దేశం సిద్ధం అవ్వాల్సిందే.. చెప్పినట్లు వినాల్సిందే?

కరోనా వైరస్ పై భారీ యుద్ధానికి భారత్ శరవేగంగా సిద్ధం అయిపోతుంది. వైద్య సాయంలో అభివృద్ధి చెందిన దేశాలకన్నా బాగా వెనుకబడి ఉన్న భారత్ పై అన్ని [more]

Update: 2020-03-29 15:30 GMT

కరోనా వైరస్ పై భారీ యుద్ధానికి భారత్ శరవేగంగా సిద్ధం అయిపోతుంది. వైద్య సాయంలో అభివృద్ధి చెందిన దేశాలకన్నా బాగా వెనుకబడి ఉన్న భారత్ పై అన్ని దేశాలు జాలి చూపాయి. 130 కోట్ల జనాభా వున్న క్రమశిక్షణ లేని ప్రజాస్వామ్య దేశంలో దీన్ని అరికట్టడం అంత సులువు కాదన్నది నిపుణుల అభిప్రాయం. అయితే వారందరి అభిప్రాయాలను తోసిరాజని మోడీ నాయకత్వంలో భారత్ అనూహ్యంగా కరోనా పై యుద్ధం ప్రకటించి ప్రపంచ దేశాలనే ఆశ్చర్య పడేలా చేస్తుంది. మోడీ ఆదేశాలను పాటిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజాక్షేమమే ధ్యేయంగా పని చేయడం మొదలు పెట్టాయి.

రెండు నుంచి మూడు కి వెళ్ళినా…

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిలో స్టేజ్ టూ లోనే భారత్ కొనసాగుతుంది. అయితే అక్కడక్కడా వైరస్ పాజిటివ్ బాధితుల నుంచి మరికొందరికి వ్యాప్తి చెందినట్లు సమాచారం వచ్చినా అవి కూడా తక్కువ సంఖ్యలోనే ఉండటం అదృష్టం. ఈ స్టేజ్ లో ట్రాన్స్ మిషన్ కేసులను సమర్ధవంతంగా డీల్ చేయగలిగితే గండం గట్టెక్కినట్లే. అందుకే ఈ కీలక తరుణంలో వ్యవహరించాలిసిన మార్గ నిర్ధేశాలను కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు పంపింది. దేశంలో ఇప్పటికి మహారాష్ట్ర కరోనా కేసుల నమోదులో టాప్ గా ఉంది. కేరళ సైతం అల్లాడుతోంది. సుమారు వెయ్యి పాజిటివ్ కేసుల సమీపానికి దేశం చేరిపోయింది. మరణాల సంఖ్య 20 కి పైగా చేరింది. అలాగే 60 మందికి పైగా వ్యాధి నుంచి బయటపడి డిశ్చార్జ్ అయిపోయారు.

ఐసోలేషన్ పైనే ఫోకస్ …

ఈ నేపథ్యంలో భయానకమైన థర్డ్ స్టేజ్ ని ఎదుర్కోవడం పై కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్రాలు సిద్ధం అంటున్నాయి. రైల్వే బోగీలను ఐసొలేషన్ కేంద్రాలుగాను, ఐసియు సెంటర్స్ గా తీర్చిదిద్దే ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. మరోపక్క ప్రయివేట్ ఆటోమొబైల్ కంపెనీలు లక్షలలో ఖర్చు అయ్యే వెంటి లెటర్ లను ఆరు ఏడు వేలరూపాయల మాత్రమే అయ్యేంత చౌకగా తయారీకి రెడీ అయిపొయింది. ఇది నిజంగా ఒక సంచలనమే. అరకొర వైద్య సౌకర్యాలతో వణుకుతున్న దేశవాసులకు శుభవార్తే. అలాగే రైల్వే బోగీలు ఆధునిక వైద్యాలయాలుగా మారితే మరిన్ని దేశాలకు ఇది స్ఫూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాలు ఇండోర్ స్టేడియాలను ఆసుపత్రులుగా అన్ని వసతులతో సిద్ధం చేసేస్తున్నాయి. భారత్ వంటి కోట్ల జనాభా ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా తరహా టెస్ట్ లు చేసి నిర్ధారించుకోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో ఎక్కడి వారిని అక్కడే ఉండేలా చేసి వైరస్ సోకిన వారికి చికిత్స అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది ప్రభుత్వం. దాంతో మూడో స్టేజ్ ను కూడా భారత్ సమర్ధంగా ఎదుర్కోగలదన్న నమ్మకం పలువురిలో ఏర్పడుతుంది.

Tags:    

Similar News