ఆపరేషన్ కాంగ్రెస్… రేవంత్ టార్గెట్..?

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం అధికార టీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమే. జనంలోకి వెళ్లే నేత రేవంత్ రెడ్డి. ఆ సంగతి కేసీఆర్ కు [more]

Update: 2021-07-10 11:00 GMT

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం అధికార టీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమే. జనంలోకి వెళ్లే నేత రేవంత్ రెడ్డి. ఆ సంగతి కేసీఆర్ కు తెలియంది కాదు. గతంలో మాదిరిగా కాంగ్రెస్ ను సులువుగా తీసుకునే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని కాదు గాని, గతంలో కంటే మెరుగైన ఫలితాలు మాత్రం సాధిస్తుందనే చెప్పాలి. అందుకే రేవంత్ రెడ్డిని ముందుగానే కంట్రోల్ చేయాలి. కేసీఆర్ లక్ష్యమదే.

ప్రజల్లోకి వెళ్లక ముందే…?

రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళితే ఎంతో కొంత మార్పు తప్పదు. తటస్థ ఓటర్లు, ఒక వర్గం ఓటర్లను కూడా ఆయన ఆకట్టుకునే అవకాశముంది. ఇటీవల ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడించినంత పనిచేశారు. ప్రజల్లోకి బలంగా వెళ్లినందునే తీన్మార్ మల్లన్నకు అన్ని ఓట్లు వచ్చాయన్నది వాస్తవం. ఇప్పుడు రేవంత్ జనం బాట పడితే మార్పయితే కొంత రాక తప్పదు.

మైండ్ గేమ్ కోసం….

అందుకే కేసీఆర్ మైండ్ గేమ్ ను ప్రారంభించేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. వీలయినంత మంది కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలను తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం పోగొట్టాలన్నదే అసలు వ్యూహం. ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు పార్టీలోకి వస్తే వారికి పదవులు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సిద్ధమయినట్లు సమాచారం.

దూకుడుకు కళ్లెం….

దీంతో పాటు రేవంత్ రెడ్డి సన్నిహితులైన నేతలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకురావాలన్నది గులాబీ పార్టీ వ్యూహం. హుజూరాబాద్ నుంచే దీనిని ప్రారంభిస్తారని తెలిసింది. రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలంటే ముఖ్యనేతలను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయించడం ద్వారా తొలి దెబ్బ కొట్టాలన్నది కేసీఆర్ ఆలోచన. అన్నీ సక్రమంగా, అనుకూలంగా జరిగితే త్వరలోనే కాంగ్రెస్ నేతలు కొందరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News