బీజేపీ కలసి వస్తుందటగా.. అదే నమ్మకం

తెలుగుదేశం ఆశలు మాత్రం ఎంతకీ తగ్గడంలేదు. ప్రతీ మీడియా మీటింగులో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు టీడీపీతో పొత్తు లేదంటూ గట్టిగా చెబుతున్నా కూడా తమ్ముళ్ళ [more]

Update: 2020-09-15 13:30 GMT

తెలుగుదేశం ఆశలు మాత్రం ఎంతకీ తగ్గడంలేదు. ప్రతీ మీడియా మీటింగులో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు టీడీపీతో పొత్తు లేదంటూ గట్టిగా చెబుతున్నా కూడా తమ్ముళ్ళ ఆలోచనలు మాత్రం దాని చుట్టే తిరుగుతున్నాయి. అమిత్ షాకు చంద్రబాబు మర్యాదపూర్వకంగా ఫోన్ కాల్ చేస్తే ఇక ఏముంది బీజేపీ టీడీపీ ఒకటి అన్నట్లుగా అనుకూల మీడియా వీరంగం వేసింది. ఇపుడు కూడా బీజేపీ ఎక్కడికీ పోదు ఎన్నికల వేళకు మాతోనే ఉంటుంది అని పసుపు తమ్ముళ్ళు ధీమాగా చెబుతున్నారు అంటే దాని అర్ధం బీజేపీ బలహీనతలను టీడీపీ పట్టేసిందా. చంద్రబాబు తప్ప బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో వేరే దిక్కు లేదా. సొంతంగా ఎదిగే చాన్స్ అసలే లేదా. ఇవన్నీ ప్రశ్నలే.

కలవకతప్పదా…?

ఎన్నికలకు నాలుగేళ్ళ కాలముందని చెప్పుకున్నా ఇట్టే గడచిపోతాయి. చూస్తే బీజేపీ బలపడడమే కష్టం అన్నట్లుగా టీడీపీ అంచనాలు ఉన్నాయట. నాలుగు దశాబ్దాలుగా ఏపీలో పాతుకుపోయిన పార్టీ తమదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తాము ఉన్నామని టీడీపీ గట్టిగా చెబుతోంది. ఇక బీజేపీ, జనసేన ఎంత కూటమి అని చెప్పుకున్నా విడిగా పోటీ చేస్తే వైసీపీకే లాభమని టీడీపీ వ్యూహకర్తలు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి కనుక వైసీపీని మరోసారి గెలిపించాలి అనుకుంటే తమతో పొత్తు పెట్టుకోదని, లేకపోతే కచ్చితంగా కలిసి తీరుతుందని కూడా చెబుతున్నారు.

అక్కడ ఆశలు ….

ఇక బీజేపీకి తెలంగాణాలో పెద్దాశలు ఉన్నాయన్న ఆ పార్టీ బలహీనతను తెలుగుదేశం నేతలు పట్టుకుంటున్నారు. ఏపీలో బీజేపీ ఎంతో షో చేసినా కూడా రెండు డిజిట్ల సీట్లు కష్టమని కూడా తేల్చేస్తున్నారు. అందువల్ల బీజేపీకి బలమున్న తెలంగాణాపైనే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ద్రుష్టి పెడుతుందని, అలాంటపుడు తెలంగాణాలో లీడర్లు పోయినా క్యాడర్ బాగా ఉన్న టీడీపీ అవసరం బీజేపీకి తప్పనిసరిగా ఉంటుందని అంటున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కలిస్తే తెలంగాణాలో బీజేపీకి అధికారం ఖాయమని, అలాగే ఏపీలో టీడీపీకి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఉభయకుశలోపరిగా…..

బీజేపీ రంగు కాషాయం అయినా రాజకీయాల్లో ఆ పార్టీ కాషాయం కట్టలేదుగా అని తమ్ముళ్ళు చమత్కరిస్తున్నారు. బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట అధికారం, మరో చోట అవకాశం ఉంటే ఎందుకు వదులుకుంటుంది అన్నది లాజిక్ తో కూడిన ప్రశ్నే. ఇక వైసీపీకి తెలంగాణా మీద ఏ ర‌కమైన ఆశలు లేవు, బీజేపీతో పొత్తు కూడా ఎక్కడా లేదు, కేవలం జగన్ ఎంపీలను నమ్ముకుని ఏపీలో మద్దతు ఇస్తే రెండు చోట్లా బీజేపీ నష్టపోవడం తప్ప మిగిలేది లేదని కూడా పసుపు పార్టీలో హాట్ హాట్ చర్చగా ఉందిట. అందువల్ల సోము వీర్రాజు ఎన్ని కబుర్లు చెప్పినా సరైన సమయంలో కేంద్ర నాయకత్వం టీడీపీ తో పొత్తుకు దిగి వస్తుందని, ఆ లెక్కన 2024 ఎన్నికల్లో మూడు పార్టీల పోటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాయమని కూడా ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆశాభావంతో ఉన్నారట. అందుకే వారు అక్కడ బీజేపీ ఇక్కడ టీడీపీ అని ఇప్పటి నుంచే కొత్త పాట మొదలెట్టేశారట. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News