వీరు సహకరిస్తేనే ఎవరైనా గెలిచేది?

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అయితే ఇక్కడ కులాలు, మతాలే ఎక్కువగా ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. బీజేపీ హిందుత్వ ఓట్లపై ఎక్కువగా [more]

Update: 2020-10-08 17:30 GMT

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అయితే ఇక్కడ కులాలు, మతాలే ఎక్కువగా ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. బీజేపీ హిందుత్వ ఓట్లపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇక కాంగ్రెస్ ముస్లిం ఓటర్లను ఆకట్టుకుంటుంది. దేశవ్యాప్తంగా ఎలా ఉన్నప్పటికీ బీహార్ లో ముస్లింలు దాదాపు 22 శాతం వరకూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.

ముస్లిం సామాజిక వర్గం…..

బీహార్ లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 122 మాత్రమే. అయితే దాదాపు నలభై సీట్లలో ముస్లిం ఓటర్లు ప్రభావితం చేయనున్నారు. గత ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నా ముస్లిం ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించనున్నారు. ఈ ముస్లిం సామాజికవర్గం మొత్తం గంపగుత్తగా ఆర్జేడీ, కాంగ్రెస్ వైపు ఉంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ అత్యధిక స్థానాలను సాధించడానికి ఈ సామాజికవర్గం ఓటర్లే కారణమని చెప్పకతప్పదు.

ఆర్జేడీకి అండగా…..

గత ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి 11 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. గత శాసనసభలో 23 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక లోక్ సభ ఎన్నికల్లోనూ ముస్లిం ఓటర్లు ఆర్జేడీ పక్షానే నిలిచారు. బీజేపీ హిందూ పార్టీ గా ముద్రపడటంతో పాటు ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమికి ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో అండగా నిలిచారు. అప్పుడు బలమైన మహాకూటమిగా ఉండటంతో ముస్లిం ఓటర్లు మహాకూటమి వైపు నిలబడ్డారు.

ఈసారి ఎవరివైపో…?

ఇప్పుడు జేడీయూ, బీజేపీ కూటమికి ముస్లిం ఓటర్లు ఎంత వరకూ దగ్గరవుతారన్న ప్రశ్న తలెత్తుతోంది. ట్రిపుల్ తలాక్ తో ముస్లిం మహిళలు ఎక్కువగా బీజేపీ వైపు ఉంటారన్న అంచనా ఉంది. అయోధ్య, బాబ్రీ తీర్పులతో ఈ వర్గం తిరిగి కాంగ్రెస్, ఆర్జేడీ వైపు మొగ్గు చూపుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. కీలకమైన ముస్లిం సామాజికవర్గం దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుండటంతో ఈ వర్గం బీహార్ ఎన్నికల్లో కీలకంగా మారనుంది.

Tags:    

Similar News