కాంగి"రేసు"లో లేనట్లేనా?

Update: 2018-06-22 14:30 GMT

తెలంగాణ కాంగ్రెసు ఆశలపై తటస్థ సర్వేలు నీళ్లు చిలకరిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలైన ఇంటిలిజెన్సు వాళ్లే కొంతలో కొంత బెటర్. పాతికసీట్ల వరకూ కాంగ్రెసు గెలిచేందుకు అవకాశం ఉందని కేసీఆర్ కు నివేదించారు. తమలో తాము కుమ్ములాడుకోవడంలో ఆరితేరిపోయిన కాంగ్రెసు నాయకులు ఫిర్యాదులు చేసుకునేందుకు కొత్త మార్గాలు వెదుకుతున్నారు. అధిష్టానం వద్ద అసమ్మతి శిబిరాలు పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు పెద్ద దిక్కుగా ఉన్న ఉత్తమ్, జానా ఇద్దరికీ సొంత ఇంటిపోరు సమస్యాత్మకంగా మారిపోయింది. గతంలో గులాం నబీ అజాద్, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నాయకులు ఏఐసీసీ నుంచి అధిష్టానం ఇన్ చార్జులుగా పీసీసీ బాధ్యతలు చూసేవారు. రాష్ట్ర నాయకులను కంట్రోల్ చేసేవారు. రాష్ట్రాల ఇన్ ఛార్జులుగా నియమించేవారికి ప్రధానకార్యదర్శి స్థాయి ఉంటుండేది. వారు అధిష్టానానికి సన్నిహితంగా మెసలేవారు. ప్రస్తుతం కార్యదర్శి హోదాలో ఉన్న కుంతియానే తెలంగాణ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలు జుట్లు పట్టుకుంటున్నారు. కుంతియా నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. పరిస్థితి అదుపు తప్పి పాలకపక్షానికి అనుకూలంగా మారుతోంది.

12 సీట్లలోనే పట్టు...

కనీసం అరవై సీట్లు సాధిస్తేనే కానీ తెలంగాణలో అధికారం సాధ్యం కాదు. 2014 ఎన్నికల్లో 21 స్థానాల వరకూ కాంగ్రెసు సాధించింది. రాష్ట్రాన్ని ప్రసాదించిన ఊపులో ఎన్నికలకు వెళ్లిన ఘట్టం అది. అప్పట్లో కేసీఆర్ సాహసించి ఒంటరిగా బరిలో దిగారు. బొటాబొటి మెజార్టీతో 63 సీట్లు తెచ్చుకున్నారు. ఆతర్వాత ప్రజాక్షేత్రంలో సాగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ బలపడుతూ వచ్చింది. కొన్నిచోట్ల కాంగ్రెసు డిపాజిట్లు కూడా కోల్పోయింది. బస్సుయాత్ర , నియోజకవర్గాల్లో రైతు చైతన్యయాత్రల వంటివాటికి కాంగ్రెసు ప్రయత్నించినా పెద్దగా ఫలితం రావడం లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ మూడు నాలుగు కుంపట్లు తయారయ్యాయి. అందరూ సీనియర్ నాయకులే కావడంతో ఎవర్నీ సర్దిపుచ్చే పరిస్థితి లేదు. ఈ బలహీనత పార్టీని మరింతగా దెబ్బతీస్తోంది. తాజాగా ఒక అధ్యయన సంస్థ నియోజకవర్గాల్లో శాంప్లింగ్ సర్వే చేస్తే దారుణమైన ఫలితాలు వచ్చాయి. 12 నుంచి 15 సీట్లలో మాత్రమే కాంగ్రెసు కచ్చితంగా గెలవగల అవకాశాలున్నట్లు రిపోర్టు వచ్చింది. మరో 20 స్థానాల వరకూ గట్టిగా కష్టపడితే పోటీని ఇవ్వగలుగుతాయని తేలింది. మొత్తమ్మీద సంఖ్య 35 దాటడం లేదు. టీఆర్ఎస్ కు 75 స్థానాలకు ఢోకా లేదు. మరో ఏడు స్థానాల్లో కష్టపడితే ఫలితం సానుకూలమవుతుందంటున్నారు. ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ సర్వే అనే విమర్శలూ లేకపోలేదు. కానీ కాంగ్రెసు బలహీనపడిందన్న విషయాన్ని రాజకీయ పరిశీలకులు కూడా అంగీకరిస్తూ ఉండటం విశేషం.

కేసీఆర్ టినా ఫాక్టర్ ...

వ్యూహాత్మకమైన ఎత్తుగడలతో కేసీఆర్ టినా(దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్) ఫాక్టర్ సృష్టించుకోగలిగారు. ప్రత్యామ్నాయం కనిపించని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ను బలోపేతం చేసుకున్నారు. బలమైన రాష్ట్రస్థాయి నాయకత్వం తెలంగాణను శాసిస్తోంది. అగ్రభూమికలో కేసీఆర్ నిలుస్తున్నారు. కేటీఆర్ ,హరీశ్, కవిత, సంతోష్ వంటి కుటుంబ సభ్యులు ద్వితీయశ్రేణిని ఆక్రమిస్తున్నారు. పార్టీని నమ్ముకుని తొలి నుంచి పనిచేస్తున్న ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి వంటివారితోపాటు తెలుగుదేశం నుంచి వలస వచ్చిన తుమ్మల, కడియం వంటి సీనియర్ నేతలు తృతీయశ్రేణిలో సర్దుకుపోయారు. మిగిలిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం నాలుగో వరసకే పరిమితమవుతోంది. అయినప్పటికీ పార్టీలో విభేదాలు పెద్దగా కనిపించడం లేదు. కేసీఆర్ కు భయపడో, లేక టిక్కెట్టు రాదనే జంకుతోనో నియోజకవర్గాల వారీ అసమ్మతి కట్టు దాటడం లేదు. రైతు బంధు పథకంతో గ్రామ స్థాయిలో మరింతగా టీఆర్ఎస్ బలపడిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెసులో అసమ్మతి హద్దులు చెరిపేసుకొంటుంటే టీఆర్ఎస్ లో ఆ ఊసు ఎత్తడానికే ఎవరూ సాహసించడం లేదు.

జోష్ లేని జానా శిబిరం...

2014లో కాంగ్రెసు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా పోటీ పడే స్థాయి జానారెడ్డిది. పార్టీ నాయకత్వ వైఫల్యం తో సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. 2019 కి అయినా కనీసం జానాను సీఎం క్యాండిడేట్ గా కాంగ్రెసు ప్రకటించాలని జానా అనుయాయులు కోరుకుంటున్నారు. పంజాబ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం వల్ల గెలుపు సాధ్యమయ్యింది. తెలంగాణలో కూడాఅదే విధంగా చేయాలనే డిమాండ్ ఉంది. కానీ ఈ స్థానానికి ఉత్తమ్ ప్రధానపోటీదారుగా మారిపోయారు. జానారెడ్డిపై శాసనసభ్యులే తిరుగుబాటు ప్రకటించి పత్రికా విలేఖరుల సమావేశాలు పెట్టడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దీంతో పొలిటికల్ గా తన కెరియర్ ముగిసినట్లేనని జానా ఒక అంచనాకు వచ్చేశారు. పార్టీ పరంగా ఉత్సాహాన్ని కనబరచడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చాలా చురుకైన పాత్రనే పోషించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పార్టీ లోని నాయకులు సహకరించడం లేదు. తాజాగా రాష్ట్రంలోని కొందరు అగ్రనాయకులతో కూడిన 30 మంది బృందం రాహుల్ ను కలిసి ఉత్తమ్ పై ఫిర్యాదు చేసింది. పనిలో పనిగా జానారెడ్డి తీరునూ ఎండగట్టేసింది. వీరిద్దరి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెసుకు పుట్టగతులుండవని తేల్చి చెప్పేశారు. రాహుల్ కు మరో శిరోభారం మొదలైనట్లే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News