ఇమిటేట్ చేస్తే హ్యాండ్ రైజ్ అవుతుందా?

వందేళ్లకు పైగా చరిత్రగల అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అస్థిత్వ సంక్షోబాన్ని ఎదుర్కొంటుంది. పార్టీలో పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది. గందరగోళపరిస్థితి నెలకొంది. అసలు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా [more]

Update: 2019-09-30 16:30 GMT

వందేళ్లకు పైగా చరిత్రగల అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అస్థిత్వ సంక్షోబాన్ని ఎదుర్కొంటుంది. పార్టీలో పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది. గందరగోళపరిస్థితి నెలకొంది. అసలు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్న అనుమానాలు అంతర్గతంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ఎలా పునరుజ్జీవింప చేయాలన్న అంశంపై విస్తృత సమాలోచనలు జరుగుతున్నాయి. ఏం చేస్తే పార్టీ పునర్ వైభవం సాధించగలరన్న విషయమై విస్త్రత చర్యలు సాగుతున్నాయి. కార్యకర్తలు, నాయకులను ఎలా ఉత్తేజితుల్ని చేయాలన్న దానిపైఎవరితోచిన సలహాలు వారు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు అధికార భారతీయ జనతా పార్టీ తరహాలో ఆర్.ఎస్.ఎస్ ( రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) హస్తం పార్టీలో కూడా ప్రేరక్ ల వ్యవస్థను ప్రారంభించాలన్న విషయమై స్థూలంగా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బీజేపీ పేరుకు తెరపై కనపడినప్పటికి పార్టీ విస్తరణకు తెరవెనుక ఆర్.ఎస్.ఎస్ చేసే కృషి అంతా ఇంతా కాదు.

బీజేపీ తరహాలో….

మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్ పూర్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న ఆర్.ఎస్.ఎస్ దశాబ్ధాల తరబడి పార్టీకి వెన్నముకగా పనిచేస్తోంది. కేంద్రంలో, వివిధ ఎన్నికల్లో అధికారం సాధించినప్పటికీ ఆర్.ఎస్.ఎస్ శ్రేణులు ఇప్పటికే అలుపెరగకుండా పనిచేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆర్.ఎస్.ఎస్ కృషి శ్లాఘనీయం. క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడం, పార్టీ విస్తరణకు పటిష్టమైన పునాదులు వేయడంలో ఆర్.ఎస్.ఎస్ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ముఖ్యంగా 370 అధికరణ రచ్చ, త్రిపుల్ తలాక్ రద్దు, ఉన్మాద పౌర స్మృతి, అయోధ్య వంటి పార్టీ అజెండాను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళుతూ పార్టీ విస్తరణకు ఆర్.ఎస్.ఎస్ పాటు పడుతోంది.

కాంగ్రెస్ సిద్ధాంతాలను….

బీజేపీ తరహాలో ప్రేరక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం సాధించవచ్చన్నది హస్తం పార్టీ ఆలోచనగా ఉంది. ప్రేరక్ వ్యవస్థ ఆర్.ఎస్.ఎస్ తరహాలో ఉంటుంది. గాంధీ, నెహ్రూ కుంటుంబం స్వాతంత్ర్య సాధనకు చేసిన కృషి సుదీర్ఘకాల పాలనలో దేశ ప్రగతికి పాటుపడినతీరు, దేశ సమగ్రత, సమైక్యత పరిరక్షణకు పార్టీ చేసిన కృషి, ఇందిర, రాజీవ్ గాంధీ బలిదానాల వంటి అంశాలను ప్రేరక్ వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి బలపడాలని ఆలోచిస్తోంది. యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలన, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కుచట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, సంకీర్ణ సంక్షోభం నడపడంలో పార్టీ సామర్థ్యం, లౌకిక వాదం, తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి వారి మద్దతు పొందాలంటే ప్రేరక్ వ్యవస్థ ఏర్పాటు ఒక్కటే సరైనపరిష్కారమన్నది హస్తం పార్టీ ఆలోచనగా చెబుతున్నారు.

అంత ఈజీ కాకపోయినా….

ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకుల సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసోం మాజీ సీఎం తరుణ్ గగోయ్ ఈ మేరకు చేసిన సూచనను పార్టీ ఆమోదించింది. ఈ మేరకు జిల్లా, మండల స్థాయిలో ప్రేరక్ లను నియమిస్తారు. వారు పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, కార్యక్రమాలు, పార్టీ అధికారంలో ఉన్న రాష్టాల్లో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. దేశసమగ్రత, సమైక్యత పరిరక్షణ, లౌకిక విధానాన్ని కాపాడేందుకు, మైనారిటీల అభ్యున్నతి, సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువెళతారు. బీజేపీ తరహా ఆర్.ఎస్.ఎస్ కు ప్రేరక్ వ్యవస్థ కాపీ కాదని పార్టీ అధికార ప్రతినిధి ఆర్.పి.ఎన్ సింగ్, ప్రధాన కార్య దర్శి వేణుగోపాల్ చెబుతున్నారు. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్.ఎస్.ఎస్ మాదిరిగా నిబద్ధులైన, సుశిక్షితులైన కార్యకర్తలు హస్తం పార్టీకి లేరు. ఇక అత్యవసర పరిస్థితి, స్వర్ణదేవాలయంలో సైనిక చర్య, అయోధ్య గుడితాళాలు తెరిపించడం ద్వారా వివాదాన్ని తీవ్రం చేయడం, వంటి అంశాలు ఇంకా ప్రజల నుంచి తొలగిపోలేదని వారు గుర్తుచేస్తున్నారు. కేవలం గాంధీ కుటుంబ చరిత్ర, వారసత్వం మాత్రమే పార్టీని కాపడలేవన్నది వారి వాదన. వృద్ధ న్యాయకత్వాన్ని పక్కకు పెట్టి కొత్త రక్తం ఎక్కించడం, యువతను ప్రోత్సహించడం, లౌకిక వాదానికి దూరంగా ఉండడం వంటి చర్యల ద్వారానే హస్తం పార్టీ ప్రజల మెప్పు పొందగలదు. అంతేగానీ అనుకరణలు అన్ని వేళలా పనిచేయవు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News