కోలుకోవడం కష్టమేనా…?

రాజ‌ధాని గుంటూరు జిల్లాలో నిన్న మొన్నటి వ‌రకు కంచుకోట‌గా విస్తరించిన టీడీపీ.. ఒక్క ఓట‌మి దెబ్బతో కుదేలైంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాయ‌కులు తాజా ఎన్నిక‌ల్లో [more]

Update: 2019-07-27 14:30 GMT

రాజ‌ధాని గుంటూరు జిల్లాలో నిన్న మొన్నటి వ‌రకు కంచుకోట‌గా విస్తరించిన టీడీపీ.. ఒక్క ఓట‌మి దెబ్బతో కుదేలైంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాయ‌కులు తాజా ఎన్నిక‌ల్లో ఘోరంగా విఫ‌లం కావ‌డంతో ఇప్పుడు పార్టీ మ‌నుగడ‌కే ముప్పు వాటిల్లింది. ముఖ్యంగా పార్టీకి అన్ని విధాలా అండ‌గా ఉంటార‌ని భావించిన నాయ‌కులు కూడా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్రత్యేకంగా వ్యూహాల‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ముఖ్యంగా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల జంపింగులు ఖ‌రార‌య్యాయి. అదే స‌మ‌యంలో పార్టీని భ్రష్టు ప‌ట్టించిన‌ నాయ‌కుల‌ను చంద్రబాబే స్వయంగా వ‌దిలించుకునేందుకు సిద్ధమ‌య్యారు.

దిక్కులేకుండా పోయిందే….

ఈ నేప‌థ్యంలో గుంటూరు జిల్లాలో టీడీపీ భ‌విత‌వ్యం ఏంట‌నే ప్రశ్న తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది. విష‌యంలోకి వెళ్తే.,. స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం స‌హా న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి దిక్కులేకుండా పోయే ప‌రిస్థితి ఏర్పడింది. స‌త్తెన‌ప‌ల్లి నుంచి 2014లో విజ‌యం సాధించిన మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద‌రావు కుటుంబం ఇప్పుడు పీక‌ల్లోతు కేసుల్లో ఇరుక్కుపోయింది. ఇప్పటికే పోలీసులు కేసులు కూడా న‌మోదు చేశారు. ఈ క్రమంలో ఆయ‌న కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి కోర్టు నుంచి అరెస్టు చేయ‌కుండా వారెంటు తెచ్చుకున్నారు.

వరస కేసులతో….

ఇక‌, కుమారుడి పై కూడా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆయ‌న‌ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తండ్రి శివ‌ప్రసాద‌రావు అధికారాన్ని అడ్డు పెట్టుకుని జిల్లాలో ఈ ఇద్దరు బ‌రితెగించార‌నేది వైసీపీ వాద‌న‌. ఈ క్రమంలోనే చాలా కేసులు న‌మోద‌య్యా యి. దీంతో వీరిని రాజ‌కీయ‌వార‌సులుగా కోడెల ప్రక‌టించాల‌ని చూసినా.. చంద్రబాబు దీనికి స‌సేమిరా అంటున్నారు. పోనీ.. వివాదర‌హితుడు, ఎలాంటి ఆరోప‌ణ‌లు లేని రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రంగారావుకు ఇక్కడ బాధ్య‌త‌లు అప్పగించాల‌ని చూసిన‌ప్పటికీ.. ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న ఊపు ఇప్పుడు ఈ ఫ్యామిలీలో క‌నిపించ‌డం లేదు. పైగా వారు బీజేపీ దారిలో ఉన్నారు.

నరసరావుపేటలోనూ….

దీంతో ఇక్కడ కీల‌కంగా ఉన్న దీంతో స‌త్తెన‌ప‌ల్లిలో టీడీపీకి కొత్త నాయ‌కుడి అవ‌స‌రం అర్జంటుగా ఏర్పడింది. ఇక‌, న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే.. ఇక్కడ నుంచి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబుకు టికెట్ ఇచ్చారు. బీసీ కోటాలో ఆయ‌న్ను బాబు ఇక్కడ పోటీలో దింపారు. ఆయ‌న పోటీ చేసి వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై ఓడిపోయారు. పోనీ.. చంద్రబాబు టికెట్ ఇచ్చార‌న్నది కూడా లేకుండా ఆయ‌న తన వ్యక్తిగ‌త లాభం కోసం పార్టీమారేందుకు, బీజేపీ చెంత‌కు చేరేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ప‌రిస్థితుల్లో మ‌హామ‌హులే వెళ్లిపోతుంటే అర‌వింద‌బాబును త‌ప్పుప‌ట్టలేం. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిని ప‌ట్టుకోవ‌డం బాబుకు పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ తీవ్ర స్థాయిలో న‌ష్టపోనుంద‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. మ‌రి బాబు దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Tags:    

Similar News