‘‘హ్యాండ్’’ కు ఏమైంది?

చింత చచ్చినా పులుపు చావదన్న సామెత అక్షరాలా కాంగ్రెస్ పార్టీకి సరిపోతుంది. వరస ఓటములతో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ కుదేలైపోయింది. రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర [more]

Update: 2019-10-06 18:29 GMT

చింత చచ్చినా పులుపు చావదన్న సామెత అక్షరాలా కాంగ్రెస్ పార్టీకి సరిపోతుంది. వరస ఓటములతో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ కుదేలైపోయింది. రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్య పరిచాయి. జాతీయ పార్టీ ఇంత తక్కువ స్థాయిలో సీట్లు సాధించడాన్ని నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. నెలల పాటు మేధోమధనం జరిపిన తర్వాత తిరిగి సోనియాగాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించారు.

రాహుల్ ప్రత్యేక వర్గంగా…..

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనకంటూ ఒక వర్గం ఉండేది. అప్పటి వరకూ సోనియా కోటరీగా ఉన్న నేతలను రాహుల్ గాంధీ కొంత పక్కన పెట్టారు. ఎక్కువగా యువనేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కాంగ్రెస్ సీనియర్లకు రుచించలేదు. సీనియర్ నేతలను పూర్తిగా పక్కన పెట్టకపోయినా రాహుల్ గాంధీ మాత్రం వారి నుంచి సలహాలు స్వీకరించేవారు కాదు. దీంతో సీనియర్ నేతలకు గుస్సాగా ఉండేది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలోనూ సోనియాగాంధీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

సోనియా పగ్గాలు చేపట్టడంతో….

దీంతో సోనియాకు సన్నిహితంగా ఉన్న నేతలు తిరిగి ఆమెకు పార్టీ పగ్గాలు అందిన తర్వాత మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ సీనియర్ నేతల వ్యూహరచన ముఖ్యమైందిగా ఉంది. సీనియర్ నేతలు చెప్పిన వారికే అక్కడి టిక్కెట్ల కేటాయింపు జరిగింది. ఇది కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందంటున్నారు. ఒకటి సోనియా వర్గం కాగా, మరొకటి రాహుల్ వర్గం. రాహుల్ వర్గం నేతలకు ఇప్పుడు అంత ప్రాధాన్యత కన్పించడం లేదు.

రెండు రాష్ట్రాల్లో…..

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన పరిస్థితి. ఇక్కడ గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. మహారాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు. తాను సూచించిన వారికి టిక్కెట్లు ఇవ్వలేదన్నది ఆయన ఆరోపణ. అలాగే హర్యానా పార్టీ మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. వీరిద్దరి ఆరోపణ ఒక్కటే. సోనియా గాంధీకి తెలుసో? తెలియదో? కాని సీనియర్ నేతలు కొందరు రాహుల్ గాంధీ సన్నిహితులను తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనికి వారు ఉదాహరణలు కూడా చెప్పారు. తాము బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇలా త్వరలో జరగనున్న హర్యానా, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని తానే కొని తెచ్చుకొంటోంది.

Tags:    

Similar News