ఇమ్రాన్ మ్యాచ్ కు టార్గెట్ మామూలుగా లేదు....!

Update: 2018-07-30 18:29 GMT

ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు అంతటా విన్పిస్తున్న పేరు. పాకిస్థానీలు ఆయనను అమితంగా ప్రేమిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరాధిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఆయనను ఆసక్తిగా గమనిస్తోంది. క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఆయన దేశాన్ని విజయపథంలో నడిపించగలరా? అన్న విషయమై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఆరు పదులు నిండిన ఈ లాహోర్ రాజకీయ వేత్త అస్థిర పాకిస్థాన్ ను సుస్థిర దిశగా నడిపించగలరా? ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగలరా? తీవ్ర వాదాన్ని తుదిముట్టించగలరా? సైన్యాన్ని దూరంగా ఉంచగలరా? దాయాది దేశమైన భారత్ తో సత్సంబంధాలను నెరపగలరా? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే తీరుపైనే ఇమ్రాన్ భవిష్యత్ ఆధార పడి ఉంటుంది. ఇది అంత తేలికైన విషయం కదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఏ ఒక్క ప్రధాని.....

పాకిస్థాన్ ఏడు దశాబ్దాల చరిత్రలో ఏ ఒక్క ప్రధానీ అయిదేళ్లు పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. అందరూ అర్థాంతరంగానే నిష్క్రమించారు. ఎంతటి ప్రచాదరణ గల నాయకులు పదవి చేపట్టినా ఇదే పరిస్థితి. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల నుంచి 30 ప్రధానులు మారారు. అంటే ఒక్కో ప్రధాని సగటు పదవీకాలం రెండేళ్లే. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో పార్లమెంటులో పూర్తి మెజారిటీ దక్కని ఈ మాజీ క్రికెటర్ ఎలా ముందుకు వెళతారన్న ప్రశ్న ఉత్పన్నమవ్వడం సహజం. పాకిస్థాన్ పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది సైన్యం. సైన్యం అండ లేకుండా ఏ ప్రధాని మనుగడ సాగించలేరన్నది చేదు నిజం. చరిత్ర చెబుతున్న సత్యం. ప్రస్తుతానికి సైన్యం, ఇమ్రాన్ ల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇ్రమాన్ ఏనాడూ ఎన్నికల ప్రచారంలో సైన్యాన్ని పన్నెత్తు మాట అనలేదు. అంతేకాక దానికి మద్దతుగా మాట్లాడారు. సైన్యం కూడా ఇమ్రాన్ ను వెనకేసుకొస్తోంది. దగ్గరుండి, పట్టుబట్టి అది ఇమ్రాన్ ను గెలిపించిందన్నది బహిరంగ సత్యం. అంతేగాక ప్రత్యర్థి పార్టీల ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఓడించిందన్న ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన బిలావల్ భుట్టో, ఆయన తండ్రి మాజీ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్ షరీఫ్) పార్టీకి చెందిన మాజీ ప్రధాని అబ్బాసీ వంటి ప్రముఖుల ఓటమి వెనుక సైన్యం హస్తం ఉందన్న ఆరోపణలను అంత తేలిగ్గా తోసిపుచ్చలేం.

సైన్యాన్ని కాదనే శక్తి......

విదేశాంగ విధానంలో సైన్యం జోక్యాన్ని కాదనే శక్తి ఏ ప్రధానికీ ఉండదు. ముఖ్యంగా భారత్ విషయంలో దానిదే పైచేయి. సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విదేశాంగ విధానంలోపెద్దగా మార్పులుండవు. భారత్ తో సత్సంబంధాలు ఆకాంక్షిస్తున్నట్లు పైకి చెబుతున్నప్పటికీ కాశ్మీర్ సమస్య, ఉగ్రవాదం వంటి కీలక అంశాల్లో పాత ప్రధానులకు భిన్నంగా ఇమ్రాన్ వెళ్లే పరిస్థితి లేదన్నది సుస్పష్టం. చైనాతో సత్సంబంధాలు కొనసాగించడం సాధారణమే. అమెరికాతో సంబంధాలు గత కొంతకాలంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ చైనా అండ చూసుకుని వాషింగ్టన్ ను లెక్క చేసే పరిస్థితి లేదు.

ఆర్థిక వ్యవస్థ దారుణంగా....

దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టడం ఈ మాజీ క్రికెటర్ కు అంత తేలికైన విషయం కాదు. ప్రస్తుతం దేశ ఖజానాలో విదేశీ మారక నిల్వలు 1100 కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి. 2,500 కోట్ల డాలర్ల వాణిజ్య లోటుతోసతమతమవుతోంది. దేశం ఇప్పుడు చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మిత్రదేశమైన చైనా ఆదుకోకుంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. రుణం కోసం అది పెట్టే షరతులకు తలూపక తప్పదు. ఉగ్రవాదాన్ని సాకుగా చూపి పాక్ కు అందించే సాయంలో అమెరికా భారీ కోత విధించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. మరో పక్క ద్రవ్యోల్బణం ఉరుముతుంది. ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడం భావి ప్రధాని ఇమ్రాన్ కు అంత తేలిక కాదు.

వీటి పీచమణుస్తారా?

ఉగ్రవాదానికీ, పాకిస్థాన్ కు విడదీయరాని సంబంధం ఉంది. భారత్ లో చిచ్చు పెట్టేందుకు ప్రోత్సహించిన ఉగ్రవాదం స్వదేశంలో కల్లోలం సృష్టిస్తున్నా అచేతనంగా ఉండాల్సిన పరిస్థితిలో దేశం ఉంది. లష్కరే తోయిబా, షర్కతుల్ అన్సార్, జైషే మహహ్మద్, షర్కతుల్ ముజాహిద్దీన్, అల్ బదర్ లష్కర్ జబ్బార్,ముతాషిదా జీహాద్ కౌన్సిల్, తెహ్రిక్ -ఈ-తాలిబాన్ పాకిస్థాన్ వంటి సంస్థలు ప్రస్తుతం చెలరేగిపోతున్నాయి. స్వయంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి చేతులు కాల్చుకున్నాయి. ఇమ్రాన్ కూడా ఇప్పటి వరకూ ఉగ్రవాదులను ఒక్క మాట అనలేదు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం పీచమణచడం చెప్పినంత తేలిక కాదు.

ఇమ్రాన్ అతీతుడు కాదు.....

మత ఛాందసవాదానికి మరోపేరు పాకిస్థాన్. అధికారం చేపట్టిన వారూ ఇందుకు మినహాయింపు కాదు. ఇమ్రాన్ కూడా ఇదే కోవలోని వ్యక్తి. చివరి ప్రవక్త నాకు స్ఫూర్తి, ఆయన బాటలోనే ప్రయాణిస్తా అన్న ఇమ్రాన్ మాటల్లోనే మతవాదం కనపడుతోంది. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడం అసాధ్యం. పాకిస్థాన్ వ్యవస్థలో అవినీతి ఊడలు దిగింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప చేతల్లో ఏమీ ఉండటం లేదు. అవినీతిని అరికట్టడం అంత తేలికైన విషయం కాదు. ఏతావాతా తేలేదేమంటే.... ఇమ్రాన్ ముందు అనేక గడ్డు సవాళ్లు నిలిచి ఉన్నాయి. వీటిని అధిగమించడం చెప్పినంత తేలిక కాదు. ఈ విషయంలో ఆయన విజయుడు కావాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. కానీ అది అసాధ్యమని గత అనుభవాలు చెబుతున్నాయి. ఇమ్రాన్ చరిత్ర సృష్టిస్తారా? లేక చరిత్రలో కలసిపోతారా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News