దీన్ని చూసైనా నేర్చకోండర్రా… అప్పుడైనా బాగుపడతారు

డబ్బులు ఉన్నా ఏం లాభం..? అన్నింట్లో మేమే ముందున్నామన్నా ఎవరికోసం? అత్యాధునిక వ్యవస్థ ఉందని డప్పాలు కొట్టుకున్నా ఎవరికి ప్రయోజనం? అవును అమెరికాను చూస్తుంటే ఈ ప్రశ్నలన్నీ [more]

Update: 2020-04-06 18:29 GMT

డబ్బులు ఉన్నా ఏం లాభం..? అన్నింట్లో మేమే ముందున్నామన్నా ఎవరికోసం? అత్యాధునిక వ్యవస్థ ఉందని డప్పాలు కొట్టుకున్నా ఎవరికి ప్రయోజనం? అవును అమెరికాను చూస్తుంటే ఈ ప్రశ్నలన్నీ దానికే వేయాలని అనిపించక మానదు. కానీ ఈ ప్రశ్నలకు అమెరికా వద్ద సమాధానం లేదు. అయితే ఇవే ప్రశ్నలకు కొన్ని చిన్న దేశాలు ఠక్కున సమాధానం చెబుతున్నాయి. తాము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నదీ, అది తమను ఎలా కాపాడుతుందీ ఇట్టే చెప్పేస్తున్నాయి. ఈ చిన్న దేశాలే అగ్రరాజ్యం అమెరికాతో పాటు మరిన్ని సంపన్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

అమెరికా వంటి దేశం…..

కరోనా వైరస్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. ఇప్పటికే అమెరికాలో రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరు వేల మందికి పైగా చనిపోయారు. న్యూయార్క్ నగరంలో అయితే ప్రతి ఏడు నిమిషాలకు ఒకరు కరోనా వ్యాధితో ఆసుపత్రిలో చేరుతున్నారు. రెండు లక్షల మందికి పైగా చనిపోతారని అంచనాలో ఉన్నామని సాక్షాత్తూ వైట్ హౌస్ ప్రకటించింది. అయినా ఇప్పటి వరకూ దేశీయ విమానసర్వీసులను ట్రంప్ రద్దు చేయలేదు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడం లేదు. ఆంక్షలు మాత్రం ఏప్రిల్ 30 వ తేదీ వరకూ కొనసాగుతాయని ప్రకటించారు.

క్యూబాలో మాత్రం…..

ఇక ఇటలీ, స్పెయిన్, జర్మనీ దేశాల్లోనూ కరోనా విలయ తాండవం చేస్తుంది. లక్షల సంఖ్యలో ఈ రోగాన బారిన పడుతున్నారు. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. అలాంటి తరుణంలో చిన్నదేశమైన క్యూబా అందరికీ ఆదర్శంగా నిలిచింది. క్యూబా దేశంలో కరోనా ఫుల్ కంట్రోల్ లో ఉంది. క్యూబాలో ఇప్పటి వరకూ 65 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒకరు మాత్రమే మరణించారు. దీనికి క్యూబా తీసుకున్న ముందస్తు చర్యలే కారణమని చెప్పక తప్పదు.

ఇతర దేశాలకు సాయం చేస్తూ…..

ఇప్పుడు ఈ చిన్న దేశం వైపు అందరూ చూస్తున్నారు. క్యూబా అన్ని దేశాలకు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. తనను శత్రువుగా చూస్తున్న అమెరికాకు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చింది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు తమను ఆంక్షలతో తొక్కిపెట్టినా క్యూబా సాయం అందించేందుకు వెనకడుగు వేయడం లేదు. చైనా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలకు తమ వైద్య బృందాలను పంపింది. తమ దేశంలో వినియోగించిన ఇటర్ ఫెరాన్ అనే మందును వూహాన్ లోనూ క్యూబా వాడింది. దీనికి 2012లోనే నేషనల్ టెక్నాలజీ ఇన్నొవేషన్ అవార్డు దక్కింది. ఇప్పుడు దాదాపు 30 దేశాలు తమకు ఈ మందు కావాలని కోరుతున్నాయి. ఇక మాస్క్ లు, వైద్య పరికరాలను అమెరికాకు పంపేందుకు క్యూబా సిద్ధమయింది. గతంలో ఇలాంటి ఉపద్రవం ముంచుకు రావడంతో పెద్దయెత్తున వైద్యులను, వైద్య సిబ్బందిని క్యూబా ఏర్పాటు చేసుకుంది. ఈ దేశంలో ప్రతి వందమందికి ఎనిమిది మంది వైద్యులుంటారు. అందువల్లనే తమ దేశానికి చెందిన వైద్యులను ఇతర దేశాలకు పంపుతోంది. మొత్తం మీద క్యూబా నుంచి అన్ని దేశాలూ ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News