నాడు జగన్ నేడు....మీరు....!

Update: 2018-10-13 15:30 GMT

మన నాయకులు పాజిటివ్, నెగిటివ్ అన్న తేడా లేకుండా ఏ అంశాన్ని అయినా తమకు అనుకూలంగా మలచుకోగలరు. ఏపీ, తెలంగాణల్లో ఎన్నికల సంగతేమో కానీ ముందస్తు రాజకీయాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అధికారంలో ఉన్నపార్టీలు ప్రత్యర్థి పార్టీలపై చేస్తున్న ప్రయోగాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని హరిస్తున్నాయి. కర్ర ఉన్నవాడిదే బర్రె తంతుగా సాగుతున్న ప్రక్రియలో చట్టం అపహాస్యం పాలవుతోంది. అధికారంలో ఉన్నామని విర్రవీగుతున్న నేతలు రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడుతున్నారు. చెడు సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు. భవిష్యత్తులో సైతం ఈ కక్ష సాధింపు ధోరణి సంప్రదాయంగా మారే ప్రమాదం ఉంది. ఓడలు బళ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి. అధికార చక్రం అటు ఇటు మారవచ్చు. అప్పుడు ఇప్పుడు బాధిత పక్షం గద్దెనెక్కవచ్చు. తమను వేధించిన పార్టీపై కక్ష గట్టి బదులు తీర్చుకోవచ్చు. రాజకీయాల్లో ఈ నూతన ధోరణి శాశ్వతమైన శత్రువులను తయారు చేస్తోంది. గతంలో కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారు ఇకపై వైరి నేతలుగా రూపుదాల్చేందుకు అవకాశం ఏర్పడుతోంది.

మానసిక కట్టడి....

ప్రజల్లో ఆదరణ ఉండి ఎన్నికల్లో గెలుపు సాధిస్తారని భావించే ప్రత్యర్థి నాయకులపై ఏదో రకంగా బురద చల్లడం పాత ఆనవాయితీనే. స్వాతంత్ర్యం సాధించిన తొలినాళ్ల నుంచి ఇది అలవాటుగా వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో స్వాతంత్ర్యం వచ్చిన తొలిదశాబ్దంలో కమ్యూనిస్టులు ప్రబలమైన శక్తిగా ఉండేవారు. వారిపై సంప్రదాయ వ్యతిరేకులు అనే ముద్ర వేసి ఓటర్లకు దూరం చేసే ఎత్తుగడలు సాగాయి. కాంగ్రెసు పార్టీ ఈవిషయంలో ఆరితేరిపోయింది. ఉద్యమాల్లో పాల్గొన్న కమ్యూనిస్టు యోధులపై చట్టాన్ని ప్రయోగించి వేధించేవారు. మానసికంగా ఓటర్లను కట్టడి చేసే యత్నాలు ప్రబలంగా సాగేవి. గడచిన రెండు దశాబ్దాల్లో ఈ ధోరణి మారింది. కేంద్రప్రభుత్వ సంస్థలను ఉసిగొలపడం ద్వారా ప్రత్యర్థులను, పార్టీలోని అసమ్మతి వాదులను అణచివేస్తున్నారు. ముఖ్యంగా 2012 తర్వాత ఈ ధోరణి బాగా పెరిగింది. వైఎస్ జగన్ ప్రజల్లో ఆదరణ పొందుతున్న దశలో అతనిపై కేంద్రప్రభుత్వ సంస్థలను ఉసిగొలిపారనే విమర్శలు సత్యదూరం కాదు. అందుకు కాంగ్రెసు నాయకులే న్యాయస్థానాల్లో కేసులు వేయించి ఆర్డర్లు తెప్పించి అతనిని చక్రబంధంలో ఇరికించేశారు. అతను చేసిన ఆర్థిక అక్రమాలపై న్యాయస్థానంలో ఎటువంటి తీర్పు వెలువడుతుందనే అంశాన్ని పక్కనపెడితే ముందుగానే సైకలాజికల్ గా ప్రజల్లో పలచన అయిపోయేలాంటి వ్యూహాన్ని అమలు చేశారు.

ఆర్థిక నియంత్రణ...

ప్రత్యర్థి పార్టీలపై కేంద్రప్రభుత్వం సాధారణంగా ప్రయోగిస్తున్న అస్త్రం ఆదాయపన్ను శాఖ. దీనికి పెద్దగా ఆధారాలు ఏమీ అవసరం లేదు. అనుమానాస్పదంగా కనిపించిన పన్ను చెల్లింపు దారుల అకౌంట్లను తనిఖీ చేసే అధికారం ఆదాయ పన్ను శాఖకు ఉంటుంది. ఐటీ రెయిడ్స్ జరిగిన ప్రతి ఒక్కరూ అక్రమార్కులని చెప్పలేం. తనిఖీ చేసే అధికారం ఉంది కాబట్టి చెక్ చేసుకుని వెళుతుంటారు. ఒకవేళ ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే కారణాలు తెలుసుకుంటారు. నోటీసులు ఇస్తారు. వ్యత్యాసాలకు కారణాలను చూపాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో జరిమానాలు చెల్లిస్తుంటారు. ఇదంతా పెద్దగా హడావిడి లేకుండానే సాధారణంగా సాగిపోతుంటుంది. అదే రాజకీయ నాయకుల విషయానికొచ్చేసరికి రచ్చగా మారిపోతోంది. తమపై వచ్చిన ఆరోపణలనుంచి తప్పించుకోవడానికి రాజకీయ కక్షసాధింపు అనే ముసుగు వేసుకుంటున్నారు. దానిని రక్షణ కవచంగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక నియంత్రణకు కేంద్రం ఆదాయపన్ను శాఖను ఉసిగొలుపుతున్నట్లుగా విమర్శలు ఎదురవుతున్నాయి. ఐటీ శాఖ చేసిన రెయిడ్స్ లో తర్వాత ఏం జరుగుతోందన్నది ఎవరికీ తెలియదు. కానీ నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉన్న నేతలు ఇబ్బందుల్లో పడుతున్నారు. వారి పై బ్యాంకులు కరుణ చూపడం మానేస్తాయి. పరపతి దెబ్బతింటుంది. కొత్తగా అప్పులు పుట్టవు. తమ పార్టీకి అవసరమైన నిధులను సమీకరించడం కష్టమైపోతుంది. నిధుల ప్రవాహం తగ్గిపోతుంది. భయం కొద్దీ బ్లాక్ మనీని బయటకు తీయడానికే జంకుతారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఆర్థిక నియంత్రణసాధనంగా కేంద్రసంస్థలను వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి.

దారితప్పిన లక్ష్యం...

వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారు ఎంతనిజాయతీగా ఉన్నప్పటికీ చిన్నపాటి తేడాలు సహజం. అందులోనూ పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేస్తున్నవారు అనేక రకాల కాతాలను మెయింటెయిన్ చేస్తుంటారు. వీటిలో లోపాలను పట్టుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. అత్యంతసులభంగానే ఇబ్బంది పెట్టవచ్చు. దీనిని అధికారంలోని పార్టీలు చక్కగా వినియోగించుకుంటున్నాయి. ప్రత్యర్థుల డబ్బులు విచ్చలవిడిగా ప్రవహించకుండా నియంత్రిస్తున్నారు . అదే సమయంలో తమ పార్టీకి చెందిన వారి విషయంలో స్వేచ్చగా వదిలేస్తున్నారు. పార్టీలు ఏవైనప్పటికీ ప్రత్యర్థులు లక్ష్యంగా ప్రభుత్వ శాఖలు పనిచేయడమనేది విమర్శలకు, ఆరోపణలకు తావిస్తోంది. తమ కంపెనీల్లోని అక్రమాలను కప్పిపుచ్చుతూ రాజకీయం ముసుగు వేసేసుకుంటున్నారు. నియంత్రించేందుకు ఒకరు ఎత్తు వేస్తుంటే దానిని ఆసరాగా చేసుకుంటూ బాధిత పాత్రతో ప్రజల్లో లబ్ధి పొందాలని మరొకరు చూస్తున్నారు. పరస్పర లబ్ధి ఎత్తుగడ పక్కాగా పనిచేస్తోంది. ఇరువర్గాలు ఎంతోకొంత ప్రయోజనం పొందుతున్నాయనే చెప్పాలి. తాజాగా టీడీపీ నేతల కు చెందిన ఆస్తులపై ఐటీ దాడులను కేంద్రప్రభుత్వ కక్షసాధింపుగా చూపాలని శతథాప్రయత్నిస్తోంది తెలుగుదేశం. అధికారంలో ఉన్న తెలుగుదేశం విచ్చలవిడిగా నిధులను ఎన్నికల రంగంలోకి దించకుండా కంట్రోల్ చేసేందుకు ఐటీ రెయిడ్స్ ఒక హెచ్చరికగా పనిచేస్తాయనుకొంటోంది బీజేపీ. కేంద్రం, బీజేపీ బూచిని చూపించి సానుభూతిని ఓట్లరూపంలో మలచుకోవచ్చని టీడీపీ భావిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News