అన్నీ వాళ్లకేనా…ఫ్యాన్ పార్టీలో సెగలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవలేదు. అప్పుడే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి మొదలయింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే [more]

Update: 2019-07-25 13:30 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవలేదు. అప్పుడే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి మొదలయింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తమకు పదవులు దక్కుతాయని ఆశలు పెట్టుకున్న నేతలకు మొండిచేయి చూపిస్తున్నారన్న ఆవేదన పార్టీలో నెలకొంది. జగన్ వెంట దాదాపు పదేళ్ల పాటు నడిచిన నేతలకు కూడా పదవులు దక్కకపోవడంపై అసంతృప్తి ఫ్యాన్ పార్టీలో మొదలయిందంటున్నారు.

నామినేటెడ్ పోస్టులను….

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టారు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని కారణాలతో ఎక్కువమంది ముఖ్యనేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయారు వైఎస్ జగన్. అయితే మంత్రి పదవులు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించాల్సిన బాధ్యత వైఎస్ జగన్ పై పడటంతో ఆయన వారికి నామినేటెడ్ పోస్టులను ఇవ్వడం ప్రారంభించారు.

అన్నీ ఎమ్మెల్యేలకే….

తీవ్రమైన అసంతృప్తితో ఉన్న ఆర్.కె.రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ గా నియమించారు. తిరుపతి అర్బన్ డెవెలెప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు వైఎస్ జగన్. ఇక కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా జక్కంపూడి రాజాకు ఇస్తూ ఇటీవలే అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇక వీరితో పాటు అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లకు కూడా నామినేటెడ్ పోస్టులను వైఎస్ జగన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యనేతల్లో అసంతృప్తి…..

ఈ నేపథ్యంలో అన్ని ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్యేలకు ఇస్తే పార్టీ కోసం పనిచేసిన వారి సంగతేంటన్నది ప్రశ్న. వైఎస్ జగన్ తన పాదయాత్రలో తన వెంట కష్టపడిన వారితోపాటు ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వారికి కూడా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకూ నామినేటెడ్ పోస్టులన్నీ ఎమ్మెల్యేలకే వెళుతుండటంతో ముఖ్యనేతల్లో అసహనం వ్యక్తమవుతుంది. దీనిపై ఫ్యాన్ పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చే జరుగుతుంది.

Tags:    

Similar News