ఇక పగటి కలే...!

Update: 2018-08-09 15:30 GMT

అంతా అనుకున్నట్లే జరిగింది. అధికారపార్టీకే అప్పనంగా పదవిని అప్పగించేశారు. దశాబ్దాలుగా ఏకగ్రీవంగా సాగుతున్న రాజ్యసభ డిప్యూటీకి ప్రతిపక్షాల తరఫున పోటీ పెట్టారు. కమిట్ మెంట్, కలుపుగోలుతనం లోపించాయి. ఫలితం గా ఆశించిన దానికంటే ఘోరంగా ఓడిపోయారు. 2019 కి రోడ్డు మ్యాప్ అంటూ చేసిన ప్రచారం వికటించింది. ప్రతిపక్షాల ఐక్యతకు పట్టం గడుతున్నాం . అందుకే ఈ పోరాటం అంటూ చూపిన ఆరాటం విపక్షాలన్నిటినీ ఒక్కతాటిపైకి తేవడంలో చూపలేకపోయారు. అమిత్ షా, మోడీలు నడుపుతున్న చదరంగంలో ఎత్తులు అంతుచిక్కక కాంగ్రెసు చేతులెత్తేసింది. మోరల్ బూస్టప్ తో బీజేపీ విజయ ఢంకా మోగించింది. అవిశ్వాసంలో మూడింట రెండు వంతుల ఆధిక్యం, తాజాగా రాజ్యసభ ఉపాధ్యక్ష స్థానాల కైవసంతో కమలం పరిమళిస్తోంది. తిరుగేలేదన్నట్లుగా సార్వత్రిక ఎన్నికలకు సవాల్ విసురుతోంది. కాంగ్రెసుకు కష్టకాలమే నడుస్తోంది.

లౌక్యం..చాణక్యం...

‘అనువుగాని చోట అధికులమనరాదు.’ అన్న నీతిసూత్రాన్ని వంటపట్టించుకున్న బీజేపీ అగ్రనాయకద్వయం మోడీ,అమిత్ షా చక్కని ఎత్తుగడలతో సాగుతున్నారు. అవసరమైన ప్రతిచోటా తగ్గి నెగ్గుతున్నారు. మిత్రపక్షమైన జేడీ(యూ)కి రాజ్యసభ వైస్ ఛైర్మన్ సీటు ఇవ్వడంలోనే చాణక్యం దాగి ఉంది. కేంద్రమంత్రివర్గంలో తగు స్థానం లేక ఆ పార్టీ విలవిల్లాడుతోంది. అసంతృప్తి సెగలతో రగిలిపోతోంది. మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆశించినన్నిస్థానాలు దక్కేఅవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలిచిన బీజేపీ,లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయలోక్ సమతా పార్టీలు తమ స్థానాలను తగ్గించుకునేందుకు సిద్దంగా లేవు. బీజేపీ 22, ఎల్జేపీ 6, ఆర్ఎల్ఎస్పీ 3 స్థానాల్లో గెలిచాయి. ఈ కూటమి 2014లో ఘనవిజయం సాధించింది. జేడీ(యూ) కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. 2019లో జరగబోయే ఎన్నికల్లో కనీసం తనకు 20 స్థానాలు కేటాయించాలని జేడీయూ డిమాండ్ చేస్తోంది. 2స్థానాలు గెలిచిన జేడీయూకు పదిరెట్ల టిక్కెట్లు కేటాయించేందుకు బీజేపీ,ఎల్జేపీ,ఆర్ఎల్ఎస్పీ సిద్దంగా లేవు. దీంతో ప్రస్తుత అధికార కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు ఈ ఎన్నికను ఎరగా వినియోగించింది బీజేపీ. అదే సమయంలో తమతో కలిసి నడుస్తున్న మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యమిస్తామన్న సంకేతాలనూ పంపగలిగింది.

ఎత్తులతో చిత్తు...

ఎత్తులతో ప్రతిపక్షాలను చిత్తు చేయడంలో మోడీ,అమిత్ షాల వ్యూహాలే వేరు. కమలం అభ్యర్థిని నేరుగా రంగంలోకి దింపకపోవడం వల్ల తటస్థ పార్టీలను ఆకర్షించేందుకు యత్నించారు. తమకు బలం లేకపోయినా తమ కూటమి అభ్యర్థి గెలిచేలా పావులు కదిపారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను తటస్థం చేయగలిగారు. ఇందుకుగాను రాయబారాల నిమిత్తం ప్రధాన విపక్షాలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తుల సేవలు వినియోగించుకున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సత్సంబంధాలున్నాయి. తమ అభ్యర్థి కోసం ఆయన తెలంగాణ, ఢిల్లీ, ఒడిసా ముఖ్యమంత్రులతో మాట్టాడి సహకారం అభ్యర్థించారు. టీఆర్ఎస్, బీజేడీ సానుకూలంగా స్పందించాయి. ఆప్ తటస్థమైపోయింది. వైసీపీ గైర్హాజరైంది. దాంతో అధికారపార్టీ పని జరిగిపోయింది. రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఇద్దరూ అధికారకూటమికి చెందినవారే. వైసీపీ, డీఎంకే వంటి పార్టీలు సైతం గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తూ ఎన్డీఏ అభ్యర్థి నెగ్గే క్రమంలో తమవంతు సహకారం అందించేలా చేసుకోగలిగారు. అంకెల బలం తమకు అనుకూలంగా లేకపోయినా మలుపు తిప్పి విజయాన్ని కైవసం చేసుకోవడం ఎలాగో చేతల్లో చూపించారు మోడీ, అమిత్ షాలు.

కన్నీటి కాంగ్రెసు.....

విపక్షాల ఐక్యత పేరిట కొంతకాలంగా హడావిడి చేస్తున్న కాంగ్రెసు ఇంకా పరిణతి చెందలేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో వైఫల్యం ఆపార్టీకి పెద్ద గుణపాఠం. గెలుపు సంగతి పక్కనపెట్టినా కనీసం అధికారపక్షానికి జడుపు పుట్టించలేకపోయింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను సైతం కూడగట్టలేకపోయింది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ఆప్ ను పలకరించే నాథుడే కరవు అయ్యారు. కాంగ్రెసు ఓటర్లు ఇద్దరు, డీఎంకే వాళ్లు ఇద్దరు, టీఎంసీ నుంచి ఇద్దరు, ఎస్పీ నుంచి ఒకరు, పీడీపీ నుంచి ఇద్దరు ఓటింగుకు హాజరు కాలేదు. కాంగ్రెసు సరైన ప్రణాళికతో రాజకీయం నడిపి ఉంటే ఆప్ ఓట్లు కూడా దక్కి ఉండేవి. గైర్హాజరీలు లేకుండా సభకు అందరు సభ్యులు వచ్చేలా చూసుకుని ఉంటే అధికారపక్షం అతికష్టం మీద మాత్రమే గట్టెక్కగలిగేది. బీజేడీ కి ఒడిసా లో ప్రధానప్రత్యర్థిగా మారుతున్న బీజేపీని నిలువరించేందుకు నవీన్ పట్నాయక్ ను సంప్రతించి ఉంటే సముచితంగా ఉండేది. అన్నిటా వైఫల్యంతో హస్తం పార్టీ కుదేలైపోయింది. ప్రతిపక్షాల ఐక్యత పగటికలగా మిగిలిపోయింది. 2019 లో సమర్థప్రత్యామ్నాయానికి తాను నాయకత్వం వహించగలనన్న భరోసాను కాంగ్రెసు ఇవ్వలేకపోయింది. భవిష్యత్తులో ప్రతిపక్ష సంఘటిత కూటమి సాధ్యమా? అనే కొత్త ప్రశ్నలను రేకెత్తించింది రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News