అక్క‌డ శ‌త్రువులంద‌రూ ఒకే గూట్లో... ఇంట్ర‌స్టింగ్ ఫైట్‌

Update: 2018-07-21 05:00 GMT

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్ గులాబీ పార్టీలో క‌త్తుల కోలాటం త‌ప్పేలా లేదు. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఏడెనిమిది మంది కీల‌క నేత‌లంద‌రూ ఇక్క‌డి నుంచి టికెట్ రేసులో ఉన్నారు.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వీరు.. ఇప్పుడు ఒకే గూటికి చేరినా టికెట్ విష‌యంలో ప్ర‌త్య‌ర్థులుగానే ఉండే ప‌రిస్థితులు ఉన్నాయి.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రిని టికెట్ వ‌రిస్తుందో ? సీఎం కేసీఆర్ ఎవ‌రిని క‌ర‌ణిస్తారో ? తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ చేరిక‌తో ఆ ప‌రిస్థితులు మ‌రింత గంద‌ర‌గోళంగా మారాయ‌నే టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్ప‌టికే ముగ్గ‌రు...

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఎంతో కీల‌కంగా ఉండే ఈ స్థానంపై స్థానిక నేత‌ల‌తోపాటు స్థానికేత‌రులు కూడా క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో ఓ ఎంపీ కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో చాలా వ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులే కావ‌డం గ‌మ‌నార్హం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి దానం నాగేందర్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న గ‌తంలో ప్రాతినిథ్యం వ‌హించిన ఆసిఫ్‌న‌గ‌ర్ ర‌ద్దు కావ‌డంతో 2009లో ఇక్క‌డ పోటీ చేసి గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి టికెట్ ఆశించినా ద‌క్క‌లేదు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌ వైఎస్సార్‌సీపీలో చేరి 2014లో టికెట్ పొందారు. ఇక‌ టీఆర్‌ఎస్‌ నుంచి మన్నె గోవర్ధన్‌రెడ్డి బరిలో దిగారు. అయితే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ముగ్గురు కూడా ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకున్నారు.

దానం నాగేంద‌ర్ చేరిక‌తో...

ఆ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినప్పటికీ పార్టీ కార్య‌క్ర‌మాల్లో మ‌న్నె గోవ‌ర్ధ‌న్‌రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌నే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్నారు. ఇక ప్ర‌స్తుతం చూస్తుంటే ఇన్‌చార్జ్‌గా ఉన్న గోవ‌ర్థ‌న్‌రెడ్డితో పాటు విజ‌యారెడ్డి, కొత్త‌గా పార్టీలో చేరిన దానం నాగేంద‌ర్ ముగ్గ‌రు ఈ సీటుపై పెద్ద ఆశ‌ల‌తోనే ఉన్నారు. అదేవిధంగా..టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె కేశవరావు కుమార్తె, బంజార‌హిల్స్ కార్పొరేటర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కూడా ఖైరాతాబాద్ టికెట్ రేసులో ఉన్నాయి.

స్థానికేత‌రులు కూడా...

ప్ర‌ముఖ వైద్యుడు, భువ‌న‌గిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు నగర వాసులతో మంచి పరిచయాలున్నాయి. ఆయ‌న ఇక్క‌డ వైద్యుడిగా ప‌నిచేసిన నేప‌థ్యం క‌లిసొస్తుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయ‌న ఖైర‌తాబాద్ సీటు అడుగుతున్న‌ట్లు తెలిసింది. అలాగే..ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్‌లో కీల‌క‌ నేత, సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఖైర‌తాబాద్ టికెట్ రేసులో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తాను జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న నేపథ్యంలో తనకు ఖైరతాబాద్ టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ వ‌ర్గాలుగా చీలిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక టికెట్ ఎవ‌రికి వ‌స్తుందో చూడాలి.

 

Similar News