లాహోర్ ఎక్స్ ప్రెస్...దూసుకొస్తోంది...!

Update: 2018-07-03 18:29 GMT

ఇమ్రాన్ ఖాన్.... ఈపేరు ఇప్పుడు పాకిస్థాన్ రాజకీయాల్లో మార్మోగి పోతుంది. ఆల్ రౌండర్ క్రికెటర్ ఇమ్రాన్ పాకిస్థాన్ కు అనేక విజయాలు అందించిన ఈ కెప్టెన్ ఇప్పుడు దేశానికి సమర్థవంతమైన కెప్టెన్సీని అందిస్తానని ప్రజల ముందుకు ధైర్యంగా వస్తున్నారు. ఈనెల 25వ తేదీన జరగనున్న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ (మన దేశ పార్లమెంటు ఎన్నికల మాదిరి) ఎన్నికలలో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినీనటులు, కార్పొరేట్ దిగ్గజాలు రాజకీయాల్లో రాణించడాన్ని ప్రపంచం గమనించింది. కానీ ఒక క్రికెటర్ రాజకీయాల్లోకి రావడం అరుదైన విషయమే. మనదేశంలో కూడా నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అజారుద్దీన్ వంటి క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఏకంగా ఒక క్రికెటర్ పార్టీ పెట్టడం గతంలో ఎన్నడూ జరగలేదు. కానీ ఇమ్రాన్ ఖాన్ ఏకంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించడం సంచలనం కలిగించే విషయమని చెప్పడం అతిశయోక్తి కాదు.

బహుముఖ....

పాక్ క్రికెటర్లు1992లో వరల్డ్ కప్ సాధించడం ద్వారా చరిత్రలో నిలిచిపోయారు. దాయాది దేవం కప్ గెలవడం అదే తొలిసారి. మళ్లీ ఇంతవరకూ పాకిస్థాన్ ప్రపంచ కప్ ను గెలవకపోవడం గమనార్హం. 3,807 పరుగులు, 362 వికెట్లు తీయడం ద్వారా ఉత్తమ క్రికెటర్ గా నిలిచాడు ఇమ్రాన్. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించడం ద్వారా ఆల్ రౌండర్ గా పేరు గడించాడు. 1981-82లో లాహోర్ లో శ్రీలంకపై 58 పరుగులిచ్చి, 8 వికెట్లు తీయడం ద్వారా సంచలనం సృష్టించారు. 1991లో తన తల్లి జ్ఞాపకార్థం లాహోర్ లో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కోసం విరాళాలు సేకరించారు. 25 మిలియన్ డాలర్లతో 1994లో తొలుత లాహోర్ లో ఆస్పత్రిని ప్రారంభించారు. 2015లో పెషావర్ లో మరొకటి ప్రారంభించారు. క్రికెటర్ గా, వ్యాఖ్యాతగా, ఆధ్మాత్మకవేత్తగా, బ్రాడ్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం కులపతిగా ఇమ్రాన్ ఖాన్ బహుముఖ సేవలు అందించారు. తాను ఎంచుకున్న ప్రతి బాధ్యతను నూటికి నూరు శాతం విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. అంకిత భావంతో పనిచేయడం ఆయనకు అలవాటుగా మారింది. లక్ష్యం పూర్తయ్యే వరకూ వెనుతిరిగి చూడకపోవడం ఆయన ప్రత్యేకతల్లో ఒకటి.

మెరుపులు....మరకలు....

ఒకసారి ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత, క్రికెట్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే మెరుపులు, మరకలూ రెండూ కనపడతాయి. క్రికెటర్ గా విజయవంతమైన ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మూడు వివాహాల కారణంగా ఖాన్ వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నం అయింది. 1952 అక్టోబర్ 5న లాహోర్ లో జన్మించిన ఇమ్రాన్ ఆక్స్ ఫర్డ్ విద్యావంతుడు. పస్తూన్ల కుటుంబంలో జన్మించిన ఖాన్ చిన్నతనంలోనే క్రికెట్ పట్ల ఆకర్షితుడయ్యాడు. 13వ ఏట నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆక్స్ ఫర్డ్ లో విద్యాభ్యాసం అనంతరం 18 ఏళ్ల వయస్సులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చేరారు. 1976 నుంచి 1992 వరకూ 18 ఏళ్ల పాటు క్రికెటర్ గా దేశానికి సేవలు అందించారు. ఇంత సుదీర్ఘకాలం క్రికెటర్ గా కొనసాగడం ఆషామాషీ విషయం కాదు. అందులో పదేళ్లకు పైగా (1982-92) కెప్టెన్ గా వ్యవహరించడం ఒక్క ఇమ్రాన్ ఖాన్ కే సాధ్యపడింది. అటు క్రికెటర్ గా , ఇటు కెప్టెన్ గా రెండు పాత్రల్లోనూ చక్కగా రాణించారు. చివరి దశలో ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో ప్రవేశించారు. 1996 ఏప్రిల్ 8న ఆయన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని స్థాపించారు. పాకిస్తాన్ ను ప్రపంచంలో ఒక విజయవంతమైన దేశంగా చూడాలన్నది ఖాన్ కల. 2002 అక్టోబర్ లో తొలిసారి జాతీయ అసెంబ్లీకి ఎన్నికై సంచలనం సృష్టించారు. 2013లో మళ్లీ ఎన్నికయ్యారు. అంతేకాక ఆయన పార్టీ పీటీఐ రెండో అతి పెద్ద పార్టీగా ఆవతరించింది. ఆయన పార్టీ ఖైబర్ ఫక్తూన్ భ్వ ప్రావిన్స్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుండటం విశేషం. పంజాబ్, సింథ్ ప్రావిన్స్ లలో ప్రధాన ప్రతిపక్షాన్ని సాధించింది.

నవాజ్ ను పట్టుబట్టి.....

రేపటి ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల ప్రకారంచూస్తే ఈ అభిప్రాయాన్ని అంత తేలిగ్గా తోచిపుచ్చలేం. ఇమ్రాన్ పార్టీ అధికారంలో ఉన్నఖైబర్ ఫక్తూన్ భ్వా ప్రావిన్స్ 2013-14 సంవత్సరానికి పన్ను రహిత బడ్జెట్ ను సమర్పించడం విశేషం. మాటలు కన్నా చేతలు ముఖ్యమన్నది ఇమ్రాన్ అభిప్రాయం. 2013 ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ రిగ్గింగ్ ద్వారా అధికారంలోకి వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ అనేక మార్లు ఆరోపించారు. నవాజ్ షరీఫ్ అవినీతిని వెలికితీయడంలో కీలక పాత్ర పోషించారు. పనామా పత్రాల కుంభకోణంలో నవాజ్ షరీఫ్ పాత్రను నిరూపించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. న్యాయపోరాటం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నవాజ్ షరీఫ్ చివరికి ప్రధాని పదవిని కోల్పోవలసి రావడం గమనార్హం. రేపటి ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా ఆయన పరిగణిస్తున్నారు.

ఆ రెండు పార్టీలకూ.....

ఈ నెల 25న జరిగే ఎన్నికల్లో విజేతగా నిలుస్తానన్న ధీమాను కనబరుస్తున్నాడు ఈ మాజీ క్రికెటర్. పార్టీ సారథిగా ఒంటిచేత్తో ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక,ప్రచారం, వ్యూహ ప్రతివ్యూహాలు, ఎన్నికల ప్రణాళిక వంటి అంశాలను ఒక్కరే సమన్వయ పరుస్తున్నారు. ప్రస్తుత ఎన్నికలలో రావల్పిండి, మియాన్ వలి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఉగ్రవాదులకు, సైన్యానికి ఖాన్ మద్దతుదారన్న పేరుంది. ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాల కారణంగానే ఆయనను ‘‘తాలిబాన్ ఖాన్’’ అని పిలుస్తుంటారు కొందరు. ప్రస్తుత ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్, భుట్టోల కుటుంబ పార్టీ అయిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ఇమ్రాన్ పార్టీ లు బరిలో ఉన్నాయి. అవినీతి ఆరోపణల కారణంగా పీఎంసీ, సమర్థనాయకత్వం లేమి ఫలితంగా పీపీపీ వెనుకబడి ఉన్నాయని, ఇమ్రాన్ ఖాన్ పార్టీకే విజయావకాశాలున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే 1995 మే 16. జెమీనా గోల్డ్ స్మిత్ ను పారిస్ లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. 2004 జూన్ 22న ఈ జంట విడాకులు తీసుకుంది. 2015లో బ్రిటీష్ -పాకిస్థాన్ జర్నలిస్ట్ ను వివాహమాడారు. అదే ఏడాది అక్టోబర్ 22న విడిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆధ్మాత్మిక సలహాదారు బుష్రామనికను ఖాన్ పెళ్లి చేసుకున్నారు. వీరి బాంధవ్యం సవ్యంగా లేదన్న వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగతం ఎలా ఉన్నప్పటికీ రాజకీయ జీవితంలో విజయం తనదేనని ఇమ్రాన్ ఖాన్ బలంగా విశ్వసిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News