మిషన్ 2020 …?

ీఅఖిల భారత కాంగ్రెస్… ఇప్పుడు అత్యంత దయనీయ స్థితిలో ఉంది. వందేళ్లకు పైగా చరిత్రగల పార్టీ నేడు దారీ తెన్నూ తెలియక దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. [more]

Update: 2019-08-11 18:29 GMT

ీఅఖిల భారత కాంగ్రెస్… ఇప్పుడు అత్యంత దయనీయ స్థితిలో ఉంది. వందేళ్లకు పైగా చరిత్రగల పార్టీ నేడు దారీ తెన్నూ తెలియక దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతోంది. దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన పార్టీ నేడు అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది. వరసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేక, మళ్లీ లేవలేనంతగా చతికిలపడిపోయింది. తన నుంచి విడిపోయి ప్రత్యేక కుంపట్లు పెట్టుకున్న ఎన్సీపీ, టీఎంసీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నా తాను మాత్రం నిస్తేజంగా కాలం వెళ్లదీస్తుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది అత్యంత క్లిష్ట కాలమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

పార్టీ పునరుజ్జీవానికి…

ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి? పార్టీని ఎలా పునర్జీవింప చేయాలి? ఎలా పట్టాలను ఎక్కించాలి? పూర్వ వైభవాన్ని ఎలా సంతరించుకోవాలి? అన్న అంశాలపై రకరకాల సూచనలు, సలహాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ శ్రే‍యోభిలాషులు, అభిమానులు తమకు తోచిన అభిప్రాయాలను చెబుతున్నారు. పాత పద్దతులను విడనాడి పార్టీనిక కార్పొరేట్ కంపెనీ తరహాలో నడపాలన్నది ప్రధాన సూచన. ఇందుకోసం మిషన్ 2020 నివేదిక రూపొందించారు. వెనకటి పద్ధతులు, విధానాలు విడనాడకపోతే పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుందని శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. అధికార బీజేపీ తరహాలో కార్పొరేట్ విధానాలను అమలు చేయాలని సూచిస్తున్నారు. వాజ్ పేయి, అద్వానీ హయాంలో సంప్రదాయ విధానాలను అవలంబించడం వల్ల కమలం పార్టీ విస్తరించలేదని వారు గుర్తు చేస్తున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా లు పూర్తిగా కార్పొరేట్ తరహా విధానాలతో ముందుకు పోవడం వల్ల పార్టీ 2014, 2019 ఎన్నికల్లో విజయఢంకా మోగించిందని వారు చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సిందదే. వృద్ధనాయకత్వం, కాలం చెల్లిన విధానాలకు చరమగీతం పాడటం, క్షేత్రస్థాయిలో సుశిక్షుతులైన కార్యకర్తలు, బూత్ లెవెల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ద్వారా మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చన్న అభిప్రాయం వినపడుతోంది. ఈ వ్యూహంలో భాగంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాక్, పంచాయతీ స్థాయి వరకూ కాంగ్రెస్ పార్టీని కార్పొరేటీకరించాలి. ప్రతి స్థాయిలో మానవ వనరుల విభాగాలను ఏర్పాటు చేయాలి. వాటి ద్వారా సుశిక్షితులైన కార్యకర్తలు, నాయకులను తయారు చేయాలి. వారికి పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, చరిత్ర తో పాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు చేసిన మేలు తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలి. అనంతరం వారు ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లాలి. ప్రతి వంద మంది కార్యకర్తలపై పర్యవేక్షణకు ఒక ఆఫీస్ బేరన్ ను నియమించాలి. ఈ కార్యక్రమం నిరంతరం జరగాలి. పార్టీ విధానాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయడం అవసరం.

ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా…..

రాష్ట్రాలు, ప్రాంతాలు, స్థానిక పరిస్థితులను బట్టి విధానాల్లో స్వల్ప మార్పులు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అగ్రవర్ణాలు, మరికొన్ని రాష్ట్రాల్లో బలహీన వర్గాలు, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఉదాహరణకు కర్ణాటకలో అగ్రవర్ణాలైన ఒక్కలిగ, లింగాయత్ లు పార్టీకి దూరమైనప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ల మద్దతుతో పార్టీ మనుగడ సాగించింది. 2013-18 మధ్య కాలంలో అధికారాన్ని పొందింది. గత ఏడాది ఎన్నికలలోనూ రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ బలమైన అగ్రవర్ణాల మద్దతు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మద్దతుతో సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగింది. పంజాబ్ లో మెజారిటీ సామాజికవర్గమైన సిక్కులతో పాటు హిందువులను కూడా ఓటు బ్యాంకుగా మలచుకుంది. ఫలితంగా ఒకసారి ఓడినా రెండోసారి విజయం సాధిస్తుంది. రాజస్థాన్ లో బలమైన జాట్ సామాజికవర్గాన్ని కాదని బీసీ అయిన అశోక్ గెహ్లాట్ కు బాధ్యతలను అప్పగించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తోంది. అదే పక్కన ఉన్న హర్యానాలో జాట్ సామాజిక వర్గంపై ఆధారపడుతుంది. ఇలా రాష్ట్రాల్లో సామాజిక పరిస్థితులను బట్టి ముందుకు పోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధానాన్ని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

వృద్ధనేతలను పక్కన పెట్టి….

కాలం చెల్లిన లౌకికవాదాన్ని పట్టుకుని వేలాడితే మెజారిటీ ప్రజలు దూరమవుతారు. ఈ వాస్తవాన్ని గ్రహించక పార్టీ చాలా నష్టపోయింది. దీనిని సవరించుకోవడం అవసరం. వృద్ధ నాయకత్వం స్థానంలో యువరక్తాన్ని నింపాలి. మోతీలాల్ ఓరా, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, అంబికా సోని, ఎకే ఆంటోని వంటి వృద్ధ నేతలను బాధ్యతల నుంచి తొలగించాలి. పార్టీలో అత్యున్న విధాన నిర్ణయాక సంఘం అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలి. ఈ విష‍యంలో బీజపీ ముందుంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. మార్పును ఆహ్వానించడం, ఆచరించడం ద్వారా పార్టీకి జవసత్వాలు కల్పించవచ్చు. ఇప్పటికిప్పుడు అధికారలోకి రాకపోయినా గౌరవప్రదమైన స్థానం లభించవచ్చు. వచ్చే అయిదేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. అధికారంలోకి రానూ వచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News