ఆరంభం.. ఆత్మ విశ్వాసం.. ఫ్రీగా ఇస్తేనే?

భారతదేశంలో కోవిడ్ వాక్సినేషన్ ప్రారంభమైంది. నిజానికి వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడచిన రెండు నెలలుగా సాధారణ జనజీవనం మొదలైపోయింది. అంతకుముందు [more]

Update: 2021-01-17 15:30 GMT

భారతదేశంలో కోవిడ్ వాక్సినేషన్ ప్రారంభమైంది. నిజానికి వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడచిన రెండు నెలలుగా సాధారణ జనజీవనం మొదలైపోయింది. అంతకుముందు ఏడు నెలలపాటు ప్రజలు దాదాపు నిర్బంధంలో గడిపారు. పాక్షికంగా మాత్రమే కార్యకలాపాలు నడిచాయి. అదీ అత్యవసర వస్తువులు, వ్యాపారాలకే పరిమితమయ్యాయి. కానీ నవంబర్ నుంచి యాక్టివిటీస్ యథాలాపంగానే సాగుతున్నాయి. ఇంక వ్యాక్సిన్ రాకపోయినా ఫర్వాలేదన్నంత ధీమాగా సగటు మనిషి తిరిగేస్తున్నాడు. అయినా ఎక్కడో అనుమానం. పక్కవాడు తుమ్మినా, దగ్గినా, లేకపోతే మాస్క్ లేకపోయినా భయం, భయంగానే ఉంటోంది. దానినుంచి నివారించి భరోసా ఇచ్చేందుకే ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మనిషిని మనిషి చూసి భయపడే పరిస్థితులను నెలకొల్పింది కోవిడ్. దాని నుంచి విముక్తి ప్రసాదించడానికి వ్యాక్సిన్ తోడ్పడుతుంది. ఆత్మవిశ్వాసానికి ఆరంభంగా నిలుస్తుంది. ఆర్థిక కార్యక్రమాలు మరింతగా పుంజుకోవడానికి ఉపకరిస్తుంది.

సవాల్ కు ‘సై’…

భారతదేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయడమంటే మాటలు కాదు. 130 కోట్ల జనాభా. వ్యాక్సిన్ తయారీ పెద్ద సమస్య కాదు. కోవిడ్ పై పరిశోధన చేసిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టిన ఖర్చు రాబట్టుకోవాలి. అందుకే సాధ్యమైనంత ఎక్కువ ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంపిక చేసుకోవడమే ప్రభుత్వ బాధ్యత. తొలిదశలో ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వకుండా నియంత్రిత పద్ధతిలోనే వాక్సిన్లను దేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం రెండు టీకాలకే అనుమతి ఉన్నప్పటికీ రానున్న రెండు మూడు మాసాల్లోనే మరో అయిదు రకాల వ్యాక్సిన్లు అంతర్జాతీయ మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటన్నిటినీ పరిశీలించి భారతీయ అవసరాలకు అనుగుణమైన వాటిని ఎంపిక చేయాలి. రక్షణతో పాటు సామర్థ్యం కూడా ముఖ్యమే. అందులోనూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కు భారత్ వేదిక కాబోతోంది. కాబట్టి అందుబాటులోని ధర కూడా ముఖ్యమే. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి, ఉదాసీనత, నిర్లక్ష్యాల సంగతి చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ వ్యాపార సంస్థలు రకరకాల ప్రలోభాలతో బుట్టలో వేసుకునేందుకు కూడా చూస్తాయి. వీటన్నిటిని అధిగమించి వ్యాక్సిన్లు ఎంపిక చేయాలి. ప్రాథమ్య క్రమంలో ఏయే వర్గాలను ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేయాలనేది కూడా సవాల్ గా మారబోతోంది. తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పారిశుధ్య, ప్రజా సేవల్లో పాల్గొనేవారికి ఇస్తున్నారు. ఇది సులభంగానే జరిగిపోతుంది. కానీ తర్వాత టీకా ఇవ్వాల్సిన వర్గాల ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరమవుతాయి.

దేశ, రాష్ట్ర సర్కారులు..

ఈ బృహత్తర కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చక్కగా సహకరించుకుంటేనే విజయవంతమవుతుంది. వ్యాక్సిన్ల కొనుగోలుకు అయ్యే వ్యయం కేంద్రం భరిస్తే, దానిని ప్రజలకు చేరేలా చూడాల్సిన బాద్యత రాష్ట్రాలదే. అందువల్ల పూర్తిగా ఈ క్రెడిట్ ను కేంద్ర ప్రభుత్వం క్లెయిం చేసుకునే అవకాశం లేదు. అయితే రాష్ట్రాల పాత్రను తగ్గించి చూపాలనుకుంటోంది కేంద్రం అనే విమర్శలున్నాయి. నిజానికి లాక్ డౌన్ ప్రకటనలను కేంద్రం చేసింది. దానిని సమర్థంగా అమలు చేసే బాధ్యతను రాష్ట్రాలే చూసుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కేంద్రం కంటే రాష్ట్రప్రభుత్వాలే ఈ విషయంలో ఎక్కువ కష్టనష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రాజకీయ పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమైనా తమ పాత్రను ప్రజల్లో ప్రచారం చేసుకోవాలని భావిస్తాయి. అది తప్పుకూడా కాదు. అందువల్ల తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నప్పటికీ మిగిలిన రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే రాజకీయ వివాదాలు చెలరేగే ప్రమాదం ఉంది. అసలు లక్ష్యం మరుగున పడి ప్రజల్లో ప్రభుత్వాలు పలచన అవుతాయి.

దోపిడీకి తెర తీయవద్దు..

కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా దిగ్గజాలు, దళారులు ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకునేందుకకు సిద్దంగా లేవు. తాము సైతం పాత్ర పోషిస్తామంటూ ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ వైద్య మౌలిక వసతులు అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో వాక్సినేషన్ ప్రక్రియలో ప్రయివేటును అనుమతించక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే కరోనా ప్రబలుతున్న సమయంలో సాగిన దోపిడీ తెలియనిది కాదు. సమగ్రమైన చికిత్స, మెడికేషన్ లేకుండానే కరోనాకు చికిత్స పేరిట లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేశాయి ఆసుపత్రులు. అందినకాడికి దోపిడీ కొనసాగించాయి. ఇప్పుడు సామూహిక వ్యాక్సినేషన్ కు వాటికి అవకాశం కల్పిస్తే ఎంతటి లాభాపేక్షకు పాల్పడతాయో అంచనాకు అందదు. నియంత్రిత ధర పెట్టినప్పటికీ మరేదో పేరు చెప్పి డబ్బులు గుంజడం ఖాయం. అందువల్ల ప్రయివేటు ఆసుపత్రుల ద్వారా వ్యాక్సినేషన్ సాగినప్పటికీ ప్రజలనుంచి సొమ్ములు వసూలు చేయకుండా ప్రభుత్వమే మొత్తం డబ్బులు చెల్లించాలి. అప్పుడే దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. ఒకవేళ ఆసుపత్రులు ఏ రూపంలో అయినా అదనంగా సొమ్ములు వసూలు చేస్తే లైసెన్సు రద్దు చేస్తామని చెప్పాలి. లేకపోతే వైద్య రంగంలో వేల కోట్ల రూపాయల వ్యాపారానికి తెర తీసినట్లవుతుంది. గడచిన పదినెలలుగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయోత్పత్తితో పోల్చుకుంటే వ్యాక్సిన్ ఖర్చు నామమాత్రమే. సర్కారీ సంస్థలే ఈ వ్యయాన్ని భరించాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పిలుపునూ పౌరులు పాటించారు. తమ దైనందిన జీవనం అస్తవ్యస్తమై పోయినా సహకరించారు. అందువల్లనే ఈ ఉపద్రవం నుంచి భారత్ బయటపడగలిగింది. పౌరుల నుంచి లభించిన ఈ అపూర్వ సహకారానికి కృతజ్ణత కోసమైనా పూర్తి ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఆరంభమైన ఆరోగ్య యాత్ర.. చిట్టచివరి వ్యక్తిని చేరే వరకూ సాగినప్పుడే లక్ష్యం సాధించినట్లు అవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News