కొంపకూల్చేస్తాయా…?

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుంది. ఏళ్లుగా పాతుకుపోయిన భారతీయ జనతా పార్టీ సర్కార్ ను కూలదోశామన్న సంతోషం లేకుండానే పార్టీ అగ్రనేతల మధ్య [more]

Update: 2019-09-10 16:30 GMT

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుంది. ఏళ్లుగా పాతుకుపోయిన భారతీయ జనతా పార్టీ సర్కార్ ను కూలదోశామన్న సంతోషం లేకుండానే పార్టీ అగ్రనేతల మధ్య విభేదాలు తలెత్తడం ఆందోళనకరంగా మారింది. అసలే అరకొర సంఖ్యతో నెట్టుకొస్తున్న సర్కార్ పార్టీలో అగ్రనేతల మధ్య పొరపచ్చాలు ఎటువైపునకు దారితీస్తాయోనన్న అయోమయం పార్టీ నేతల్లోనూ నెలకొని ఉంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను భారతీయ జనతా పార్టీ ఆసక్తికరంగా గమనిస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో…..

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ చావుతప్పి కన్నులొట్ట పోయిన చందంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొద్దిరోజులకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ చతికల పడింది. దీనికి కారణం దేశమంతా బీజేపీ ప్రభంజనం, మోడీ హవా వీయడం ఒక కారణమయితే పార్టలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం మరొక కారణంగా చెప్పాలి. ఇక్కడ కమల్ నాధ్ కుమారుడు ఒక్కడే విజయం సాధించడం విశేషం.

సింధియాను పక్కన పెట్టి….

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత యువనాయకత్వానికి రాష్ట్ర బాధ్యతలను అప్పగిస్తారనుకున్నారు. జ్యోతిరాదిత్య సింథియాను ముఖ్యమంత్రిని చేస్తారనుకున్నారు. అయితే సీనియర్లు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ ఒక్కటి కావడంతో పార్టీలో రాహుల్ మాట కూడా చెల్లుబాటు కాలేదు. దీంతో జ్యోతిరాదిత్య సింధియాను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించాలని కోరినా ఆయన నిరాకరించారు. దీనికి కారణం సీనియర్ నేతల వైఖరేనని ఆయన బాహాటంగానే చెబుతున్నారు.

ఎమ్మెల్యేల్లో అసహనం…..

ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ప్రధానంగా కాంగ్రెస్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ ల మధ్య వార్ మరింత ముదిరింది. పీసీీసీ చీఫ్ పదవి నియామకంలోనూ, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ దిగ్విజయ్ సింగ్ జోక్యాన్ని సింధియా వర్గం సహించలేకపోతోంది. ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలకు దిగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా అవసరమైతే జెండా పీకేస్తానని కూడా హెచ్చరించడం ఇందుకు నిదర్శనం. ఈ ఎఫెక్ట్ ఎమ్మెల్యేలపై పడి ప్రభుత్వం కుప్పకూలుతుందేమోనన్న భయం హస్తం పార్టీలో నెలకొని ఉంది. సోనియా గాంధీ రంగంలోకి దిగి సర్దిచెబుతున్నా పరిస్థితులు మాత్రం చేయి జారిపోయినట్లేనన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News