పుణ్య పురుషులను వేరు చేయగలరా ?

వెనకటికి ఓ పద్యం ఉంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని. ఇపుడు ఆ పుణ్య పురుషులు అంతా జన జీవన స్రవంతిలో కలసిపోయారు. మరి వారిని [more]

Update: 2020-03-26 09:30 GMT

వెనకటికి ఓ పద్యం ఉంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని. ఇపుడు ఆ పుణ్య పురుషులు అంతా జన జీవన స్రవంతిలో కలసిపోయారు. మరి వారిని వేరు చేసి బయట వేస్తేనే తప్ప కరోనా రక్కసి దూకుడుని ఎవరూ ఆపలేరు. అసలు నిజానికి మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదట్లోనే పెద్ద తప్పు చేశాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని కట్టుదిట్టంగా పరీక్షలు చేసి 14 రోజుల పాటు క్వారంటైన్స్ లో కఠినంగా పడేయకుండా చూసీ చూడనట్లుగా ఊరుకున్నారు. వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసేసుకుని ఎంచక్కా బ్యాగులతో సహా ఇంటికి పంపించారు. ఇపుడు వారే కరోనా కారియర్స్ గా మారడంతో అనుమానిత కేసులు ఒక్కసారి పెరుగుతున్నాయి.

నిఘా ఏదీ…?

ఎంత చెప్పుకున్నా మన తనిఖీలన్నీ తూతూ మంత్రాలే. అందుకే రాత్రికి రాత్రి విశాఖ లాంటి పెద్ద సిటీల్లోని పలు కాలనీలలో కొత్త ముఖాలు వందల సంఖ్యలో వచ్చేశాయి. అంటే వారంతా నిన్నటి వరకూ విదేశాల్లో ఉన్న వారు. అమ్మకు, నాన్నకు ఏ ఇబ్బంది వచ్చినా డబ్బులు పంపించడం తప్ప తమకు తాముగా రావడానికి వీలుపడని వారు. ఇపుడు కరోనా దెబ్బకు ఇల్లూ వాకిలీ గుర్తుకొచ్చి పెట్టే బేడా సర్దేశారు. అలాంటి వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఇండియాలో సైతం 14 రోజుల నిర్బంధం చేయాలన్న ధ్యాసా సోయి పాలకులకు లేకపోయింది. ఫలితంగా వేలల్లో వచ్చిన విదేశీ మూకలతో కోట్లలో ఉన్న ప్రజలు అవస్థలు పడుతున్నారు.

సమగ్ర సర్వేఅట……

ఇపుడు ఏపీ సీఎం జగన్ తాపీగా మరో మారు సమగ్ర సర్వే అంటున్నారు. ఇంటింటికీ వెళ్ళి మీ ఇంట్లో కొత్త వారు వచ్చారా, విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నార అని వాలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తారట. ప్రభుత్వం వరకూ ఇది పక్కాగా చేయిస్తుంది అనుకున్నా కూడా వాలంటీర్లకు అన్నీ నిజాలే చెబుతార. ఎవరూ రాలేదని మొక్కుబడి అబద్దాలు ఆడేసి తలుపులేసుకుంటారు. కొంతమంది అయితే అసలు తలుపులే తీయరు. ఇక వాలంటీర్లు కూడా ఉన్న దాంట్లో అన్నీ చక్కగా చేసేశామని, ఇక్కడ ఎవరూ లేరు అని నివేదికలు తయారు చేసి ఇస్తారు. అపుడు సంగతేంటి.

నిర్లక్షానికి ఫలితం…?

అందరూ పెద్ద వాళ్ళే. అందరూ మంత్రులను మించిన వారే. ప్రభుత్వాలను శాసించిన వారే. అందుకే మన దేశంలో లాక్ డౌన్ కి కూడా బ్రేక్ డౌన్ అంటున్నారు. ఎన్ని బెదిరింపులు పెట్టినా కూడా నూటికి 25 మంది మాత్రమే ఇళ్ళలో ఉంటున్నట్లుగా తాజా సర్వేలో వెల్లడవుతోంది. ఇలా చట్టాలను చుట్టాలను చేసుకున్న దేశంలో విదేశాల నుంచి దర్జాగా ఇంటికి వచ్చేసి కరోనా రోగాన్ని అంటిస్తున్న వారిని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడేమో. మొదట్లోనే తప్పు చేసి విదేశీ దొరలకు ఎర్ర తివాచీ పరచిన ప్రభుత్వాలు ఇపుడు ఇంట్లో దాక్కున్న వారిని బయటకు తెస్తామంటే నమ్మేదెవరు. ఏలికల నిర్లక్షానికి అందరూ ఫలితం అనుభవించాల్సిందేమో.

Tags:    

Similar News