌కు తిరిగి రావాలంటూ.. పిలుపునిచ్చింది. అయితే.. ఒక్కరు కూడా రాలేదు. దీంతో వేచి చూస్తోంది. రాజ‌కీయ ప‌రిణామాలు వాటంత‌ట అవే మార‌డం.. త‌ద్వారా తాము పుంజుకుంటామ‌నే ధీమా కాంగ్రెస్‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత‌.. దేశంలో ప్రత్యామ్నాయ కూట‌మికి పార్టీలు ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. అయితే.. అలా కాకుండా.. కాంగ్రెస్ ఆయా పార్టీల‌ను అనుస‌రించి లీడ‌ర్ షిప్ తీసుకుని, మోడీకి వ్యతిరేకంగా వ్యవ‌హ‌రించాల‌ని చూస్తోంది.

వైసీపీకి వెళ్లిన ఓటు బ్యాంకును….

ఈ క్రమంలో రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బ‌లోపేతం అవుతుంద‌ని ఏపీకి చెందిన సీనియర్ల మ‌ధ్య చ‌ర్చలు న‌డుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే.. ఏపీకి చెందిన సీనియ‌ర్లు, కురువృద్ధులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కొంద‌రు నేత‌లు ఢిల్లీలో స‌మావేశ‌మై.. ఇదే విష‌యాన్ని చ‌ర్చించార‌ని కూడా అంటున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కు ఇప్పటికీ కేడ‌ర్ ఉంది. అయితే.. ఓట్లు వేయ‌క‌పోయ‌నా.. జెండా మోసేందుకు రెడీగా ఉన్నారు. సో.. ఇలాంటి వారిని పోగొట్టుకోకుండా.. వైసీపీకి దాఖ‌లైన ఓటు బ్యాంకును వెన‌క్కుతెచ్చుకునే ప్రయ‌త్నం చేసేందుకు కేంద్రం నుంచి రావాల్సిన హ‌క్కుల‌నే ఆలంబ‌న‌గా చేసుకుని ముందుకు సాగాల‌ని నాయ‌కులు నిర్ణయించుకున్నట్టు స‌మాచారం.

ప్రత్యేక హోదా కూడా….

అదే స‌మ‌యంలో కాంగ్రెస్ జాతీయ నాయ‌క‌త్వం ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ అభివృద్ధిపై ప్రక‌ట‌న చేస్తే అది కూడా ఏపీలో కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుంద‌ని ఇక్కడ పాత కాంగ్రెస్ నాయ‌కులు భావిస్తున్నారు. మోడీపై తీవ్ర వ్యతిరేక‌త ఉన్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంద‌న్న ఆశ వీరిలో ఉంది. మ‌రి వీరి ఆశ‌లు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? చూడాలి.

Tags:    

Similar News