ముప్పు వారి నుంచేనా?

అన్నాడీఎంకే మరోసారి ఈ ఎన్నికల్లో గెలిస్తే హ్యాట్రిక్ విజయం సాధించినట్లే. రెండు సార్లు జయలలిత పార్టీని వరసగా అధికారంలోకి తెచ్చారు. జయలలిత మరణం తర్వాత జరుగుతున్న ఈ [more]

Update: 2021-04-02 17:30 GMT

అన్నాడీఎంకే మరోసారి ఈ ఎన్నికల్లో గెలిస్తే హ్యాట్రిక్ విజయం సాధించినట్లే. రెండు సార్లు జయలలిత పార్టీని వరసగా అధికారంలోకి తెచ్చారు. జయలలిత మరణం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం అంత సులువేమీ కాదు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటం, తన కూటమిలోని పార్టీలు బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న అన్నాడీఎంకేకు ఈసారి ఆ రెండు పార్టీలు గట్టి దెబ్బ తీస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రెండు సార్లు వరసగా గెలిచి….

అన్నాడీఎంకే వరసగా రెండు సార్లు గెలిచింది. ఈసారి గెలిచేందుకు బరిలోకి దిగింది. పళనిస్వామి నేతృత్వంలో కూటమి బయటకు బలంగా కన్పిస్తున్నా డీఎండీకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీల నుంచి అన్నాడీఎంకే కు ముప్పు పొంచి ఉందని చెప్పాలి. అన్నాడీఎంకేకు క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకుఉంది. ఎంజీఆర్, జయలలిత వేసిన పునాదులు ఆ పార్టీని ఇప్పటీకి అభిమానించే వారు లక్షల సంఖ్యలో ఉన్నారు.

దినకరన్ పార్టీతో…

కానీ అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పేరుతో బరిలోకి దిగారు. ఈ పార్టీలో ఉన్న వారంతా పాత అన్నాడీఎంకే నేతలే. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దినకరన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్థికంగా కూడా దినకరన్ పార్టీ బలంగా ఉండటంతో అన్నాడీఎంకే ఓటు బ్యాంకును చీల్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా అమ్మ పాలన తెస్తానంటూ దినకరన్ చేస్తున్న ప్రచారం కూడా అన్నాడీఎంకేకు ఇబ్బందిగా మారుతుంది.

విజయ్ కాంత్ ఎఫెక్ట్….

మరోవైపు కెప్టెన్ విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూడా అన్నాడీఎంకే కూటమి నుంచి విడిపోయి దినకరన్ పార్టీ కూటమిలో చేరిపోయింది. మొత్తం 60 స్థానాల్లో విజయ్ కాంత్ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. విజయ్ కాంత్ కు తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ పార్టీ కూడా అన్నాడీఎంకే ఓట్లనే ఎక్కువగా చీల్చే అవకాశముందంటున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపోటముల్లో ఈ రెండు పార్టీలు కీలకంగా మారనున్నాయి. దీంతో అన్నాడీఎంకే ఈ రెండు పార్టీల అభ్యర్థులతో దాదాపు అన్ని చోట్ల ఇబ్బందులు పడుతుంది.

Tags:    

Similar News