ఎందుకీ దుర్గతి.... ఏమిటీ అవస్థలు?

Update: 2018-07-16 17:30 GMT

ఒకప్పుడు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ యావత్ జాతికి, ఆసేతు హిమాచలానికి ప్రాతినిధ్యం వహించిన పార్టీ. ఇప్పుడు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.దేశవ్యప్తంగా ప్రతి రాష్ట్రంలో పార్టీ శ్రేణులు విస్తరించి ఉన్నాయి. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఒకటే ప్రధాన తేడా. అప్పట్లో జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో చక్రం తిప్పుతూ ఎదురులేని పార్టీగా కొనసాగింది. కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం. ఒక్క మాటలో చెప్పాలంటే అఖిలభారత కాంగ్రెస్ ఇప్పుడు అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయిందన్నది చేదునిజం. దాని ఉనికి ఉత్తరాదిన నాలుగైదు రాష్ట్రాలు, దక్షిణాదిన ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల బలానికి, లోక్ సభలో ప్రస్తుత కాంగ్రెస్ బలానికి పెద్దగా తేడాలేదు. నాలుగు పదుల ఎంపీల బలంతో వందేళ్లకు పైగా చరిత్రగల హస్తం పార్టీ నీరసంగా అడుగులు వేస్తోంది.

గెలవాలంటే పొత్తుతో.....

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహంలో నిమగ్నమైంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ వైఫల్యం, తగ్గుతున్న నరేంద్ర మోదీ ప్రభ, విపక్షాల ఐక్యతా ప్రయత్నాల నేపథ్యంలో భవిష్యత్ పై కాంగ్రెస్ లో ఆశలు కలుగుతున్నాయి. కానీ ఈ ఆశలు అధికార భారతీయ జనతా పార్టీని ఓడించే స్థాయిలో ఉన్నాయా? రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే స్థాయిలో ఉన్నాయా? ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే స్థాయిలో ఉన్నాయా? అన్న ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం లభించదు. ఒక్కటి మాత్రం వాస్తవం. ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే కాంగ్రెస్ ను ఒడ్డున పడేయదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు విపక్షాల మధ్య చీలిపోకుండా ఉంటే ఒకింత ఆశాజనకంగా ఉంటుందన్నది కాంగ్రెస్ పెద్దల అంతరంగంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని తలపోస్తోంది. సిద్ధాంతాల బాదరబందీ, వ్యక్తిగత అభిజాత్యాలను పక్కనపెట్టి ప్రతి రాష్ట్రంలోని బీజేపీ వ్యతిరేక శక్తులతో కలసి సాగాలని రాష్ట్రాల శ్రేణులకు పార్టీ సూచిస్తోంది. గట్టిగా ఆదేశిస్తోంది కూడా. ఇక్కడే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పొత్తులకు రాష్ట్ర శాఖలను ఒప్పించడం ఢిల్లీ పెద్దలకు కష్టమవుతోంది. ఢిల్లీలో జాతీయ నాయకులు కూర్చుని మాట్లాడుకున్నంత తేలిగ్గా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉండవని రాష్ట్రాల నాయకులు చెబుతున్నారు. నాయకులు మనసు మార్చుకున్నంత తేలిగ్గా ఓట్ల బదిలీ జరగదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

లోకల్ నాయకత్వం.....

గత ఎన్నికల్లో అత్యధికంగా కర్ణాటకలో పార్టీకి 9 లోక్ సభ స్థానాలు వచ్చాయి. ప్రస్తుతానికి ఈ దక్షిణాది రాష్ట్రంలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఎంతవరకూ మనస్ఫూర్తిగా కలసి పనిచేస్తాయన్నది అనుమానమే. మాజీ పీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వరన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కత్తులు నూరుకున్న కాంగ్రెస్-జేడీఎస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు రేపటి లోక్ సభ ఎన్నికల్లో ఎంతవరకూ కలసి పనిచేస్తారన్నది అనుమానాస్పదమే. పొత్తుతో ముందుకు వెళ్లాలన్న అధిష్టానం ఆదేశం ఎంతవరకూ అమలవుతుందో చూడాలి. కర్ణాటక తర్వాత మొన్నటి ఎన్నికల్లో కేరళలో అత్యధికంగా కాంగ్రెస్ కు 8 స్థానాలు వచ్చాయి. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్ , సీపీఎం ఒకింత సానుకూలగా ఉన్నప్పటికీ కేరళలో రెండు పార్టీలు కలసి పనిచేయడం అసాధ్యమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మాయవతితోనా?

లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకున్న మరో రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ (జంగీపూర్) సహా నలుగురుగెలిచారు. రాష్ట్రంలో సీపీఎంతో కలసి ముందుకు సాగాలా? మమత బెనర్జీతో పొత్తుపెట్టుకోవాలా? అన్న విషయాన్ని కాంగ్రెస్ తేల్చుకోలేకపోతోంది. రెండింటితో వద్దు ఒంటరిగా వెళదామని అప్పుడే పార్టీకి భవిష్యత్ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి అంటున్నారు. ఎవరో ఒకరితో పొత్తు తప్పదని అధిష్టానం గట్టిగా చెబుతోంది. గతఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్న బీహార్ రాష్ట్రంలో లుకలుకలు మొదలయ్యాయి. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కూటమిలో ఉండాలా? లేక నితీష్ కుమార్ వైపు మొగ్గాలా? అన్న మీమాంస పార్టీని వెన్నాడుతోంది. పెద్ద రాష్ట్రమైన యూపీలో సమాజ్ వాదీపార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లతో కాంగ్రెస్ పొత్తుకు తహతహలాడుతోంది. చిక్కిశల్యమైన యూపీ పార్టీ శాఖ ఎటూ చెప్పలేకపోతోంది. అయితే సమాజ్ వాదీ పార్టీ కన్నా బీఎస్సీయే ప్రమాదకారి అని చెబుతోంది. లోక్ సభకు ముందు ఈ ఏడాది చివర్లో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని అధిష్టానం దాదాపు గా ఒక నిర్ణయానికి వచ్చింది. దీనివల్ల లాభం లేదని మధ్యప్రదేశ్, రాజస్థాన్ పీసీసీ చీఫ్ లు కమలనాధ్, సచిన్ పైలెట్ లు చెబుతున్నారు. రెండు మూడు శాతం ఓటు బ్యాంకు ఉన్న బీఎస్పీ వల్ల ఒరిగేదేమీ లేదని వారి అభిప్రాయం. కాని ఒకటి, రెండు శాతం ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయని, ప్రతి చిన్న పార్టీనీ కలుపుకుని పోవాలని ఢిల్లీ నాయకులు వాదిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం ఏడు సీట్లను కైవసం చేసుకున్న బీజేపీని నిలువరించాలంటే ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముందుకుసాగాలన్నది అధిష్టానం ఆలోచన. దీనిని పీసీసీ చీఫ్ అజయ్ మాకెన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈయన దివంగత మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ మనవడు. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. మారిన పరిస్థితుల్లో అందుకు అనుగుణంగా మారక తప్పదన్నది ఢిల్లీ పెద్దల ఆలోచన. అలా చేస్తే ఉన్న కొద్దిపాటి ఉనికీ కనుమరుగవుతుందన్నది రాష్ట్రాల నాయకుల వాదన. దీనిపై మున్ముందు మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News