అవి తెరుచుకున్నాయి.. వీళ్ల చేతులు ముడుచుకున్నాయ్

కరోనా సమయంలో ఆపన్నులకు సేవలను అందించేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు రాజకీయ నేతలు సయితం బడుగులకు సాయం అందించారు. లాక్ [more]

Update: 2020-05-21 09:30 GMT

కరోనా సమయంలో ఆపన్నులకు సేవలను అందించేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు రాజకీయ నేతలు సయితం బడుగులకు సాయం అందించారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో వారికి అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు శానిటైజర్స్, మాస్క్ లను కూడా దాతలు పంపిణీ చేశారు. ఇక ప్రభుత్వానికి అయితే పారిశ్రామికవేత్తల నుంచి కోట్లాది రూపాయలు విరాళం రూపంలో అందాయి.

మద్యం షాపులు తెరిచిన నాటి నుంచి….

అయితే మద్యం దుకాణాలను తెరచిన నాటి నుంచి సేవా కార్యక్రమాలు దాదాపుగా కన్పించడం లేదనే చెప్పాలి. మద్యం దుకాణాల వద్ద వెల్లువలా వచ్చిన జనాన్ని చూసి దాతలు కూడా మనసు మార్చుకున్నట్టుంది. అందుకే సాయాన్ని నిలిపేశారు. ప్రభుత్వం మాత్రం పేదలకు ఇచ్చే రేషన్, నగదును మాత్రం కంటిన్యూ చేస్తుంది. దాతలు మాత్రం ముందుకు రాకపోవడానికి కారణం మద్యం దుకాణాలు ప్రారంభం కావడమే.

ఎమ్మెల్యేలు సయితం….

కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడి పోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు సయితం తమ నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ప్రతి రోజూ వైసీపీ ఎమ్మెల్యేల హడావిడి కన్పించేది. నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్వహించుకునేవారు. కానీ గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యేల హడావిడి కూడా తగ్గిందనే చెప్పాలి. అన్ని దుకాణాలు ప్రారంభం కావడం, లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవ్వడంతో వీరిలో చాలా మంది సేవా కార్యక్రమాలను నిలిపేశారు.

రాజకీయానికే ప్రాధాన్యత…..

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమయంలో సేవా కార్యక్రమాలకంటే రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ చిన్న సంఘటన జరిగిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అధికార పక్షం కూడా అంతే స్థాయిలో ఎగిరిపడుతోంది. దీంతో సేవా కార్యక్రమాలను ఇప్పుడు ఏపీలో పెద్దగా పట్టించుకునే వారు లేరనే చెప్పాలి. మద్యం దుకాణాలు ప్రారంభం కావడమే సేవా కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి.

Tags:    

Similar News