జగన్ కు అడ్వాంటేజీయేనా…?

ఆంధ్రప్రదేశ్ కు ఏమి చేసినా చేయకపోయినా ఇది మాత్రం చేయండని గత ప్రభుత్వంలో చంద్రబాబు కాలుకు బలపం కట్టుకుని హస్తిన చుట్టూ తిరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి అదే [more]

Update: 2019-07-25 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ కు ఏమి చేసినా చేయకపోయినా ఇది మాత్రం చేయండని గత ప్రభుత్వంలో చంద్రబాబు కాలుకు బలపం కట్టుకుని హస్తిన చుట్టూ తిరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి అదే పదేపదే కోరారు. అయినా ససేమిరా కాదు పొమ్మంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ వీరు అడిగింది దేని కోసం మోడీ సర్కార్ కాదన్నది ఏది అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం. దీనివల్ల తమ పార్టీకేమీ కలిసి వచ్చేది లేదన్న రాజకీయ కోణంతో కమలం నాడు ఆలోచన చేయడంతో విభజన చట్టంలో అవకాశం వున్నా కేంద్రం పక్కన పెట్టేసింది. 2026 వరకు డి లిమిటేషన్ ప్రస్తావనే లేదని తేల్చేసింది.

ఇప్పుడు మాత్రం ఎస్ అంటుంది …

తెలుగు రాష్ట్రాల్లో కాషాయ జండా ఎగురవేయడానికి బిజెపి అవసరమైన అన్ని మార్గాల్లో వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు నియోజకవర్గాల పెంపు ఫైల్ బూజు దులిపి ఎన్నికల సంఘానికి పంపడం హోం శాఖలో అవసరమైన కసరత్తు పూర్తి చేసేస్తోంది. జమ్మూ కాశ్మీర్, సిక్కిం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో నియోజకవర్గాల పెంపు కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే లాంఛనాలు పూర్తి కావలిసి వుంది. సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు ఎన్నికల కమిషన్ నుంచి సేకరించిన సమాచారం బయటకు రావడంతో ఈ విషయం బయటకు పొక్కేసింది.

ఎపి లో 50, తెలంగాణ లో 34 …

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలను 225 స్థానాలకు పెంచనున్నారు. అంటే 50 అసెంబ్లీ సీట్లు అదనంగా రానున్నాయి. ఇక తెలంగాణ లో 119 నుంచి 153 స్థానాలకు పెరగనున్నాయి. అంటే అక్కడ 34 సీట్లు అదనం కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెరగనున్నట్లు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గానికి రెండు లక్షల ఓటర్లకు ఒక శాసన సభ్యుడు ఉండాలన్న నిబంధనను అనుసరించి ఈ సీట్లను పెంచుకునే వెసులుబాటు రాజ్యాంగ బద్దం గా ఉన్నప్పటికీ ఎపి పునర్విభజన చట్టంలో కూడా అవకాశం కల్పించారు.

పెంపుతో ఎవరికి లాభం …?

గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సంఖ్య పెరిగి ఉంటే టిడిపి కి ఎంతోకొంత లబ్ది చేకూరి ఉండేది. అయితే వైసిపి గాలిలో తుక్కుతుక్కు అయిన టిడిపికి ఇప్పుడు ఈ పెంపు తో కలిసి వచ్చేది తక్కువే. నేతలంతా పక్కపార్టీలవైపు చూస్తున్న నేపథ్యంలో గెలుపు గుర్రాలు మరింత కష్టంగా మారే అవకాశాలు వున్నాయి. ఇక అధికారంలో వున్న వైసిపి కి ఎపి లోను, టిఆర్ఎస్ కు తెలంగాణ లో లబ్ది చేకూరనుంది. అదేవిధంగా బిజెపి కి సైతం కులాలు మతాల ఆధారంగా ఓటు బ్యాంక్ లు చూసుకుని నియోజకవర్గాలు విభజిస్తారు కనుక ఎంతోకొంత లబ్ది చేకూరుతుందని అంటున్నారు విశ్లేషకులు.

పొత్తు పెట్టుకున్నా…..

అలాగే ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలతో ఎవరితో పొత్తు పెట్టుకున్నా సీట్ల గోల వుండబోదన్నది కమలం వ్యూహం గా కనిపిస్తుంది. ఇక తెలంగాణాలో సైతం అదేవిధంగా కలిసి వస్తుందని కమలనాధుల ఎత్తుగడ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇరు రాష్ట్రాలకు ఈ పెంపు మరింత ఆర్థికభారం ప్రజలపై పడేలా చేయడమే తప్ప దీనివల్ల ప్రయోజనం శూన్యమని మరోపక్క ప్రజాస్వామ్య వాదులు పెదవి విరుస్తున్నారు. ఎవరి గోల ఎలావున్నా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుదల తమ తమ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల్లో బెర్త్ దొరక్క వెయిటింగ్ లిస్ట్ లో వున్న ద్వితీయ శ్రేణి రాజకీయ నిరుద్యోగులకు శుభవార్తే.

Tags:    

Similar News