వీరి కంటే వారి పరిస్థితి మరింత ఘోరంగా?

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి భారత్ లాక్ డౌన్ విధానం కఠినంగా అమలు చేస్తుంది. దీని దెబ్బకు కరోనా విస్తరణ ఆగినా లేకపోయినా దేశంలో వలసకూలీల [more]

Update: 2020-04-01 11:00 GMT

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి భారత్ లాక్ డౌన్ విధానం కఠినంగా అమలు చేస్తుంది. దీని దెబ్బకు కరోనా విస్తరణ ఆగినా లేకపోయినా దేశంలో వలసకూలీల అగచాట్లు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు రప్పిస్తున్నాయి. ఉన్న చోట పనిలేక పస్తులతో ఉండలేక మరో పక్క ఆశ్రయం కూడా లేక వీరంతా సొంత ఊళ్లకు బయల్దేరారు. అయితే ఎలాంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో హై వే లే వీరికి ఆశ్రయం అయిపోయాయి.

వందల కిలోమీటర్ల దూరాన్ని….

వీరిని తరలించేందుకు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ ముందుకు రాకపోవడం కరోనా వ్యాప్తి చర్యలకు విఘాతం కలిగిస్తారని వెనుకంజ వేయడంతో కూలీలు కాలి నడకనే నమ్ముకుని సొంత ఊర్లకు బయల్దేరారు. చంటి బిడ్డలతో నెత్తిన సామాన్లతో వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కొందరు కన్నుమూసిన విషాదాలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. అయినా కానీ లాక్ డౌన్ అంటే లాక్ డౌన్ అని భీష్మించాయి ప్రభుత్వాలు.

విదేశాల్లో అదే పరిస్థితి …

ఇక భారత్ లో వలస కూలీలా మాదిరిగానే వేలసంఖ్యలో స్వదేశం వచ్చేందుకు బయల్దేరిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వివిధ దేశాల విమానాశ్రయాల్లో చిక్కుకు పోయారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిపివేయడంతో వీరంతా ఎప్పుడు భారత్ కి చేరుకుంటారో తెలియని పరిస్థితి. చాలామంది ముందే బుక్ చేసుకున్న టికెట్లతో విమానాశ్రయాలు చేరుకొని ఆయా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించడంతో ముందుకు వెళ్లేదారిలేక, వెనక్కి వెళ్లే అవకాశం కోల్పోయి త్రిశంకు నరకంలో కొట్టుమిట్టాడుతున్నారు.

విమానాశ్రాయాల్లో పడిగాపులు…

విమానాశ్రయాల్లో కొద్ది రోజులు భారత విదేశాంగ శాఖ భోజన సదుపాయాలు కల్పించినా ప్రస్తుతం అవి కూడా అందని వారు వేలసంఖ్యలో ఉన్నారు. దాంతో తమ వారి పరిస్థితి పై ఇక్కడి వారి తల్లితండ్రులు బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పై తీవ్ర వత్తిడి తీసుకువస్తున్న అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావంతో సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతుంది. ఇలా లాక్ డౌన్ తో లాక్ అయిన వలస కూలీలు చదువు కోసం ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్లిన వారు ఒకటే కష్టాలు అనుభవిస్తూ ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయం అయ్యింది.

Tags:    

Similar News