లెఫ్ట్.. రైట్…. కు మరో దారి లేదట

ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాల దారెటన్నది ఈసారి ఆసక్తికరంగా మారింది. అన్ని పార్టీలూ వారి భావజాలానికి వ్యతిరేకంగా ఉండటంతో ఇప్పుడు ఏ పార్టీకి మద్దతివ్వాలన్నది సీపీఐ, సీపీఎం పార్టీల్లో [more]

Update: 2021-05-03 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాల దారెటన్నది ఈసారి ఆసక్తికరంగా మారింది. అన్ని పార్టీలూ వారి భావజాలానికి వ్యతిరేకంగా ఉండటంతో ఇప్పుడు ఏ పార్టీకి మద్దతివ్వాలన్నది సీపీఐ, సీపీఎం పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఏపీలో కమ్యునిస్టుల ప్రభావం ఒకప్పుడు ఉండేది. కానీ క్రమేణా ఏదో ఒక పార్టీతో కలసి ప్రయాణం చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తో కలసి పోటీ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రాతినిధ్యం లభించేది.

రాష్ట్ర విభజన తర్వాత…..

కానీ రాష్ట్ర విభజన తర్వాత మాత్రం కలసి రాలేదు. 2014లో సీపీఎం వైసీపీతో మనసు కలిపినా ఫలితం లేకుండా పోయింది. ఇక 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తో కలసి నడిచారు. ఆ ఎన్నికల్లోనూ జీరో ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీ పంచన చేరిపోయారు. ఇక జనసేనకు వామపక్షాలు దూరమయినట్లే. అయితే సీపీఎం కొంత పొత్తుల విషయంలో సంయమనం పాటిస్తుందనే చెప్పాలి.

టీడీపీతో కలసి నడవాలనుకున్నా….

సీపీఐ మాత్రం మొన్నటి వరకూ అనేక సమస్యలపై టీడీపీతో కలసి పోరాడింది. చంద్రబాబుతో కలసి సీపీఐ నేత రామకృష్ణ అనేక వేదికలను పంచుకున్నారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీతో కలసి బరిలోకిదిగి రెండు డివిజన్లను గెలుచుకుంది. టీడీపీతో కలసి నడుద్దామని భావిస్తున్న సీపీఐకి ఇప్పుడు చంద్రబాబు సయితం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ అంగీకరిస్తే ఆయన ఆ కూటమిలోకి వెళతారు.

వచ్చే ఎన్నికల్లో…..

అందుకే తిరుపతి ఉప ఎన్నికల్లో వామపక్షాలు తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాయి. సరే గెలుపోటములను పక్కన పెడితే టీడీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుంది. ఇక సీపీఎం కొంత అధికార వైసీపీకి దగ్గరగా జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. ఏపీ శాసనసభకు పదేళ్ల నుంచి దూరంగా ఉన్న వామపక్షాలు ఈసారి ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. మరి పరిస్థితులు చూస్తే ఏ పార్టీ వారి భావజాలానికి అనుకూలంగా లేదు. ఒంటరిగా పోటీ చేస్తారా? ఎవరితో కలసి వెళతారన్నది వారికే క్లారిటీ లేదు.

Tags:    

Similar News