అందుకే భారత్ ప్రతిష్ట అలా పెరిగింది

ఇరుగు పొరుగు దేశాల పట్ల మొదటినుంచీ భారత్ ది ఉదార వైఖరే. ఢిల్లీలో ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా వాటి విధానం ఇదే. తనతో పాటు అన్ని [more]

Update: 2021-02-25 16:30 GMT

ఇరుగు పొరుగు దేశాల పట్ల మొదటినుంచీ భారత్ ది ఉదార వైఖరే. ఢిల్లీలో ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా వాటి విధానం ఇదే. తనతో పాటు అన్ని దేశాలూ బాగుండాలన్నదే భారత్ ఉద్దేశం. ఆపత్కాలంలో అవసరమైన మేరకు చేయూత అందించేందుకు సదా సిద్ధంగా ఉంటుంది న్యూఢిల్లీ. కరవు, కాటకాలు, వరదలు, విపత్తులు, భూకంపాల వంటి ప్రత్యేక పరిస్థితుల్లో సాయానికి ఎప్పుడూ ముందుకు వస్తుంది. కానీ పొరుగున ఉన్న చైనా ఇందుకు పూర్తిగా భిన్నం. సాయం పేరుతో ఇరుగు పొరుగు దేశాలకు అప్పులివ్వడం, అంతిమంగా ఆయా దేశాలను అప్పుల ఊబిలోకి దించడం దాని విధానం. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. తాజాగా కొవిడ్ టీకాల పంపిణీకి సంబంధించి ఈ దేశాల వైఖరులు ప్రపంచానికి తేటతెల్లమయ్యాయి. ఎవరు నిజమైనమిత్రులో, ఎవరు అవసరార్థ మిత్రులో సోదాహరణంగా రుజువైంది.

అమ్ముకునేందుకే….

వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తికి కారణమైన చైనా తమ దేశంలో తయారైన ‘సోనవాక్’ టీకాను సరఫరా చేస్తామని ఆర్భాటం చేసింది. మయన్మార్ కు మూడు లక్షల డోసులు ఇస్తామని ముందుగా ప్రకటించింది. ఆ తరవాత చేతులెత్తేయడంతో ఒకప్పటి ఆ మిత్ర దేశం అసంతప్తి వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ కూ ఇదే తరహా హామీ ఇచ్చింది. చివరకు టీకా తయారీ వ్యయంలో కొంతమొత్తాన్ని భరించాలని బీజింగ్ మెలిక పెట్టడంతో బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేసింది. ‘సోనవాక్’ టీకా సమర్థతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని సమర్థత 50.75 శాతమేనని నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయాసియా, యునైటెడ్ అరబ్ఎమిరేట్స్, ఇండోనేసియా, బ్రెజిల్, బొలీవియా, పెరూ తదితర దేశాల్లో ప్రయోగతాత్మకంగా వేస్తున్నారు.మొత్తం అయిదు రకాల కరోనా టీకాలను తయారు చేశామంటూ బీజింగ్ వాటిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తోంది. అయిష్టంగానే ఆయా దేశాలు టీకా తీసుకుంటున్నాయి. లాభాపేక్ష తప్ప సేవాభావం చైనాలో కనపడటం లేదని ఆయా దేశాలు లోలోన అసంతప్తి వ్యక్తం చేస్తున్నాయి.

భిన్నంగా భారత్….

భారత్ ఇందుకు బిన్నంగా పూర్తి సేవాభావంతో, స్నేహభావంతో, కొన్ని దేశాలకు ఉచితంగా, మరికొన్ని దేశాలకు సరసమైన ధరలకు సరఫరా చేస్తూ ఆయా దేశాల మన్ననలు అందుకుంటోంది. దేశంలో తయారైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఇరుగు పొరుగు దేశాలకు అందించేందుకు ముందుకు వచ్చింది. తన పొరుగు దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులకు ఉచితంగా 32 లక్షల టీకాలను సరఫరా చేసి పెద్ద మనసు చాటుకుంది. హిందూ మహాసముద్ర ద్వీప దేశమైన మాల్దీవులకు లక్షడోసులు, భూటాన్ కు లక్షన్నర డోసులు, బ్రిజిల్ కు రెండు మిలియన్ల డోసులు అందించింది. తమకు సరఫరా చేసిన వ్యాక్సిన్ పట్ల బ్రెజిల్ అధినేత బోల్సోనారో హర్షం వ్యక్తం చేశారు. దానిని సంజీవనిగా అభివర్ణించారు. హిమాలయ పర్వత రాజ్యమైన నేపాల్ కు మిలియన్ డోసులను పంపింది. ఆ దేశ విదేశాగ మంత్రి ప్రదీప్ గ్యవాలి ఇటీవల భారత్ కు వచ్చి టీకాపై చర్చలు జరిపారు. వీటితోపాటు సీషెల్స్, అఫ్గానిస్ధాన్, మారిషస్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు సరఫరా చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది.

అంతర్జాతీయంగా ప్రశంసలు….

అంతేకాక ఒమన్, నికారాగ్వా, పసిఫిక్ ద్వీప దేశాలకు టీకాను పంపేందుకు సిద్ధంగా ఉంది. హిందూ మహాసముద్రంలోని మరో ద్వీప దేశమైన శ్రీలంకకు అయిదు లక్షల డోసులను సరఫరా చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈదేశానికి తమ టీకాను చైనా ఇచ్చేందుకు ముందుకు రాగా ఆ దేశం తిరస్కరించింది. టీకా సమర్థతపై సందేహాలు, ధర తదితర అంశాలే ఇందుకు కారణం. భారత్ లో తయారైన టీకా సమర్థతపై సంపూర్ణ విశ్వాసం, కనీస ధర, కొన్ని దేశాలకు ఉచితంగా సరఫరా చేసేందుకు ముందుకు రావడం వల్ల అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట పెరిగింది. గతంలోనూ భారత్ ఇలానే ఉదారంగా వ్యవహరించింది. 150 దేశాలకు హైడ్రాక్సీ,క్లోరోక్విన్, రెమిడెసివిల్ పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్), టెస్ట్ కిట్లు పంపి అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంది. జనరిక్ మందులను ఆఫ్రికా దేశాలకు చవగ్గా పంపింది. టీకా పంపిణీలో భారత్ ఉదారతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ , ఐరాస అభినందించడం విశేషం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News