ఈ ఇద్దరూ కలిస్తే వన్ సైడ్ విక్టరీయేనా?

బీహార్ లో ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేవు. లోక్ సభ ఎన్నికలు కూడా 2023లో ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నాటికి బీహార్ పొలిటికల్ సీన్ మారే అవకాశాలు [more]

Update: 2021-09-15 16:30 GMT

బీహార్ లో ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేవు. లోక్ సభ ఎన్నికలు కూడా 2023లో ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నాటికి బీహార్ పొలిటికల్ సీన్ మారే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రాష్ట్రీయ జనతా దళ్ కు తృటిలో విజయావకాశాలు తప్పాయి. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా బీజేపీ, జేడీయూ కూటమి గెలిచింది. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీకి బీహార్ లో ఇబ్బందులు తప్పవంటున్నారు.

తృటిలో తప్పిన…

మొన్న జరిగిన బీహార్ ఎన్నికలలో రాష్ట్రీయ జనతాదళ్ అధికారంలోకి రావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ కారణంగా కొన్ని సీట్లు, ఎంఐఎం కారణంగా మరికొన్ని చోట్ల ఓటమి పాలయి ఆర్జేడీ కూటమి అధికారానికి దూరమయింది. అయితే లోక్ సభ ఎన్నికల్లోనే దెబ్బకొట్టాలని ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ భావిస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణను కూడా రూపొందించారు. ఇప్పటికే బీహార్ లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ సర్కార్ పై ప్రజల్లో భ్రమలు తొలగి పోయాయి.

పాశ్వాన్ మరణం తర్వాత….

ఈ నేపథ్యంలో లోక్ జనశక్తి పార్టీని కూడా కలుపుకుని పోవాలని తేజస్వి యాదవ్ నిర్ణయించారు. లోక్ జనశక్తి రాం విలాస్ పాశ్వాన్ ఉన్నంతవరకూ బీజేపీ దానిని ఆదరించింది. పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ను పక్కన పెట్టింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోసమే పక్కన పెట్టినా ఇది తేజస్వియాదవ్ కు అనుకూలంగా మారనుంది. తమ పార్టీని చీల్చడమే కాకుండా తన పార్టీకి పార్లమెంటులో గుర్తింపులేకుండా చేశారని చిరాగ్ పాశ్వాన్ మండి పోతున్నారు.

కలసి దిగితే…?

దీంతో బీహార్ లో వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి తేజస్వియాదవ్, చిరాగ్ పాశ్వాన్ లు కలసి నడిచే అవకాశాలున్నాయి. ఆర్జేడీ, లోక్ జనశక్తి పార్టీల మధ్య పొత్తు అవసరం ఉందని ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. దీనికి బలం చేకూర్చడానికి ఇటీవల తేజస్వి యాదవ్, చిరాగ్ పాశ్వాన్ లు సమావేశమయ్యారు. రానున్న కాలంలో వీరిద్దరూ ఏకమైతే బీహార్ రాజకీయాలను శాసించే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News