ఐటీ రైడ్స్ తో సైకిల్ పార్టీ?

ఏపీలో ఐటి రైడ్స్ తెలుగుదేశం వర్గాలకు దడపుట్టిస్తున్నాయి. సరిగ్గా గత ఎన్నికల ముందు ఇలాగే ఆదాయపు పన్ను శాఖ, ఈడీ ల దాడి, వంటివి, ఏదో రకంగా [more]

Update: 2020-02-10 08:00 GMT

ఏపీలో ఐటి రైడ్స్ తెలుగుదేశం వర్గాలకు దడపుట్టిస్తున్నాయి. సరిగ్గా గత ఎన్నికల ముందు ఇలాగే ఆదాయపు పన్ను శాఖ, ఈడీ ల దాడి, వంటివి, ఏదో రకంగా సిబిఐ ఎంటర్ అవ్వబోతుందంటూ ఆ దర్యాప్తు విభాగానికి నో చెప్పడం వంటివి చకచకా జరిగిపోయాయి. కట్ చేస్తే ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు టిడిపి కి తేడా కొట్టాయి. రాష్ట్రంలో వైసిపి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేశాయి. అంతే పసుపు కోట లో కలవరం మొదలైంది. మరీ ముఖ్యంగా రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుంటూ పోయే వర్గాలు డీలా పడ్డాయి. దాంతో కిం కర్తవ్యం అంటూ సైకిల్ అధినేత ముందే ఆ వర్గాలు వాపోయాయి.

దారి చూపించారు….

మనవాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఏమైంది అన్న సూత్రాన్ని రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు అమల్లో పెట్టారు. ప్రస్తుతానికి కేంద్రంలో అధికారంలో వున్న చోట షెల్టర్ తీసుకుంటే సమస్య ఉండదు అన్న భరోసా ఇవ్వడంతో కొందరు రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్లమెంటరీ పార్టీని విలీనం చేసినట్లు ప్రకటించి జగన్ సర్కార్ వేధింపుల నుంచి తెలివిగా తప్పించుకున్నారు. అయితే ఇలా వచ్చిన వారి వల్ల కమలనాథులకు లాభం లేకపోగా పార్టీలో లేనిపోని సమస్యలు వస్తున్నట్లు అధిష్టానం ఇటీవల గుర్తించింది. కొత్తగా వచ్చిన వారు తెచ్చే ఇబ్బందులు పార్టీలో సీనియర్లకు తలనొప్పులు తెస్తున్నాయని భావించి మరో కొత్త వ్యూహానికి కాషాయ దళం తెరతీసింది.

అదే రూట్ లో పోక తప్పదా …

తాజాగా ఎపి లో జరుగుతున్న ఐటి రైడ్స్ అర్ధాన్ని రాజకీయ విశ్లేషకులు పలు రకాలుగా చర్చిస్తున్నారు. టిడిపి లో ఆర్ధిక పరిపుష్టి వున్నవారంతా బిజెపిని శరణు జొచ్చకపోతే తగిన శాస్తి తప్పదన్న సంకేతాలు స్పష్టంగానే ఇప్పుడు వెళుతున్నాయి. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ వ్యవహారంపై ఇప్పటికే సిఐడి దర్యాప్తు మొదలు పెట్టింది. వారు నేరుగా అనుమానితుల జాబితాను ఆదాయపు పన్ను శాఖకు పంపుతుండటం తో మరికొందరు జాతకాలు, జుట్టు కూడా కమలం చేతికి గట్టిగా చిక్కనున్నాయి. ఈ నేపథ్యంలో టిడిపి లోనే ఉంటే ఇప్పటికే పోయిన డబ్బుతో బాటు రాబోయే కేసులు ఆ సందర్భంగా అయ్యే ఖర్చు తో తిరుక్షవరం గ్యారంటీ అనే భయం కొందరు పొలిటికల్ వ్యాపారుల్లో మొదలైందంటున్నారు. త్వరలోనే వీరంతా జై బిజెపి అని చంద్రబాబు గతంలో సుజనా వంటి వారికి చూపిన దారినే ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News