తిరుపతి దెబ్బకు గోవిందా అంటారా ?

ఏపీలో రాజకీయ గొణుగుడు, సణుగుడుకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడుతుందా అంటే సమాధానం లేదు. కానీ దానికి ఎలా చెక్ చెప్ప్పాలో మాత్రం ప్రభుత్వాధినేత జగన్ కి [more]

Update: 2021-02-05 13:30 GMT

ఏపీలో రాజకీయ గొణుగుడు, సణుగుడుకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడుతుందా అంటే సమాధానం లేదు. కానీ దానికి ఎలా చెక్ చెప్ప్పాలో మాత్రం ప్రభుత్వాధినేత జగన్ కి బాగా తెలుసు అంటున్నారు. ఏపీలో రాజకీయ రచ్చ వెనక అసలైన కారణం అధికార దాహం అన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ కి ఆయాచితంగా అధికారం 2019 ఎన్నికల్లో దక్కిందని, జగన్ ది గాలివాటం గెలుపు అని మొత్తానికి మొత్తం విపక్షానికి ఒక భ్రాంతి ఉంది. అది నిజమో కాదో నిరూపించేలా తిరుపతి లోక్ సభ ఉప‌ ఎన్నికలు తేల్చనున్నాయి.

ధీమాగా బరిలోకి….

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఎపుడు జరిగినా వైసీపీ గెలుస్తుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే మొత్తం ఏడింట మూడు అసెంబ్లీ సీట్లు ఎస్సీల పాపులేషన్ అధికంగా కలిగినవి. ఇక్కడ ఎపుడూ వైసీపీదే పై చేయి. మిగిలిన చోట్ల కూడా అధికార పార్టీకి ఎంతైనా అనుకూలత ఉంటుంది. ఇక బీజేపీ, టీడీపీ ట్రాక్ రికార్డు చూసినా వారికి గెలిచేటంత సీన్ లేదు. దాంతో జగన్ తిరుపతి ఉప ఎన్నికల మీదనే పూర్తి దృష్టి పెట్టి ఉంచారని అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ‌విగ్రహాల విద్వంసం ఘటనకు కానీ ఇతర అనేక విషయాలు కానీ మొత్తం అన్నింటికీ ఒకే ఒక్క జవాబు తిరుపతి ఎన్నికల ఫలితం మాత్రమే ఇస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు.

చప్పబడిపోతాయా…?

తిరుపతి ఉప ఎన్నికలు ఈ ఏడాది మార్చి రెండవ వారంలోగా జరగాలి. దాంతో నోటిఫికేషన్ వచ్చాక టీడీపీ దూకుడు మరింతగా పెంచుతుందని, ఏపీలో మత రాజకీయాలు మరింతగా ముదిరి పాకాన పడతాయని కూడా అధికార పార్టీలో ఒక మేరకు అంచనాలు ఉన్నాయి. అయితే ఏపీలో ఇలాంటివి ఎన్ని జరిగినా జనాలు మాత్రం మత రాజకీయాల వైపు అసలు మొగ్గు చూపరని అంటున్నారు. ఆ నిజాన్ని తిరుపతి ఉప ఎన్నిక రుజువు చేస్తుందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ విజయం ఖాయమని కూడా వారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఆ మీదట ఏపీలో బీజేపీ కానీ టీడీపీ కానీ ఒక్కసారిగా చప్పబడిపోతాయని కూడా జోస్యం చెబుతున్నారు.

అసలైన సినిమా…..

ఇక ఏపీలో అసలైన సినిమా కూడా తిరుపతి ఉప ఎన్నికల తరువాతనే ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు 2019 తరువాత మరో ఓటమి కూడా తిరుపతి రూపంలో వస్తే అది ఆ పార్టీకి అశనిపాతమే అని అంటున్నారు. పార్టీ ఓడిన రెండేళ్ల తరువాత కూడా ఇంకా అలాగే పరిస్థితి ఉంటే కనుక సైకిల్ దిగిపోయే వారి జాబితా ఒక్కసారిగా పెరుగుతుందని ఊహిస్తున్నారు. అపుడు అనువుగా ఉన్న వైసీపీలో కానీ బీజేపీ లో కానీ చేరేందుకు నేతలు క్యూ కడతారని అంటున్నారు. ఏపీలో టీడీపీ అలా బలహీనపడే పరిస్థితే వస్తే జగన్ ఈసారి ఏ మాత్రం ఉపేక్షించరని వచ్చిన వారిని వచ్చినట్లే పార్టీలో చేర్చుకుంటారని కూడా చెబుతున్నారు. మొత్తానికి మరో రెండున్నర నెలల తరువాత సైకిల్ పార్టీ తిరుపతి సాక్షిగా గోవిందా అనుకోవడమే మిగిలేది అన్న మాట వైసీపీలో వినవస్తోంది. మరి ఇది వైసీపీ అతి విశ్వాసమా ఆత్మ విశ్వాసమా అన్నది తేలాలంటే మార్చి వరకూ వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News