చెబుతున్నదొకటి… చేస్తున్నది మరోటి…?

ఏపీలో కరోనా ఉందా? ఉంటే ఎంత ఉంది. సెకండ్ వేవ్ అంటున్నారు. అది ఎంత భయంకరంగా ఉంటుంది. అసలు నిజంగా అలాంటి ముప్పు ఏపీకి ఉందా. ఇవన్నీ [more]

Update: 2020-11-08 02:00 GMT

ఏపీలో కరోనా ఉందా? ఉంటే ఎంత ఉంది. సెకండ్ వేవ్ అంటున్నారు. అది ఎంత భయంకరంగా ఉంటుంది. అసలు నిజంగా అలాంటి ముప్పు ఏపీకి ఉందా. ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి కరోనా కంటే దారుణంగా ఏపీలో రాజకీయం సాగుతోంది. కరోనా పేరు చెప్పి మా చెడ్డ రాజకీయమే చేస్తున్నారు. మార్చిలో కరోనా కేసులు ఏపీలో సింగిల్ డిజిట్ లో ఉంటే వామ్మో అన్న తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల వాయిదాను ఆనాడు గట్టిగా సమర్ధించింది. ఇక ఇపుడు రోజుకు మూడు వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ఎన్నికలకు రెడీ అంటోంది పసుపు పార్టీ. ఆనాడు సుద్దులు చెప్పి ఇపుడు ఎన్నికల గోదాలోకి దిగిపోతోంది ఆ పార్టీ.

వద్దు అంటూనే….?

ఇక వైసీపీ విషయానికి వస్తే కరోనా ఇంకా ఉంది అని మంత్రులు వాదిస్తున్నారు. రోజుకు మూడు వేలకు పైగా కేసులు ఉంటే టీడీపీకి ఎన్నికలు కావాల్సివచ్చాయా అంటూ మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు ఇపుడు అవసరం అయ్యాయా అంటూ మార్చిలో టీడీపీ అన్న మాటలనే కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఇక సెకండ్ వేవ్ వస్తుందని ఏపీని భయపెడుతున్నది కూడా ఎవరో వైద్య పరిశోధకులు కాదు, అధికారంలో ఉన్న పెద్దలే. మరి ఇన్ని తెలిసిన వారు పాఠశాలలను ఎలా తెరుస్తారు అంటే మాత్రం జవాబు నిల్.

అవసరమా…?

ఇపుడు ఏపీ నిండా వేలల్లో కరోనా కేసులు, రెండు పదులకు తగ్గకుండా రోజూ మరణాలు నమోదు అవుతున్నాయి. ఇవి కాకుండా టెస్ట్ చేయని కేసులు వేలల్లోనే ఉంటాయి. మరి అన్నీ తెలిసిన వైసీపీ సర్కార్ చిన్న పిల్లలను బడులకు రమ్మనమని స్కూల్స్ ఎలా తెరుస్తారు అని ప్రతిపక్షాలే ప్రశ్నిస్తున్నాయి. 14 లోపు పిల్లలు సూపర్ స్పైడర్లుగా మారితే ఇంట్లో ఉన్న పెద్దలకు కరోనా ముప్పు డైరెక్ట్ గానే సోకుతుంది అని కూడా అంటున్నారు. ఈ విషయంలో తొందరపడవద్దని కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ని కూడా ఎందుకు పక్కన పెడుతున్నారు అని నిలదీస్తున్నారు. ఇది నిజంగా వైసీపీ లోకల్ బాడీ ఎన్నికల విషయంలో చేస్తున్న వాదనకు పూర్తి భిన్నమైనదే. దాన్ని ఎలా సమర్ధించుకోవాలో కూడా వైసీపీ పెద్దలకే తెలియడంలేదుగా.

ఈయన రారుగా …?

ఇక హైదరాబాద్ లోని వందల కోట్లతో నిర్మించిన భవంతి లో చంద్రబాబు ఏపీ ఊసు మరచి గత ఆరేడు నెలలుగా కాపురం ఉంటున్నారు. ఆయన ఏపీలో కరోనా లేదు అనేస్తున్నారు. ఎన్నికలకు పెట్టేయండి అని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరి అంత ధీమా ఉన్న చంద్రబాబు తాను హైదరబాద్ వదిలి కనీసం అమరావతి కరకట్ట వద్ద ఉన్న ఇంటికైనా ఎందుకు రారు అంటే మాత్రం జవాబు లేదుగా. అంటే బాబుకు తెలుసు కరోనా కేసులు ఏపీలో బాగానే ఉన్నాయని. కానీ తన రాజకీయం కోసం ఆయన అలా రివ‌ర్స్ లో వెళ్తున్నారు. ఇక జగన్ గురించి ఇలాగే చెప్పుకోవాలి. స్కూల్స్ తెరవాలన్న పంతం ఆగస్ట్ నుంచి జగన్ కి ఉంది. మూడు నెలలు అలా గడచిపోయాయి. కాబట్టి ఈసారిఎలాగైనా తెరచి తీరాల్సిందేనన్నది ఆయన ఆలోచన. దానికి కరోనా అడ్డు రాదన్నదే ఆయన చెప్పే ఫిలాసఫీ. మరి ఇంతకీ ఏపీలో కరోనా ఉందా. లేదా.

Tags:    

Similar News