అన్నీ ఈయన ఖాతాలోకే..? గెలిచినా.. ఓడినా?

అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తమ మిత్రపక్షాలకు ఆ పార్టీయే సారథ్యం వహిస్తుంది. మహారాష్ట్ర వంటి చోట కూడా జూనియర్ గా ఉండటానికి బీజేపీ ఇష్టపడలేదు. అధికారం దక్కకపోయినా [more]

Update: 2020-10-07 18:29 GMT

అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తమ మిత్రపక్షాలకు ఆ పార్టీయే సారథ్యం వహిస్తుంది. మహారాష్ట్ర వంటి చోట కూడా జూనియర్ గా ఉండటానికి బీజేపీ ఇష్టపడలేదు. అధికారం దక్కకపోయినా శివసేనకు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించలేదు. కానీ బీహార్ రాజకీయాలకు వచ్చే సరికి ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. దేశంలో దూకుడుగా ఉన్న బీజేపీ బీహార్ లో మాత్రం తాము నితీష‌ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళతామని చెబుతుండటం విశేషం.

కూటమిగా దిగుతూ….

బీహార్ లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు కలసి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ, జేడీయూ చెరిసగం సీట్లు పంచుకోవాలన్న ఒప్పందానికి ఇప్పటికే వచ్చాయి. తమకు కేటాయించిన సీట్లలో కొన్నింటిని ఎల్.జె.పి. కి ఇవ్వాలన్నది బీజేపీ ఆలోచన.కానీ లోక్ జనశక్తి పార్టీ దీనికి అంగీకరించడం లేదు. కరోనాతో దేశం పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

నితీష్ ను ముందు పెట్టి…..

ఈ పరిస్థితుల్లో తాము ముందుండే కంటే నితీష్ కుమార్ కు నాయకత్వ బాధ్యతలను అప్పగించడమే మేలన్నది బీజేపీ ఆలోచన. గెలిచినా, ఓడినా అది నితీష్ కుమార్ కే దక్కాలన్న వ్యూహంతో బీజేపీ ఉన్నట్లుంది. బీహార్ లో ప్రస్తుతం ఎన్డీఏకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. సర్వేలు కూడా ఎన్డీఏ వైపునకు మొగ్గు చూపుతున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక తర్వాత కాని ఫలితాలు ఎవరి వైపు ఉంటాయన్నది తేలదు.

బీజేపీ ఆలోచన అదే…..

అందుకే నితీష్ కుమార్ సారథ్యంలోనే బీహార్ ఎన్నికలకు వెళతామని బీజేపీ పదే పదే ప్రకటిస్తుంది. అంతేకాకుండా గత ఐదేళ్లుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పాలన పట్ల ప్రజలు ఎలా వ్యవహరిస్తారన్నది ఈ ఎన్నికలు తేల్చి చెబుతాయి కూడా. మద్యనిషేధం వంటి మంచి కార్యక్రమాలను చేపట్టినా నిరుద్యోగం, కరోనా వైరస్ తో ఉపాధి అవకాశాలు కోల్పోవడం వంటి అంశాలు అధికార పార్టీపై ప్రభావం చూపుతాయి. అందుకే గెలుపోటములన్నీ నితీష్ కుమార్ ఖాతాలోనే వేయడానికి బీజేపీ సిద్ధమయింది.

Tags:    

Similar News