హస్తం ఖాతాలో ఈ రెండూ కలుస్తాయా?

Update: 2018-06-02 16:30 GMT

కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్,మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మిజోరామ్ తప్ప మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల ఈ మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ కు అత్యంత కీలకం. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో మూడు దఫాలుగా బీజేపీ అధికారంలో కొనసాగుతుంది. రాజస్థాన్ లో ఒకసారి కంగ్రెస్, మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో విజయావకాశాలు ఉన్నాయన్న వార్తలు, సర్వేల నేపథ్యంలో హస్తం పార్టీలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో అధికారం కోసం పార్టీ మొహం వాచి ఉంది. దిగ్విజయ్ సింగ్ పదేళ్ల పాలన అనంతరం ఆ రాష్ట్రంలో పదిహేనేళ్లుగా కాంగ్రెస్ ది ప్రతిపక్ష స్థానమే. ఇటీవల ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈ రెండు రాష్ట్రాలపై హస్తం పార్టీ ఆశలు పెంచుకుంది. ఆశలతోనే సరిపెట్టుకోకుండా అధికార సాధన దిశగా సైతం అడుగులు వేస్తోంది.

డిగ్గీరాజా తేల్చేయనున్నారా?

ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ పార్టీ సమన్వయ కమిటీ అధినేతగా దిగ్విజయ్ సింగ్ ను నియమించింది. దిగ్విజయ్ పార్టీ సీనియర్ నేత. రాష్ట్రంలో పట్టున్న నాయకుడు. పదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు. అధికారం కోల్పోయి పదిహేనేళ్లు అయిపోయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్ చార్జ్ గా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడు జ్యోతిరాదిత్య సింధియా, ఎన్నిలక ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా సురేష్ పచౌరిని నియమించారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 230 స్థానాలకు గాను బీజేపీ 165, కాంగ్రెస్ కు 58 లభించాయి. కమలం పార్టీ 44.8 శాతం, హస్తం పార్టీ 36.3 శాతం ఓట్లను కైవసం చేసుకున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాలకు గాను కాంగ్రెస్ కు లభించింది కేవలం రెండే రెండు సీట్లు కావడం గమనార్హం. గుణ స్థానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా, బింద్వారా నుంచి కమలనాధ్ ఎన్నికయ్యారు. మిగిలిన 27 స్థానాలూ కమలం పార్టీ కైవసమయ్యాయి. ఇటీవల జరిగిన ముంగోలి, కొలారస్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతకు ముందు 2015 నవంబరులో జరిగిన రత్నాం లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయం పార్టీకి పెద్ద ఊరట. వీటికి తోడు సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు తమకు కలసి వస్తాయని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. దీంతో పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా మళ్లించేందుకు నాయకత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగమే దిగ్విజయ్ సింగ్ నియామకం. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన దిగ్విజయ్ కు ప్రజల్లో కొంత పట్టుంది. కుటుంబ వారసత్వం పీసీసీ చీఫ్ జ్యోతిరాదిత్య సింధియాకు కలసొచ్చే అంశం. కమలనాధ్, సురేష్ పచౌరీలు ప్రజా బాహుళ్యంలో పట్టున్న నాయకులు.

ఇక్కడ భారీగానే ఆశలు.....

హస్తం పార్టీ బాగా ఆశలు పెట్టుకున్న మరో రాష్ట్రం రాజస్థాన్. ఇక్కడ అధికార పార్టీ ఓడిపోవడం ప్రతిసారీ ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతోంది. పరిస్థితులు కూడా ఆ దిశగానే సాగుతున్నాయనిభావిస్తోంది. వాస్తవానికి 2013 ఎన్నికల్లో పార్టీ పరాభవం పాలైంది. 200 స్థానాలకు 165 స్థానాల్లో కమలం పార్టీ ముందుండగా కాంగ్రెస్ కేవలం 21 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో 16 మంది స్వతంత్రులు విజయం సాధించారు. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాు ముఖ్యమంత్రి వసుంధర రాజే నాయకత్వంపై సొంత పార్టీలోనే అసంతృప్తి తమకు కలసి వస్తాయిని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. రాజ కుటుంబం నుంచి వచ్చిన వసుంధర ప్రజలకు, పార్టీ శ్రేణులకు పెద్దగా అందుబాటులో ఉండరన్న ప్రచారం ఉంది. ఆమె అహంకార పూరిత ధోరణి సొంత పార్టీకి పెద్ద సమస్యగా మారింది. వీటికి తోడు సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, జాతీయ స్థాయిలో తగ్గుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభ, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు ప్రజలను తమ వైపు మళ్లిస్తాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. పార్టీ సీనియర్ నేత, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ గెహ్లెట్ ను జాతీయ రాజకీయాలకు పరిమితం చేసి రాష్ట్ర వ్యవహారాలను పూర్తిగా పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ కు అప్పగించారు. యువనాయకుడైన పైలెట్ కు ప్రజల్లో బలం ఉంది. ఆయన తండ్రి రాజేష్ పైలెట్ కు అప్పట్లో రాజీవ్ గాంధీతో మంచి సాన్నిహిత్యం ఉంది. 2013 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సచిన్ పైలెట్ రాష్ట్రంలోనే ఉంటూ పర్యటనలు చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి గురైంది. మొత్తం 25 స్థానాలకు గాను ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అజ్మీర్, ఆల్వాల్ లోక్ సభ, మండోర్ ఘర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం పార్టీకి కొండంత ఊరట. వాస్తవానికి ఈ మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలే కావడం గమనార్హం. లోక్ సభ ఉప ఎన్నికలలో భారీ ఆధిక్యం సాధించడం భవిష్యత్ విజయానికి నాంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్మర్ వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ, కలసి కట్టుగా పనిచేస్తే ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని హస్తం పార్టీ ధీమాగా ఉంది.

 

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News