గులాబీ బాస్ కి ఇంకా క్లారిటీ రాలేదా ?

హుజూరాబాద్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ నియోజక వర్గం. ఇక్కడ జరగనున్న ఉపఎన్నిక లో విజయంపై సర్వత్రా ఉత్కంఠ. నిన్న మొన్నటివరకు టీఆర్ఎస్ లో [more]

Update: 2021-08-07 00:30 GMT

హుజూరాబాద్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ నియోజక వర్గం. ఇక్కడ జరగనున్న ఉపఎన్నిక లో విజయంపై సర్వత్రా ఉత్కంఠ. నిన్న మొన్నటివరకు టీఆర్ఎస్ లో ఉండి బహిష్కృతుడై బిజెపి నుంచి బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ అడ్డా హుజురాబాద్. ఆరుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఈటలకు ఈ నియోజకవర్గంలో తిరుగులేదన్నది అందరి అభిప్రాయం. తనతో పెట్టుకుంటే ఎవరికైనా శంకరగిరిమాన్యాలు పట్టించేయడం ఖాయమనే సందేశం హుజురాబాద్ నుంచి ఇచ్చేందుకు కేసీఆర్ తొడకొట్టారు. అందుకోసం ఆయన అన్ని అస్త్రాలు ఎక్కుపెట్టారు. అడిగినా అడక్కపోయినా హుజూరాబాద్ లో దళితబంధు తో సహావరాల జల్లు కురిపించేస్తున్నారు. అయినా కానీ ఇంకా గులాబీ దళంలో ఎక్కడో తమ విజయంపై అనుమానాలు ఉన్నట్లు వారి దూకుడు స్పష్టం చేస్తుంది.

ఎన్నిక వాయిదాకు ప్రయత్నం …

హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా ను నేరుగా కోరితే విపక్షాలకు దొరికిపోతారు. అందుకే కేసీఆర్ తెలివిగా కరోనా ఉన్నందున ఎమ్యెల్సీ ఎన్నికల వాయిదాను కోరుతూ ఎన్నికల కమిషన్ కి లేఖ వ్రాశారు. అవి వాయిదా పడితే ఆటోమాటిక్ గా హుజూరాబాద్ ఉప ఎన్నికలు వాయిదా పడక తప్పదు. అప్పుడు మరిన్ని పథకాలను ఓటర్లకు అందించేందుకు అవసరమైనంత సమయం ఉంటుందనేది అధికార పార్టీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశం గమనించే ఇప్పటికే కాంగ్రెస్ సహా విపక్షాలు తక్షణం హుజూరాబాద్ ఉప ఎన్నిక ను ప్రకటించాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి.

ప్రకటిస్తున్న పథకాలు…

సర్కార్ ప్రకటిస్తున్న పథకాలకు బ్రేక్ లు వేసేందుకు ఎన్నికల సంఘానికి లేఖలతో పాటు కొందరు కోర్టు గుమ్మం కూడా తొక్కేశారు. దాంతో ఉన్న తక్కువ సమయంలో వీలైనంత మందిని ఆకర్షించే కార్యక్రమంలో మరింత బిజీ అయిపొయింది గులాబీ దళం. మరో పక్క త్వరలోనే కాంగ్రెస్ సైతం హుజూరాబాద్ లో తమ అభ్యర్థిని ముందుగా ప్రకటించడానికి కసరత్తు ముమ్మరం చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల కసరత్తును ఎన్నికల సంఘం కూడా మొదలు పెట్టినట్లు సమాచారం రావడంతో హుజూరాబాద్ లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.

Tags:    

Similar News